హాఫ్ శారీ.. ఫుల్‌స్టైల్...
బామ్మల నాటి స్టైల్ మళ్లీ నేడు మన అమ్మాయిల మతులు పోగొట్టడానికి రెడీ అయ్యింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిిపిస్తూనే నయా స్టైల్ మార్కులు కొట్టేస్తోంది. అదే హాఫ్ శారీ. పెళ్లికెళ్లాలన్నా, కాలేజీ పార్టీలకు కలర్‌ఫుల్ లుక్ తేవాలన్నా ఫుల్‌స్టైల్ డ్రెస్ హాఫ్ శారీనే!
ఎండాకాలం లంగాఓణీలా..! అని భయపడేవారికి సరికొత్తగా మరింత సౌకర్యవంతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ లంగాఓణీలు. ఫ్యాషన్ దుస్తులలో కొంతకాలంగా నెటెడ్ ఫ్యాబ్రిక్ సృష్టించిన హంగామా చూశాం. వెల్వెట్ మెరుపులూ తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి స్థానాన్ని పట్టు హంగులు కొట్టేశాయి. బెనారస్ మెరుపులు హల్ చల్ చేస్తున్నాయి. మగువలు తమ సింగారాన్ని మెత్తనైన పట్టుతో సంప్రదాయపు, ఆధునికపు వేడుకలకు ఇలా అందంగా అమరే క్లాసిక్‌లుక్‌తో మార్చేయవచ్చు.
ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్‌చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది.
అన్నీ డిజైనర్ లుక్‌తో ఆకట్టుకోవాలనే అత్యాశకు పోతే గాఢీ లుక్‌తో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అందుకని, చిన్న చిన్న మోటివ్స్ ఉన్న ప్లెయిన్ నెటెడ్, చందేరీ, షిఫాన్ ఓణీలు ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి.
లంగాఓణీలో ఎంత సింపుల్‌గా కనిపిస్తే అంత బాగుంటుంది. అదే సమయంలో క్లాసిక్‌లుక్‌తో, రిచ్‌గానూ ఆకట్టుకోవాలనుకునేవారికి ఈ తరహా వేషధారణ బాగా నప్పుతుంది. గ్రామీణ నేపథ్యంతో పాటూ బామ్మల కాలం నాటి ఒరిజినాలిటీని, రంగులను డిజైనింగ్‌లో చూపిస్తే ఇలాంటి అందమైన వేషధారణ మరింత ఆకర్షణీయంగా రూపుకడుతుంది.
- భార్గవి కూనమ్,
ఫ్యాషన్ డిజైనర్