‘నా రూటే... సెపరేటు...’
ఇది మోహన్‌బాబు ఫేమస్ డైలాగ్.
కానీ, లక్ష్మీ ప్రసన్నకు మాత్రం అది టైలర్ మేడ్ డైలాగ్.
ఎస్... ఆమె రూటే సెపరేటు.
హీరోల ఇంటి బిడ్డకీ, ఫిలిం ఫీల్డ్‌కీ...
ఫ్రీక్వెన్సీ కలవదని ఆమెకు బాగా తెలుసు.
అయినా... బ్రేక్ ది రూల్స్!
ఫస్ట్ స్టెప్పే... హాలీవుడ్‌లో.
నెక్ట్స్... ‘అనగనగా ఒక ధీరుడు’లో విలన్ వేషం!
ఎన్ని గట్స్ ఉండాలి!
మంచు లక్ష్మీ ప్రసన్న...
సారీ... ధైర్యలక్ష్మీ ప్రసన్న ఏం చేసినా అంతే!
ఆర్టిస్టుగా... ఫిలిం మేకర్‌గా...
ఇంకా చాలా చాలా విషయాల్లో ఆమె... డేరింగ్.. డాషింగ్... డైనమిక్!
లేటెస్ట్‌గా సరొగసీ ద్వారా మదర్‌హుడ్.
సదరన్ సెలబ్రిటీస్‌లోనే సెన్సేషనల్ స్టెప్!
అసలు ఈ స్టెప్ గురించి లక్ష్మి ఏం చెబుతారో వినాలని...
అందరూ ఈగర్లీ వెయిటింగ్!
లక్ష్మి ఫస్ట్ టాక్ ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’కే..!
- ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్
ఇందిర: బిగ్ కంగ్రాచ్యులేషన్స్!!
లక్ష్మి: థాంక్యూ వెరీ మచ్!
ఇందిర: జూన్ 15న ప్రపంచమంతా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే, లక్ష్మి మంచు మదర్స్‌డేని చేసుకున్నారు. అంతేకాక, అదేరోజు మీ భర్త ఆండీ బర్త్‌డే కూడా అవడం... యాదృచ్చికమా, అలా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారా?
లక్ష్మి: యాదృచ్చికమే! అసలు బేబీ రెండు వారాల తర్వాత పుట్టాల్సుంది.. అయితే, మెడచుట్టూతా బొడ్డుతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందే సిజేరియన్ చేయాల్సి వచ్చింది.
ఇందిర: ఒకసారి వెనక్కెళితే... పిల్లలు పుట్టకపోవడం వల్ల సహజంగా ఏ భార్యాభర్తల మధ్యయినా చికాకులు వస్తుంటాయి... మీ మధ్య కూడా ఏమైనా..?
లక్ష్మి: అఫ్‌కోర్స్ వచ్చాయి! చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగాం... ఎన్నో కాంప్లికేషన్స్... వీటన్నిటి మధ్యలో నేనూ, ఆండీ గొడవపడడం మొదలెట్టాం.... ఇద్దరి మధ్యలో చికాకులు రావడం మొదలెట్టాయి. ఆయన వర్క్ వల్ల ఒక అపాయింట్‌మెంట్ మిస్సవడం, ఒక్కోసారి నా వల్ల! దానివల్ల ఇంట్లో కొంత స్ట్రెస్‌ఫుల్ వాతావరణం ఏర్పడింది. ఇది టెన్షన్‌తో కూడుకున్న విషయం కాబట్టి, ప్రతి చిన్న విషయం కూడా దానికి తోడయ్యేది. అప్పుడోసారి ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం - ‘‘చూడు.. మనం అనుకున్నట్టు జరగట్లేదు... వద్దు, పిల్లల గురించి ఇంక టెన్షన్ పడద్దు... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం... పిల్లల కోసమని ఇద్దరి మధ్య స్ట్రెస్ రావడం బాలేదు.. ఏదైనా మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం అందరూ శాపం అనుకుంటే, దీన్ని మనం వరంగా తీసుకుందాం. బాధ్యతలు లేవు కాబట్టి ఇద్దరం ఎవరి కెరీర్‌లలో వారు ముందుకు పోవచ్చు, దేశదేశాలు తిరగొచ్చు, లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకరికొకరం ఉన్నామనుకుని జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం’’ అని!
ఇందిర: మరి బేబీ కావాలనే ఆలోచన మళ్లీ ఎలా వచ్చింది?
లక్ష్మి: విష్ణు పిల్లలు అరీ, వివీని చూశాక! ఎప్పుడైతే వాళ్లు మా జీవితాల్లోకి వచ్చారో అప్పుడు నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘అత్తా.. అత్తా’ అంటూ వాళ్లు ముద్దుగా నా వెనక తిరుగుతుంటే, నాకంటూ ఓ బిడ్డ ఉంటే బాగుంటుందనిపించింది. మళ్లీ ట్రై చెయ్యాలనుకున్నాను. అయితే, అప్పటికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్‌నూ ట్రై చేసేసరికి నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నేను అంత సిక్‌గా ఉండి, పిల్లల్ని కనడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించి, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని నా గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గారావును సంప్రదించాను. అప్పుడావిడ సరొగెసీని ట్రై చేద్దామని సూచించారు. గూగుల్‌కు వెళ్లి కంప్లీట్‌గా రిసెర్చ్ చేశాను. ‘మెడిసిన్ మనకు కల్పిస్తున్న అత్యాధునిక వైద్యప్రక్రియను ఎందుకు వద్దనుకోవాలి. 9 నెలలు వేరేవాళ్ల గర్భంలో పెరిగిందనే కానీ, అన్ని విధాలా అది మన బేబీనే కదా... ఐయుఐ, ఐవీఎఫ్ ఎలాగో ఇది కూడా ఇంకొక ఆప్షన్’ అనిపించింది. అందుకే నాకేమీ అభ్యంతరంగా గానీ, ఇబ్బందిగా గానీ అనిపించలేదు. చాలా ధైర్యంగా ఉన్నాను. అయితే దీని గురించి సమాజంలో స్టిగ్మా (అపవాదు) ఉంటుందని తెలుసు కాబట్టి, మొదట ఆండీతో మాట్లాడాను. అప్పుడు తను అమెరికాలో ఉన్నారు. ‘‘ముందు మీ నాన్నతో మాట్లాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోలేము. అయినా, ఇది మన ఒక్కరి ఫ్యామిలీ విషయమే కాదు. నువ్వు పబ్లిక్ పర్సన్‌వి అవ్వడంతో మీడియాతో సహా అందరూ దీని గురించి ఏవేవో చర్చిస్తారు... నువ్వు దాన్ని హ్యాండిల్ చెయ్యగలవనుకుంటే ముందుకెళ్దాం. ఈ విషయంలో నేను నీతోనే...’’ అన్నారు. అప్పుడు నాన్న దగ్గరికెళ్లి - ‘‘నాన్నా, నాకు ఇప్పుడున్న ఆప్షన్ ఇది.. ఏం చెయ్యమంటారు’’ అని అడిగా! క్షణం కూడా ఆలోచించకుండా ఆయన - ‘నువ్వు ముందుకెళ్తున్నావు. అంతే! అమెరికాకు వెళ్దామంటే అమెరికాకు, లండన్ అంటే లండన్‌కు వెళ్దాం’’ అన్నారు. అప్పుడు నేను - ‘‘లేదు నాన్నా, ఇతర దేశాల కన్నా మనదేశంలోనే సరోగసీకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయని విదేశీయులే ఇక్కడికొస్తున్నారు. మనం ఎందుకు విదేశాలకెళ్లడం... ఇక్కడే చేద్దాం’’ అన్నాను. ‘‘నాకివన్నీ అర్థం కావమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నువ్వు చూసుకో. మనింటికి బేబీ రావాలి అంతే!’’ అన్నారు. దాంతో సరొగసీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అసలు నాన్న ఆశీర్వాదమే లేకపోతే ఈ బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు. ఇక్కడోమాట చెప్పాలి - అసలు నాన్న ఎక్కువ కూడా అనక్కర్లేదు.... ‘ఎందుకమ్మా టెన్షన్ నీకు, అరీ వివీ చాల్లే’ అని అన్నా నేను ముందుకెళ్లేదాన్ని కాదు. మేము దేశాలు తిరిగాము... చదివాము కానీ... ఆయన రాయలసీమ బిడ్డ... చాలా ట్రెడిషనల్! అయినా ఆయన అంత ఓపెన్ మైండెడ్‌గా, బ్రాడ్‌మైండెడ్‌గా ఆలోచిస్తారని నేననుకోలేదు!
ఇందిర: మరి ఆ మార్పుకి కారణం ఏంటంటారు... కాలమా? కూతురా?
లక్ష్మి: (నవ్వి) మొత్తం క్రెడిట్ నేను తీసుకోలేను... కొంత ఇది కొంత అది అయ్యుండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే పూర్తి మార్పుకు కారణం అరీ, వివీ అనుకుంటున్నాను. నాన్న మమ్మల్ని కూర్చోమంటే కూర్చునేవాళ్లం, లేవమంటే లేచేవాళ్లం. మమ్మల్ని ట్రైన్ చేయడం అయిపోయింది. ఇప్పుడవే మనవరాళ్ల దగ్గర పనిచేయడంలేదు. వాళ్లు కూర్చోమంటే ‘నో తాతా, మీరు కూర్చోండి’ అంటున్నారు. సో నాన్న ఇంతలా మారడానికి నాకన్నా క్రెడిట్ వాళ్ల ఇద్దరికే దక్కుతుందేమో!
ఇందిర: ఇంతకీ మీది పార్షియల్ సరొగసీనా (అండం కూడా ఆమె (సరగసీ మామ్)ది)? ఫుల్ సరొగసీనా.. (అండం ఈమెది)? అసలు సరొగేట్ మామ్‌ని మీరు ఎంచుకున్నారా? డాక్టర్ ఎంపిక చేశారా? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ, ఎలా జరిగింది?
లక్ష్మి: ఇది పూర్తి సరొగసీనే.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా. కానీ, మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నాను.
ఇందిర: మామూలుగా మీరు చాలా బోల్డ్‌గా, ఓపెన్‌గా ఉండే వ్యక్తి. ప్రతి చిన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా పబ్లిక్‌కి చెప్తుంటారు. మరి ఇంత పెద్ద విషయాన్ని చివరిదాకా అంత సీక్రెటివ్‌గా ఎందుకు ఉంచారు?
లక్ష్మి: కారణం ఉంది... చెప్పిన దగ్గర నుంచీ అందరూ బేబీ గురించి మరచిపోయి, ‘లక్ష్మి మంచు ఇలా... లక్ష్మి మంచు అలా’ అంటూ నా గురించే మాట్లాడేవారు. అది నాకు ఇష్టం లేదు. మొత్తం అటెన్షన్ అంతా బేబీ మీద ఉంటే బాగుంటుందనిపించింది. అంతేకాదు, ఇంతకుముందు చాలా ట్రై చేశాం. ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి చాలా సెలైంట్‌గా ఉండాలనుకున్నాం. బేబీ సేఫ్‌గా బయటికొచ్చేవరకు ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. (నవ్వుతూ) నేనింత జాగ్రత్తగా ఉన్నా ఒకరోజు ముందు అందరూ దీని గురించి మాట్లాడడం మొదలెట్టారు. బేబీని తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికే అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎవరికీ చెప్పలేదు. మా ఫ్యామిలీకి, అత్తమామల ఫ్యామిలీకి తప్ప ఏ ఒక్కరికి చెప్పలేదు. కానీ, ఈ 9 నెలలు అమ్మానాన్నల్ని కంట్రోల్ చేసేసరికి నా పని అయిపోయింది. మీడియా సంగతి మరచిపోండి... మా నాన్నను కంట్రోల్ చేసినందుకే మీరు నాకొక అవార్డ్ ఇవ్వొచ్చు. మొదటి నుంచి నాన్న ఎంత ఎగ్జైట్ అయ్యారంటే... స్కాన్ చూసినప్పుడల్లా చెప్పేస్తాననేవారు.
ఇందిర: కానీ ముందురోజు ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ‘రేపు మీకు ఒక వండర్‌ఫుల్ న్యూస్ చెప్పబోతున్నాను’ అని ట్విటర్‌లో మెసేజ్ పెట్టారు..?
లక్ష్మి: అప్పుడు కూడా పూర్తిగా విషయం చెప్పేస్తాననే గోల! బేబీ చేతికి వచ్చాక చెప్తువు గాని అని గట్టిగా ఆపాను.
ఇందిర: అవును... ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలీదా?
లక్ష్మి: తెలీదు! బేబీ బయటికొచ్చే 2-3 రోజుల ముందు మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్ ప్రకాష్‌కి, రాణాకి చెప్పాను.
ఇందిర: ఇప్పుడు మాత్రం అన్నీ బోల్డ్‌గా, ఓపెన్‌గా చెప్తున్నారు..!
లక్ష్మి: ఇప్పటికి కూడా నేను చెప్పకుండా ఉండొచ్చు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు చర్చించుకుంటారు. నాలుగో రోజు మర్చిపోతారు. చివరికది స్పెక్యులేషన్‌గానే ఉండిపోయేది. అయితే, ఇప్పుడు ఇంత ఓపెన్‌గా మాట్లాడడానికి కారణం... మన దేశంలో పిల్లలు పుట్టలేదంటే, లోపం ఎటువైపున్నా భార్యకు విడాకులివ్వడం లేదా భర్తకు రెండో పెళ్లి చేస్తుంటారు. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే... మీది సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ అయితే కేవలం పిల్లలు పుట్టలేదన్న కారణంతో దాన్ని బ్రేక్ చేయొద్దు. సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారని, మీ జీవితాన్ని మీరు ఆస్వాదించని పరిస్థితి తెచ్చుకోవద్దు. సమస్య వచ్చినప్పుడు ఓపెన్‌గా ఉండండి... చెప్పుకోవాల్సిన వాళ్లతో చెప్పుకోండి... ధైర్యంగా ఫేస్ చెయ్యండి, సొల్యూషన్ కోసం వెతుక్కోండి! ఈ పర్టిక్యులర్ విషయంలో అయితే... పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు, ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని తెలీక కొంత, తెలిసినా భయం వల్ల కొంత వెనకడుగు వేస్తుంటారు. నా లాంటి ఒక సెలబ్రిటీ ఈరోజు బయటికొచ్చి ఇలా చెప్పడం వల్ల కొందరైనా ఇలా చేయడానికి ధైర్యం చేస్తారని! నేనిలా ఓపెన్‌గా ఉండడం వల్ల నలుగురికి మేలు చేసినదాన్నవుతాననుకున్నాను.
ఇందిర: ఇండియాలో కమర్షియల్ సరొగసీ లీగలే కదా..? అయినా ఇంకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా?
లక్ష్మి: లీగలే కాదు.. అన్నిటికీ పక్కా పేపర్ వర్క్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇతర దేశాల కన్నా మనదేశంలోనే దీనికి చట్టాలు పక్కాగా ఉన్నాయి.
ఇందిర: అసలు సరొగేట్ మదర్స్ మెడికల్ నీడ్స్, న్యూట్రిషన్ నీడ్స్... ఓవరాల్‌గా ఎవరు టేక్‌కేర్ చేస్తారు. డబ్బుపరంగా కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ..?
లక్ష్మి: మామూలుగా అయితే అంతా డాక్టరే టేక్‌కేర్ చేస్తారు. మనం ఇన్వాల్వ్ అవ్వదల్చుకుంటే అవ్వచ్చు.
ఇందిర: మామూలు వ్యక్తులను వదిలేస్తే... హిందీలో అమిర్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లు చేశారు... సౌత్ ఇండియన్ ఫిలిం సెలబ్రిటీస్‌లో మీరే మొదటి వ్యక్తి అనుకుంటా ఇలా చేసింది...
లక్ష్మి: (నవ్వుతూ) అసలు నాకు ఆ ఆలోచనేదు! బేబీ సేఫ్‌గా బయటికి రావలనే ఆలోచన తప్ప ఇంకోటి రాలేదు నాకు. మీరు నమ్మరు... ఈ బేబీ కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కి ఉంటానో, ఎన్ని గుళ్లకు వెళ్లి వుంటానో, ఎంతగా ఆధ్యాత్మికంగా తయారయ్యానో!
ఇందిర: గుళ్లు గోపురాలతోపాటు, సరగసీ మదర్‌ని కూడా విజిట్ చేస్తూనే ఉన్నారా?
లక్ష్మి: అవును... ఈ 9 నెలల కాలంలో ఆమెను ఆరేడుసార్లు కలిశాను. ఆ అమ్మాయికి నేనెవరో క్లియర్‌గా చెప్పాను... దాచలేదు. మామూలుగా అయితే సరొగేట్ మదర్‌తో డెలివరీ తర్వాత సంబంధాలు ఉండవు. కానీ నేను మాత్రం మానవీయ సంబంధాలను కొనసాగిస్తూ ఆమెతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. అంతేకాదు, నేను ఏదిచేసినా 100% చేస్తాను. అంతేకాదు, ప్రతి పనీ క్రియేటివ్‌గా, ఫన్‌గా, హెల్దీగా ఈజీయెస్ట్ పద్ధతిలో చూసుకుంటాను. అలాగే ఈ బేబీ విషయంలో కూడా ప్రతి ఒక్క స్టెప్‌ను ఎంజాయ్ చేశాను.
ఇందిర: అవును, ఈ 9 నెలల్లో బేబీ ఎలా ఉండబోతుందనే ఆలోచనలు ఉండేవా?
లక్ష్మి: నాకెప్పుడూ అందంగా ఉండాలని ఉంటుంది. ఏదున్నా లేకున్నా పిల్లకి నా ముక్కు రావాలని గట్టిగా ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో నా ఒక్కదానికే నాన్న ముక్కు వచ్చిందని గర్వంగా ఫీలైపోతుంటాను. అయితే, స్కాన్‌లో పాపకి సొట్ట ముక్కు ఉన్నట్టు అనిపించింది. స్కాన్ రిపోర్ట్ చూసినప్పుడల్లా ‘‘నాన్నో, ఇది నా కూతురు కాదు నాన్నో... దీనికి విష్ణు, మనోజ్‌లా సొట్ట ముక్కు వచ్చింది నాన్నో’’ అంటూ గోల చేసేదాన్ని.
ఇందిర: ఇప్పుడు పుట్టేసింది కదా... మరి ఎవరిలా ఉంది? ఇంతకీ మీ ముక్కు వచ్చిందా? రాలేదా?
లక్ష్మి: (నవ్వుతూ) సొట్టముక్కు మాత్రం రాలేదు! పాప అచ్చు ఆండీలా ఉంది. అయినా రోజూ ముక్కుని నొక్కుతున్నాను... నా ముక్కులా సన్నగా చెయ్యాలని! అయితే కాళ్లు చేతులు నాలా ఉన్నాయి. మరచిపోయా... మా మంచు గడ్డం కూడా వచ్చింది దానికి!
ఇందిర: ట్విటర్‌లో మీది, ఆండీది, పాపది ముగ్గురివి చేతులు పెట్టారు... అలా ఓ టీజర్ వదిలే బదులు పాప ఫుల్ ఫోటో పెట్టొచ్చు కదా?
లక్ష్మి: ఓ వారం ఆగి పెట్టాలనుకున్నాను... కానీ ఫస్ట్ ఫోటో మాత్రం మీకే ఇస్తాను.
ఇందిర: అవును, బేబీ పుట్టగానే అందరి ఫస్ట్ రియాక్షన్..?
లక్ష్మి: ‘జూనియర్ ఆండీ పుట్టేసింది’ అని!
ఇందిర: అరియానా, వివియానా ఎలా రియాక్టయ్యారు.?
లక్ష్మి: ఇంట్లో వాళ్లందరూ ఒకెత్తయితే వీళ్లిద్దరిదీ ఒకెత్తు. వాళ్లిద్దరూ ‘సోప్‌తో చేతులు కడుక్కోకుండా డోంట్ టచ్ అత్తా’ అంటూ... వాళ్ల నాన్న దగ్గర్నుంచీ వాళ్ల తాతదాకా... ఎవ్వర్నీ లోపలికి రానివ్వట్లేదు. నాకసలు ‘జాయ్’ అంటే ఇంతలా ఉంటుందని వాళ్లను చూస్తే అనిపిస్తుంది. (నవ్వుతూ) ఇక పాపను నేను పెంచనక్కర్లేదు... అరీ, వివీ పెంచేస్తారు.
ఇందిర: ఇంతకీ పేరేం పెట్టబోతున్నారు. అరియానా, వివియానాకు ప్రాస కలిసొచ్చేలానా? అమ్మ పేరు ‘విద్య’ కలిసొచ్చేలానా?
లక్ష్మి: ఫ్యామిలీలో అందరి పేర్లూ కలిసొచ్చేలా పెట్టాలనుకుంటున్నాం.
ఇందిర: ఫాదర్స్ డే రోజు పుట్టింది, ఫాదర్ బర్త్ డే రోజు పుట్టింది, పాదర్‌లా పుట్టింది... ఆండీ మస్ట్ బీ ద హ్యాపియెస్ట్ డాడ్?
లక్ష్మి: ఆయనే కాదు, ఆమె కూడా హ్యాపీ డాటరే! పొద్దుటి నుంచి నేను చూసుకున్నా పట్టదు కానీ, వాళ్ల డాడీ వచ్చేసరికి ఇటునుంచి అటువరకు నవ్వుతుంది. అది చూస్తే నాకు కోపమొస్తుంది... గిల్లడమో, తొడపాశమో పెట్టాలనిపిస్తుంది!
ఇందిర: మీరెలా మీ నాన్న కూచో, మీ పాప కూడా అంతేగా!
లక్ష్మి: నిజమే... అందుకోసమే అబ్బాయి పుడితే బాగుండనుకున్నాను. పుట్టాలనుకున్నాను... ‘మమ్మీస్ బాయ్’గా ఉంటాడని, ఇంట్లో అటెన్షన్ అంతా నాకే ఉంటుందని! మీకో విషయం తెలుసా... విష్ణుకి కూడా అబ్బాయిలే పుట్టాలని చాలా కోరుకున్నా. అందరికీ కొడుకులు పుట్టేస్తే ఇంట్లో నేనే క్వీన్‌ని అని! కట్‌చేసి చూస్తే అందరూ అమ్మాయిలే పుడుతున్నారు. నాకు ఇప్పుడే భయమేస్తుంది... నన్ను ఇక లెక్కచేయరేమో అని! ఇప్పటికే నేను ఆండీని సతాయిస్తున్నాను - ‘డు యు లవ్ మి ఆర్ ద బేబీ’ అని! ‘నీ తర్వాతే బేబీ’ అని నన్ను బుజ్జగిస్తుంటాడు. తనే కాదు ఇంట్లో అందరూ! ఇప్పుడు నాన్న శంషాబాద్‌లో ఇల్లు కట్టిస్తున్నారు. పాప పుట్టాక మనోజ్ - ‘నాన్నా, ఆ ఇంటిపేరు శంషాబాద్ గర్ల్స్ హాస్టల్ అని పేరు పెట్టుకుందాం’ అని జోక్‌లేశాడు. దానికి నాన్న - ‘ఇంతమంది ఆడపిల్లలుంటే నేను ఇంటి బయట క్రికెట్ బ్యాట్ పట్టుకుని కాపలా ఉండాలి’ అని!
ఇందిర: ఆండీయేమో అమెరికాలో... బేబీయేమో ఇక్కడ... ఉండగలరా?
లక్ష్మి: లేదు.. లేదు... తను ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేశారుగా! ఇన్‌ఫ్యాక్ట్ బేబీకోసం డిసెంబర్ నుంచి ఇండియాలోనే ఉంటున్నారు. (నవ్వుతూ) మేమిద్దరం చాలా యాక్టివ్ అండ్ ఇన్వాల్డ్ పేరెంట్స్ అండీ!
ఇందిర: మరి మీది బిజీ లైఫ్ కదా? ఎలా బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు లైఫ్‌ని?
లక్ష్మి: (నవ్వుతూ) మమ్మీ డాడీ పెంచేస్తారండీ. విష్ణు - విన్నీ అయితే మరీ... పాపను నా దగ్గర ఉంచరట... వాళ్లే పెంచుతారట! ఆన్ ఎ సీరియస్ నోట్... అంతదూరం ఆలోచించట్లేదు... వన్ డే ఎట్ ఎ టైం అండీ! ప్రస్తుతం బేబీకి 100% టైం ఇస్తున్నాను.
నేను అబ్బాయి అని మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి, బట్టలు, షూలు... అన్నీ అబ్బాయికి తగ్గట్టు కొనేశాను.
ఐషఫుల్‌లో బేబీకి కొన్ని బేబీ బుక్స్ స్వయంగా చదివి, రికార్డ్ చేసి పెట్టి, బేబీ బడ్స్ (పొట్టమీద పెట్టే హెడ్‌ఫోన్స్) సాయంతో ఆరు నెలలుగా బేబీకి నా గొంతు వినిపిస్తూనే ఉన్నాను.
మొదటి మూడు రోజులు ఆడపిల్లంటే ఆడపిల్లలా జెంటిల్‌గా ఉంది. కట్‌చేసి చూస్తే అరుస్తోంది... మా మంచు గొంతు వచ్చేసింది!
Follow @sakshinews
నాన్న ఆశీర్వాదమే లేకపోతే...బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు!
Published Sun, Jun 22 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM
Advertisement
Advertisement