‘‘ఫస్టియర్‌లో మాత్రమే ఫస్ట్‌మార్క్ వస్తే అదృష్టమనుకుంటారు.. సెకండియర్‌లో కూడా నిలుపుకున్నావనుకో హార్డ్‌వర్క్ అని నమ్ముతారు’’ ఇది ఒక అక్క తన చెల్లికి చెప్పిన మాట. విన్న చెల్లి ఇంటర్ సెకండియర్‌లో కూడా ఫస్ట్‌మార్క్ తెచ్చుకుంది. భవిష్యత్‌పట్ల కన్న కలలను ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటోంది. ఆమే లక్ష్మీగాయత్రి ఆకుండి. ఈ అమ్మాయికి ఇంకో ప్రత్యేకతా ఉంది. హైదరాబాద్‌లో రాపిడో (టూ వీలర్ ట్యాక్సీ)లో తొలి మహిళా కెప్టెన్. వ్యవహారంలో టూ వీలర్ ఉమన్ ట్యాక్సీ రైడర్. అసలు ఆ సాహసం గురించే ఆరా తీద్దామని గాయత్రిని కదిలిస్తే ఆమె సాధించిన ఇంకొన్ని లక్ష్యాలూ తెలిశాయి. అన్నిటి గురించి క్లుప్తంగా ఇక్కడ.. స్వభావరీత్యా ఇంట్రావర్ట్, చదువు మీద పెద్దగా ఆసక్తిలేని గాయత్రి ఇంటర్‌లో ఫస్ట్‌రావడానికి కారణం.. టూ వీలర్ అనే తాయిలం.
తొమ్మిదో తరగతిలో తన తమ్ముడితో (కజిన్) కలిసి గేర్ బైక్ నడపడం నేర్చుకుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ ప్యాషన్. టెన్త్ తర్వాత చదువులో ఆమెను ముందుకు తోయడానికి ‘‘ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు వస్తే నీకు బండి కొనిపెడ్తాను’’ అని ఆశ పెట్టాడు తండ్రి. బండి కోసం ఇంటర్‌ను ఇష్టపడి తను తీసుకున్న కామర్స్ గ్రూప్‌లోనే కాదు అన్ని గ్రూపుల్లోకి ఫస్ట్‌గా నిలిచింది. ‘‘పద్దెనిమిదేళ్లు నిండితేనే బండి.. ఇంటర్ సెకండియర్ కూడా పూర్తి అవనీ..’’ అన్నాడు తండ్రి నింపాదిగా. అప్పుడే అన్నది బ్రిలియంట్ స్టూడెంట్ అయిన అక్క పైన ప్రస్తావించిన మాటను. కష్టపడి ఇంటర్ సెకండియర్‌లో కూడా అన్ని గ్రూపుల్లోకి మళ్లీ ఫస్ట్ మార్క్ తెచ్చుకుంది. బండి కొనిపించుకుంది. అయితే దీనికన్నా ముఖ్యమైన లక్ష్యం ఉంది గాయత్రికి.. ఫ్యాషన్ డిజైనర్ కావాలని.
బార్బీ బొమ్మ .. సినిమాలకు కాస్ట్యూమ్స్
నాన్నమ్మ కొనిచ్చిన బార్బీకి దర్జీ దగ్గర్నుంచి తెచ్చుకున్న గుడ్డముక్కలతో డ్రెస్‌లు కుట్టడం, బొమ్మలేయడం చిన్నప్పటి నుంచి గాయత్రికున్న వ్యాపకం. ఈ అమ్మాయి ఆసక్తి గమనించిన ఆమె పిన్ని ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చెప్పింది. ఆ క్షణం నుంచి ఫ్యాషన్ డిజైనింగే ధ్యేయంగా పెట్టుకుంది గాయత్రి. పదవ తరగతి అయిపోగానే ఆ కోర్సులో చేరుతానని చెప్పిన గాయత్రిని ‘‘ఇంటర్ తర్వాతే నీకు ఆసక్తి ఉన్న కోర్స్’’ అని కన్విన్స్ చేశారు పేరెంట్స్. ఇంటర్ అయ్యాక డిగ్రీ అన్నారు. అందుకే డిగ్రీ తర్వాతే హైదరాబాద్‌లోని హ్యామ్స్‌టెక్ కాలేజ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. ఆ సమయంలోనే కజిన్ ద్వారా ఒక సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది ఆమెకు. దాంతో ఆమె వర్క్ తెలిసి వెంటవెంటనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాలతోపాటు కమర్షియల్ యాడ్స్‌కీ పనిచేసింది.
మరి రాపిడో..?
‘‘నేను కమర్షియల్ యాడ్స్‌కి పని చేస్తున్నప్పుడు నా సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్ ఒకరు ఐటీ సెంటర్ నుంచి ఎక్కడో ఉన్న వర్క్‌ప్లేస్‌కొచ్చి నన్ను కలిసేవాడు. ఇంత దూరం ఎలా వచ్చావ్ అని అడిగితే రాపిడో టూ వీలర్ ట్యాక్సీ అని చెప్పేవాడు. ఆ టైమ్‌లోనే బెంగళూరులో రాపిడో ట్యాక్సీ రైడ్ చేస్తున్న ఉమన్ గురించి ఆర్టికల్ కూడా చదివా. నాకూ బైక్ నడపడం ఇష్టం, సరదా కాబట్టి రాపిడో కెప్టెన్‌గా అప్లయ్ చేశా. నిజానికి కొన్ని నిమిషాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ నా విషయంలో మూడు వారాలైనా ఏ రెస్పాన్స్ రాలేదు. డైరెక్ట్‌గా ఆఫీస్‌కు వెళ్లి అడిగా. కొంచెం తటపటాయించి ‘‘అమ్మాయిలకు ఇంకా ఇవ్వడం లేదు సేఫ్టీగ్రౌండ్‌లో... ’’ అన్నారు. ‘మీరే అలా అంటే ఎలా? నా విషయంలో మీకు ఏ భయమూ అక్కర్లేదు.
నేను సెల్ఫ్ డిఫెన్సివ్’ అని పోరితే.. చాలా సేఫ్టీ మెజర్స్ చెప్పి అప్రూవ్ చేశారు. నా ఫస్ట్ రైడ్ మెహిదీపట్నంలో. ఒక అబ్బాయి. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. ప్రశ్నలేవీ అడగకుండానే బండి మీద కూర్చున్నాడు. కొంచెం అసౌకర్యంగా ఫీలవుతుంటే చెప్పాను.. కంఫర్టబుల్‌గానే ఉండండి అని. అతని డెస్టినేషన్‌లో దిగిపోయాక చెప్పా... ఇది నా ఫస్ట్‌రైడ్ అండీ అని. కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత నుంచి వరస రైడ్స్. సాధారణంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు, సాయంకాలం అయిదు నుంచి ఏడు వరకు మాత్రమే రైడ్స్‌కి వెళ్తా.
ఒకరోజు మాత్రం రోజంతా తిరగాలనిపించి టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్లా. తినడానికి టైమ్ దొరికినా ప్లేస్ దొరకదు ఎక్కడా! అప్పుడనిపించింది హైదరాబాద్‌లో షెడ్స్‌లాంటివి కట్టి డైనింగ్ ప్లేసెస్‌గా డెవలప్ చేస్తే ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది కదా అని. రైడింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎవరూ నాతో మిస్ బిహేవ్ చేయలేదు. చాలా మంది తర్వాత వాట్సాప్‌లో ‘‘డూయింగ్ గుడ్.. గుడ్ జాబ్..’’ అంటూ మెసేజ్ పెట్టినవాళ్లే. ఒకతనైతే.. ఆడపిల్లలు బైక్ నడుపుతుంటే నాకు చాలా భయమేసేది. ఆమడదూరంలోంచి వెళ్లేవాణ్ణమ్మా. కాని నువ్వు నా ఒపీనియన్‌ను పటాపంచలు చేశావ్. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావ్ అని అప్రిషియేట్ చేశాడు’’ అని రాపిడో రైడర్‌గా తన అనుభవాలను చెప్పింది గాయత్రి.
మాయ...
ఒకవైపు సినిమాలు, ఇంకో వైపు కమర్షియల్స్ బిజీలో రాపిడో స్పీడ్‌ను కొంచెం స్లో చేసింది. పైగా ఇప్పుడు తన చిరకాల ఇచ్ఛ... లక్ష్యం అయిన ఫ్యాషన్ డిజైనర్‌గా ‘మాయ’ పేరుతో బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి త్వరలోనే ‘మాయా డిజైనర్ స్టూడియో’నూ ప్రారంభించనుంది. ‘‘పనికి అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేదు. కావల్సిందల్లా క్లారిటీ, కాన్ఫిడెన్స్ మాత్రమే. సెల్ఫ్ డిఫెన్సివ్‌గా ఉండాలి. మన బలం, బలహీనత పేరెంట్స్‌కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే అన్ని విషయాలనూ షేర్ చేసుకోవాలి. పేరెంట్స్‌ను మించిన ఫ్రెండ్స్ ఉండరు. జీవితంలో ప్రతిక్షణం విలువైందేనని గుర్తుంచుకోవాలి’’ అంటుంది లక్ష్మీ గాయత్రి ఆకుండి.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment