ఆరోగ్యవంతురాలిగా లక్ష్మి... | Lakshmi arogyavanturaliga ... | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతురాలిగా లక్ష్మి...

Published Fri, Nov 20 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

ఆరోగ్యవంతురాలిగా లక్ష్మి...

ఆరోగ్యవంతురాలిగా లక్ష్మి...

సేవ
 
కొమ్ము లక్ష్మికి దాదాపు అరవై ఏళ్లు. వరంగల్ జిల్లా, మహబూబాబాద్ స్వస్థలం. భర్త గుమాస్తాగా రిటైరయ్యాడు. ఒక్కడే కొడుకు. ఆర్మీలో పని చేస్తూ అస్సాం బార్డర్‌లో భార్య, పిల్లలతో ఉంటాడు. ఊళ్లో లక్ష్మి, వాళ్లాయన కాలక్షేపం చేస్తున్నారు. ఏ అనారోగ్యం వచ్చినా ఫోన్లో మంచిచెడులు తెలుసుకోవడం తప్పితే అంత దూరం నుంచి కొడుకు రాలేడు. ఏ సాయానికైనా చుట్టపక్కాలు, ఇరుగు పొరుగుల మీదే ఆధారపడక తప్పని పరిస్థితి. ఏడు నెలల కిందట లక్ష్మికి మోకాలి మార్పిడి ఆపరేషన్ అయింది. అస్సాం నుంచి వచ్చిన కొడుకు తల్లి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా ఉన్నాడు. అమ్మ పూర్తిగా కోలుకునే వరకు దగ్గరుండి చూసుకోవాలన్న ఆరాటం ఉన్నా సెలవు మంజూరు కాలేదు. దాంతో అమ్మ బాధ్యతను బంధువులకు అప్పజెప్పి వెళ్లకతప్పలేదు.

 మొదటికి వచ్చింది..
 ఆపరేషన్ తర్వాత మళ్లీ మునుపటిలానే నడవగలనని ఆశపడింది లక్ష్మి. కాని ఆపరేషన్ అయిన పేషంట్‌ను ఇంట్లో ఎలా చూసుకోవాలో తెలియని బంధువులు ఆమె అవసరాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా ఆమె పరిస్థితి మొదటికొచ్చింది. మోకాలి నొప్పి అంతకంతకు పెరిగి, అడుగు తీసి అడుగు వేయడానికే ప్రాణం గిలగిలలాడేది. కొడుకు ఫోన్‌చేస్తే... ‘ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నాన్రా భగవంతుడా’ అని ఫోన్‌లోనే ఏడ్చేసింది. కంగారు పడ్డ కొడుకు ఎలాగోలా సెలవు తీసుకుని వచ్చాడు. తల్లి పరిస్థితి చూసి వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చాడు. అక్కడ తెలిసింది... ఆపరేషన్ అయ్యాక ఇంటికెళ్లే ముందు పేషంట్లను బాగు చేసి పంపించేందుకూ సెంటర్ ఉందని, అలా పేషంట్లను శ్రద్ధగా చూడడాన్ని ట్రాన్జిషనల్ కేర్ అంటారని.

 అదే సువిటాస్..
 హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉంది. దీని సారథులు డాక్టర్ విజయ్, శ్రుతి, జీవంతి. సర్జరీ తర్వాత పేషంట్ల అవసరాలను చూసి వాళ్లు త్వరగా కోలుకునేలా వాళ్లలో మానసిక, శారీరక శక్తిని నింపే ఇలాంటి చికిత్సాలయాలు పాశ్చాత్య దేశాల్లో సాధారణమే అయినా మన దేశంలో మాత్రం ఇదే మొదటిది. సర్జరీలు చేయించుకున్న వారికి లేదా కేన్సర్, పక్షవాతం, గుండెజబ్బులు వంటి వ్యాధులకు గురై, మంచానికే పరిమితమై చికిత్సలు పొందుతున్న వారికి ఇక్కడ సేవలందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఇంటి వద్ద వారిని చూసుకునేందుకు పూర్తి సమయం కేటాయించే పరిస్థితులు లేని వాళ్లకు, పల్లెల నుంచి వచ్చిన పేషెంట్లకు ఇదొక చక్కని ఆశ్రయం. ఇక్కడ సుశిక్షితులైన నర్సులు, సైకాలజీ, ఫిజియోథెరపీ నిపుణులు, డైటీషియన్, యోగా మాస్టర్స్ పేషెంట్స్‌ను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అంకితభావంతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం యాభై పడకలతో ఈ ట్రాన్జిషనల్ కేర్ సంస్థ నడుస్తోంది.
 
ఆరోగ్యవంతురాలిగా లక్ష్మి..
 దీని గురించి తెలుసుకున్న లక్ష్మి కొడుకు ఆమెను అక్టోబర్ 9న సువిటాస్‌లో చేర్పించి అస్సాం వెళ్లిపోయాడు. ‘ఈ నెల్లాళ్లలో నా ఆరోగ్యం చాలా మెరుగు పడింది. నర్సులు, డాక్టర్లు అందరూ ‘అమ్మా’ అంటూ ప్రేమగా పలకరిస్తారు. నా కొడుకు, కోడలు దగ్గర లేరన్న బెంగే లేదు. ఇక్కడ చాలా హాయిగా ఉంది’ అంటుంది లక్ష్మి.
 
ఉద్యోగరీత్యా దూరప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులకు ఇలాంటి కేంద్రాలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు పలువురు. పశ్చిమాసియా, ఆఫ్రికా, పాకిస్తాన్ లాంటి విదేశాల నుంచి కూడా సువిటాస్‌కు పేషంట్లు వస్తున్నారు. ఈ సేవలకు అయ్యే ఖర్చు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్సకు అయ్యే ఖర్చుకన్నా తక్కువే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement