స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ కె.ఎన్.మల్లీశ్వరి
కొన్ని దారుణాలపై.. సమరశంఖం పూరిస్తే సరిపోదు. విప్లవ నినాదాలిస్తే సరిపోదు. పిడికిలి బిగిస్తే సరిపోదు. ప్రసంగాలు వినిపిస్తే సరిపోదు. మరేం చేయాలి? అక్షరాస్త్రాలుసంధించాలి. ప్రొఫెసర్ మల్లీశ్వరి అదే పని చేస్తున్నారు.
వాకపల్లి గిరిజన మహిళల మీద జరిగిన దాడి గురించిన కథనాలు చదవడం, వినడమే కాకుండా వాస్తవిక పరిస్థితులను పరిశీలించడానికి వాకపల్లి వెళ్లారు ప్రొఫెసర్ కె.ఎన్.మల్లీశ్వరి. ఆ పరిశీలనను సాక్షి పత్రికలో వ్యాసంగా రాశారు. ఆ వ్యాసానికి ఇటీవలే ప్రతిష్ఠాత్మకమైన లాడ్లి మీడియా అవార్డు అందుకున్నారు. ‘వాకపల్లి మహిళల పోరాటానికి సామాజిక మద్దతు తగినంతగా లభించడం లేదు. ఇతర రాష్ట్రాలకు, జాతీయ స్థాయి పాత్రికేయుల దృష్టికి విషయాన్ని చేరవేయాలనే సంకల్పంతోనే ఈ వ్యాసాన్ని అవార్డుకు పంపించాను’ అంటారు మళ్లీశ్వరి.
సామాజిక ఉద్యమకారిణి
ఏలూరు దగ్గర కొక్కిరపాడులో పుట్టిన మల్లీశ్వరి ప్రస్తుతం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ కార్యదర్శి. సామాజికాంశాల మీద రచనలు చేస్తారు. అందుకోసం స్వయంగా ఆయా ప్రదేశాల్లో పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకుని వ్యాసాలు రాస్తుంటారు. అలా గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్, పోలవరం నిర్వాసితులు, గంగవరం పోర్టు అంశాల మీద కూడా వ్యాసాలు రాశారు. ఆంధ్రా యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తున్న సమయంలో సారా ఉద్యమం ఊపందుకుంది.
అప్పుడు యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులను సమీకరించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలాగే యూనివర్సిటీలలో పిహెచ్‌డి చేస్తున్న అమ్మాయిలకు ఎదురయ్యే బయటకు కనిపించని లైంగిక వేధింపుల మీద గళం విప్పారు. వేధింపులు తీవ్రమైతే పోరాడటానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని గట్టిగా ఇవ్వగలిగారు మల్లీశ్వరి. ‘‘నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సమాజం మీద స్త్రీవాద ఉద్యమాలతోపాటు రచయిత్రుల ప్రభావం ఎక్కువగా ఉండేది.
ఆ ప్రభావంతోనే రచయిత్రులను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ‘మనలో మనం’ అని ఒక ప్రయత్నం చేశాను. అది నేను ఊహించనంత విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా (సమైక్యాంధ్రప్రదేశ్) దాదాపు రెండు వందల మంది మహిళలు హాజరయ్యారు. దాంతో కొత్త ఉత్సాహం వచ్చింది. భావసారూప్యం కలిగిన వారితో కలిసి ప్రరవే ని ప్రారంభించాం. తన వృత్తి పాఠాలు చెప్పడం, ప్రవృత్తి సామాజికాంశాల మీద స్పందించడం’’ అంటారు మల్లీశ్వరి.
‘వాకపల్లి’ పై అక్షరయుద్ధం
‘‘నా తొలి రచన మెర్సీకిల్లింగ్ కథాంశంగా రాసిన ‘మరణం నా నేస్తం’. 1991లో రాశాను. ఆ తర్వాత కూడా రాస్తూనే ఉన్నాను. కానీ అత్యంత సంతృప్తినిస్తున్న రచన మాత్రం ‘నీల’ మాత్రమే. నీల కోసం ఐదారేళ్లు సమాజాన్ని అధ్యయనం చేశాను. అందుకే అంత సంతృప్తి కలుగుతోంది. వాకపల్లి మహిళల పోరాటానికి నా వంతు మద్దతుగా వ్యాసాలు రాస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు రాస్తూనే ఉంటాను. సోషల్ యాక్టివిస్టు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆవేశంగా స్పందించి నాలుగైదు రోజుల తర్వాత ఆ సంగతి మర్చిపోవడం కాదు. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అది పూర్తయ్యే వరకు ఆ అంశాన్ని వదలకూడదు. నేనదే నమ్ముతాను.
వాకపల్లి సంఘటనను జాతీయ వేదిక మీదకు తీసుకెళ్లడం ద్వారా ఆ మహిళలకు మరికొంత మంది మద్దతు లభిస్తుంది. పత్రికల్లో వీలయినన్ని ఎక్కువ వ్యాసాలు వస్తుంటే కోర్టు తీర్పు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ మహిళల్లో ఇద్దరు చనిపోయారు. ఒకామె పాము కాటుతో మరణించగా, మరొకామెది సహజ మరణం. తీర్పు ఆలస్యంగా వస్తే అది న్యాయమైనా సరే, వారికి జరిగేది అన్యాయమే. అందుకే న్యాయపోరాటంలో వాకపల్లి గిరిజన మహిళలకు అండగా అక్షరపోరాటం చేస్తున్నాను’’ అని తెలిపారు మల్లీశ్వరి.
ఆగని పోరాటం
విశాఖ ఏజెన్సీలో మాడుగుల మండలంలో ఉంది వాకపల్లి గ్రామం. గడచిన పదేళ్ల వరకు ఆ పేరుతో ఒక గ్రామం ఉందనే సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. అయితే పదేళ్ల నుంచి వాకపల్లి పేరు వినని తెలుగు వాళ్లు లేరు. ఇప్పటికీ వాకపల్లి పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. అప్పటి దురాగతం తరచూ గుర్తుకు వస్తూనే ఉంది.
ఏజెన్సీ ఏరియా దాటి బయటకు రాకుండా బతుకులను వెళ్లబారుస్తున్న అడవి తల్లులు న్యాయం కోసం పదేళ్లుగా కోర్టుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. న్యాయాన్ని అర్థ్ధిస్తూనే వారిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన తొమ్మిది మంది.. పోయిన తమవారి తరఫున కూడా పోరాడుతున్నారు. కల్మషం తెలియని గిరిజనానికి జరిగిన ఆ అన్యాయాన్ని చెప్పడానికి మాటలు రావు, రాయడానికి పేజీలు చాలవు.
(నిందితులను అరెస్టు చేయాలని గళమెత్తిన మహిళాలోకం (ఫైల్ ఫొటో))
పాశవికంగా లైంగిక దాడి
కొందు, కొండదొరలు నివసించే గ్రామం వాకపల్లి. పోడు వ్యవసాయం చేసి జీవిస్తారు. రాగి, పసుపు, వరి పండిస్తారు. 2007, ఆగస్టు 20 వ తేదీకి ముందు రోజు వరకు అది అత్యంత ప్రశాంతమైన గ్రామం. ఆ రోజు ఉదయం ఆరు గంటల సమయం. మగవాళ్లు అప్పటికే పొలాల్లోకి వెళ్లిపోయారు. ఆడవాళ్లు ఇంటి పనుల్లో ఉన్నారు. ఇంటి పనులు చేసుకుని, అన్నం వండుకుని వాళ్లు కూడా పొలానికి పోవాలి. సరిగ్గా ఆ సమయంలో హటాత్తుగా ఊరిమీదకొచ్చి పడింది యాంటీ–నక్సల్స్ గ్రేహౌండ్స్ పోలీస్ బృందం.
మొత్తం 21 మంది ఉన్నారు! ఊరిలోని ఆడవాళ్ల మీద లైంగికదాడికి పాల్పడ్డారు. అంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలే. పదకొండు మంది మహిళలు ఆ రోజు పోలీసు పైశాచికత్వానికి బలయ్యారు. కొందరు పోలీసులు గుడిసెల్లో దూరారు, మరికొందరు మహిళలను పసుపు పొలాల్లోకి లాక్కువెళ్లారు. వాళ్ల కణతలకి తుపాకీ గురిపెట్టి, వాళ్లను నిస్సహాయులను చేసి పాశవికంగా లైంగిక దాడి చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రాజారావుకి సమాచారం తెలిసిన వెంటనే ఆయన పాడేరు నుంచి పాత్రికేయులను వెంటబెట్టుకుని మధ్యాహ్నం మూడింటికి వాకపల్లికి చేరుకున్నారు. బాధిత మహిళలు ఎమ్మెల్యేతో కలిసి పాడేరు సబ్‌కలెక్టర్‌ని కలిసి భోరున విలపిస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గ్యాంగ్‌రేప్, ఎస్‌సి ఎస్‌టి (ప్రివెన్షన్ ఆఫ్) అట్రాసిటీస్ యాక్ట్‌లతో కేసు రిజిస్టర్ అయింది.
సామూహిక క్లీన్ చిట్!
అప్పటి నుంచి ఆ గిరిజన మహిళలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సిబి సిఐడీ విచారణలో ఆ పోలీసులకు క్లీన్ చిట్ రావడంతో సమాజం ఇంత భయంకరంగా ఉంటుందా అని తల్లడిల్లిపోయారు. మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ‘‘పేద గిరిజన మహిళలకు జరిగిన అన్యాయాన్ని.. అన్యాయంగా గుర్తించదా సభ్య సమాజం? విచారణ చేసే అధికారులకు ఆ నిస్సహాయులైన మహిళల దీన వదనాల్లో తమింటి ఆడబిడ్డ కనిపించదో ఏమో.
అలా కనిపిస్తే అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు క్లీన్ చిట్ ఎందుకు వస్తుంది?’’ అని నివ్వెరపోయి, ఆ అడవిబిడ్డలు న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. తమ ఆవేదన న్యాయదేవత చెవులకు చేరేలా చెప్పడానికి తమకు అంతంత పెద్ద మాటలు రాకపోవచ్చు, కానీ ఆ దేవత ఒక్కసారి కళ్ల గంతలు విప్పి తమ కళ్లలో సుడులు తిరుగుతున్న ఆవేదనను చూడగలిగితే... క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా తీర్పునిస్తుందనే ఆశతో పోరాడుతున్నారు ఆ గిరిజన మహిళలు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment