భూమి, బంగారం...ఏది బెటర్?
మావారు రెండు నెలల్లో రిటైర్ అవుతారు. ఉద్యోగ విరమణతో రూ. 20 లక్షలు వస్తాయి. ఆ డబ్బుతో భూమి కొనాలని ఆయన ఆలోచన. నాకు మాత్రం 4, 5 లక్షలతో బంగారు ఆభరణాలు చేయించుకోవాలని ఉంది. మా పుట్టింటివారు పెట్టిన బంగారం ఇంట్లో అవసరాలకు తాకట్టులోకి పోయి మాయం అయింది. నా ఒంటి మీద బంగారం లేక బంధువుల ఇళ్లల్లో వేడుకలకి కూడా వెళ్లేదాన్ని కాను. ఇప్పుడైనా నా కోరిక తీర్చుకోవడం న్యాయమే కదా!
- అహల్యాబాయి, తిరుపతి
స్త్రీ స్వాభావికంగా భద్రతకి ప్రాధాన్యత ఇస్తుంది. బంగారం వల్ల ఆర్థిక భద్రత వస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి అయినా డబ్బు తీసుకునే వీలుంటుందని ఆమె నమ్మకం. మీ ఆయన తన పేరుతో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే వాటికి ఎప్పుడైనా రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు. అదే బంగారు ఆభరణాలు అయితే అందాన్నిచ్చే అత్యవసర నిధిగా మిమ్మల్ని విడిచిపోకుండా మీ ఒంటిమీద ఉంటాయి. ప్రభుత్వాలే బంగారు రిజర్వ్‌లను పెంచుకుంటున్నప్పుడు మీరు బంగారు ఆభరణాలు కోరుకోవడంలో తప్పు లేదు.
అయితే రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సరైన ధరకి మంచి భవిష్యత్తు ఉన్న భూమి దొరికితే, మీరు మీ వారికి సహకరించడమూ అవసరమే. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవడం మంచిది. బంగారం భారీగా పెరగకపోయినా భారీగా మాత్రం తగ్గదు. భూమి అలా కాదు. ఎక్కువ రేటు పెరుగుతుంది, పైగా ఎన్నటికీ తగ్గదు. కాబట్టి కొంత డబ్బు బంగారానికి వెచ్చిస్తూనే ఎక్కువ డబ్బు స్థలంపై పెట్టుకోవడం మంచిది.
- వంగా రాజేంద్రప్రసాద్