లేకేం, మైకేల్!
సంక్షిప్తంగా... మైకేల్ జాక్సన్
జూన్ 25. మైకేల్ జాక్సన్ మాట ఆగి, పాట ఆగి అప్పుడే ఐదేళ్లు! కానీ జాక్సన్ ఆల్బమ్స్ అతడిని ఏనాటికైనా మరణించడానికి అనుమతిస్తాయా?! మనమూ అతడిపై ప్రేమను ఏ జన్మకైనా వదులుకుంటామా! వియ్ ‘జస్ట్ కాంట్ స్టాప్ లవింగ్ హిమ్’. జాక్సన్ గాయకుడు, గేయ రచయిత, నటుడు, డాన్సర్, బిజినెస్‌మేన్, పరోపకారి, ఇంకా... కింగ్ ఆఫ్ పాప్. నేనెప్పటికీ పాడుతూనే ఉంటానన్నాడు... ‘ఫర్ యు అండ్ ఫర్ మీ... అండ్ ఎంటైర్ ది హ్యూమన్ రేస్’ అని పాడాడు.
పాటే జాక్సన్ కాబట్టి... మరణం అన్న మాటే లేదు జాక్సన్‌కి. మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ తెలియనిదెవ్వరికి? ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? అంతా వట్టి చెత్త. కాలాలకు, ప్రాంతాలకు, స్థితిగతులకు అతీతంగా వెలుగుతూ వెలుగుతూ అలా వెలుగులా నిలిచిపోయాడు. ‘గాట్ టు బి దేర్’ నుంచి ‘ఇన్‌విన్సిబుల్’ వరకు ఆల్బమ్ ట్రాక్స్ అన్నీ అతడి రక్తనాళాలతో దారి ఏర్పరచుకున్నవే. ఆ దారులు ఓకే, కానీ జాక్సన్ చెడ్డ దారుల్లో నడిచాడే! ఏమిటా చెడ్డ దారి?
స్కిన్ సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా? పిల్లల్ని హింసించాడు. సర్జరీ అతడిష్టం. కానీ హింసించాడని అనకండి. ఏడ్చేస్తుంది జాక్సన్ ఆత్మ. తండ్రి ప్రేమకు నోచుకోనివాడు, బాల్యాన్ని బలవంతంగా నెట్టుకుని వచ్చినవాడు, ‘లాస్ట్ చిల్డ్రన్’ (ది ఇన్‌విన్సిబుల్) కోసం ‘వియ్ సింగ్ సాంగ్స్ ఫర్ ద విషింగ్... ఆఫ్ దోజ్ హూ ఆర్ కిసింగ్... బట్ నాట్ ఫర్ ది మిస్సింగ్’ అంటూ ఉద్యమగీతం ఆలపించినవాడు జాక్సన్. పిల్లల ముఖంలో తనకు దేవుడు కనిపిస్తాడన్నాడు. పిల్లల నవ్వుల్లో నాకు దైవదర్శనం అవుతుందంటూ మోక్షపడ్డాడు. ఇక అనండి ఎన్ని మాటలు అంటారో అన్నీ! జాక్సన్ గురించి చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వినేవాళ్లు వింటూనే ఉంటారు. చివరికి మనసులో ఉండిపోయేది ఈ భూగోళంపై ఆయన చేసి వెళ్లిన మూన్ వాక్ మాత్రమే.
‘హార్పర్ కాలిన్స్’ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి మైకేల్ జాక్సన్‌పై ఒక కొత్త పుస్తకం వస్తోంది. ‘రిమెంబర్ ద టైమ్: ప్రొటెక్టింగ్ మైకేల్ జాక్సన్ ఇన్ హిజ్ ఫైనల్ డేస్’ అనే ఆ పుస్తకాన్ని బిల్ విట్‌ఫీల్డ్, జావన్ బియర్డ్, టానర్ కాల్బీ అనేవారు రాశారు. మొదటి ఇద్దరూ.. బిల్, జావన్... జాక్సన్ అంతరంగిక భద్రతా బృందంలోని సభ్యులు. జాక్సన్ చివరి రోజుల్లో వీళ్లిద్దరూ అతడిని బాగా దగ్గరగా చూశారు. జాక్సన్ వీళ్లతో మాటిమాటికీ ‘‘మీరెంతో అదృష్టవంతులు’’అనేవారట. ఎందుకు అతడు అలా అనేవాడో తెలుసుకోవాలంటే, జాక్సన్ ఇంకా ఎంత లోతైనవాడో అర్థం చేసుకోవాలంటే బిల్, జావన్ ఏం రాశారో చదవాలి. కన్నీళ్లొస్తాయి. రానివ్వండి. పుస్తకంలోని ముఖ్యాంశాలలో అవి కూడా ఒక భాగమే.
- మాధవ్ శింగరాజు