మన ఆర్చరీకి లెనినిజం
దశాబ్ద కాలం క్రితం దాదాపుగా ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లేదు. ఏ ఒక్కరు కూడా ఈ క్రీడవైపు పెద్దగా దృష్టి సారించలేకపోయారు. ఒకవేళ ఆసక్తి ఉన్నా శిక్షణ ఇచ్చే వారు కరువు. ఈ ఆట అంటే గుర్తుకు వచ్చేది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఆటగాళ్ల పేర్లే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పేరు మార్మోగిపోతోంది. మరి ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది...? దీనికి వెనుక ఉన్న ‘శక్తి’ ఎవరు అని ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం.. చెరుకూరి లెనిన్. ఒలింపియన్ మంగళ్‌సింగ్ చాంపియా, జిజ్ఞాస్, రితుల్ చటర్జీ, రిషిత, వెన్నం జ్యోతి సురేఖ.. ఇలా వీరంతా ఇప్పుడు భారత ఆర్చరీకి ఆశా కిరణాలు. వీరి ఎదుగుదలకు కారణం విజయవాడలోని చెరుకూరి ఓల్గా అకాడమీ. ఇది లెనిన్ స్థాపించినదే. లెనిన్ మన మధ్య భౌతికంగా లేకపోయినా... అతని ఆశయాలు, కలలను మాత్రం శిష్యులు నిజం చేస్తున్నారు.
- ఆలూరి రాజ్‌కుమార్
ప్రస్తుతం కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చెరుకూరి సత్యనారాయణ కుమారుడు లెనిన్. అతడి చెల్లి ఓల్గా కూడా ఆర్చరే. లెనిన్ ప్రారంభంలో రికర్వ్ ఆర్చర్‌గా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాంపౌండ్ ఆర్చరీని సాధన చేయడం ప్రారంభించాడు. ఆటపై తనకున్న అవ్యాజమైన ప్రేమతో కేవలం ఆరు నెలల్లోనే ఈ విభాగంలో జాతీయ, ఆసియా స్థాయిలో పతకాలు సాధించాడు. కాంపౌండ్ ఆర్చరీలో లెనిన్ 9 సంవత్సరాల పాటు జాతీయ చాంపియన్‌గానూ, రెండు సార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా స్థాయిలో తొలి లెవల్-3 ఆర్చరీ కోచ్‌గా సర్టిఫికెట్ పొందాడు. 2004లో అతడి చెల్లెలు ఓల్గా మరణం అతడిలోని కోచింగ్ ప్రతిభ బయటపడేందుకు కారణమైంది. ఆ మరుసటి ఏడాది చెరుకూరి ఓల్గా పేరిట ఆర్చరీ అకాడమీ ప్రారంభమైంది. ఇది స్థాపించిన ఆరు నెలలకే అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించడంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
రాష్ట్రానికి తొలి స్వర్ణం
2004-05లో కేరళలో జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో తన అకాడమీ సత్తా ఏమిటో తొలిసారిగా దేశానికి చాటి చెప్పాడు. కాంపౌండ్ టీమ్ విభాగంలో తన శిష్యులు చందూ నాగార్జునతో పాటు హైదరాబాద్‌కు చెందిన జకీర్, అరుణ్ కుమార్‌లతో కలసి రాష్ర్ట ఆర్చరీ చరిత్రలోనే కాంపౌండ్ విభాగంలో తొలి స్వర్ణ పతకం అందించాడు.
అలాగే 2005లో భారత కాంపౌండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించి ప్రపంచ ఆర్చరీని భారత్ వైపునకు దృష్టి మరల్చాడు. ఈ ఘనతలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేరేందుకు క్యూ కట్టారు.
వీరి ద్వారా కాంపౌండ్ ఆర్చరీలో జాతీయ స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పతకాలు వచ్చాయి.
2005 నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన 14వ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో లెనిన్ వ్యక్తిగతంగా స్వర్ణపతకం సాధించాడు. అలాగే తన శిష్యులు జిజ్ఞాస్, తేజలతో కూడిన రాష్ట్ర సబ్ జూనియర్ జట్టును జాతీయ చాంపియన్‌లుగా చేసి అందరి మన్ననలు పొందాడు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీని, తన శిష్యులను వరుసగా ఏడు సంవత్సరాల పాటు కాంపౌండ్ విభాగంలో జాతీయ చాంపియన్లుగా నిలిపాడు.
2006 నుంచి 2010 వరకు దేశంలో జరిగిన కాంపౌండ్ విభాగంలో వ్యక్తిగత చాంపియన్లుగా, టీమ్ చాంపియన్‌షిప్‌లోనూ లెనిన్ శిష్యులదే హవా.
2010లో దుర్మరణం
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన సందర్భంగా 2010 అక్టోబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆర్చరీ ఆటగాళ్లకు హైదరాబాద్‌లో సన్మానం ఏర్పాటు చేసింది. శిష్యులు సీహెచ్.జిజ్ఞాస్, రితుల్ ఛటర్జీతో కలసి మెమెంటో, నగదు బహుమతిని అందుకొని విజయవాడకు కారులో తిరుగుపయనమయ్యారు. కృష్ణా జిల్లా జూపూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల వయస్సులోనే లెనిన్ దుర్మరణం పాలయ్యాడు. అతను భౌతికంగా లేకపోయినా విజయవాడలోని వీఎంసీ- ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆర్చర్లు మాత్రం లెనిన్ పేరును నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు. అకాడమీ ఇప్పటి వరకు 86 అంతర్జాతీయ, 436 జాతీయ స్థాయి పతకాలు సాధించింది.
అద్భుత గౌరవం
2011 అక్టోబర్ 8, 9 తేదీల్లో ఇటలీలోని ట్యురిన్‌లో 186 దేశాలు పాల్గొన్న వరల్డ్ ఆర్చరీ ఫిటా మహాసభ జరిగింది. ఇక్కడ లెనిన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ యువ కోచ్‌గా ఆ వేదిక బ్యాక్ డ్రాప్‌లో లెనిన్ ఫొటో పెట్టారు. 186 దేశాల ఆర్చరీ ప్రతినిధులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
నేటి స్టార్లంతా తన శిష్యులే..
24 ఏళ్ల వయస్సులోనే లెనిన్ దాదాపు 150 మందికి శిక్షణ ఇచ్చాడు. అందులో 17 మంది అంతర్జాతీయ, 60 మంది వరకు జాతీయ స్థాయిలో ఆర్చర్లుగా పేరు తెచ్చుకున్నారు. 2010 ఢి ల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ముగ్గురు సభ్యులతో కూడిన భారత కాంపౌండ్ జట్టు బరిలోకి దిగింది. దీంట్లో సీహెచ్.జిజ్ఞాస్, రితుల్ ఛటర్జీ ఇద్దరూ లెనిన్ శిష్యులే. అలాగే ఆర్చరీ జాతీయ కోచ్‌గా టీమ్ ఈవెంట్‌లో రజతం అందించాడు. జ్యోతి సురేఖ జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటోంది. ఇదే అకాడమీలో శిక్షణ పొందిన మంగళ్‌సింగ్ చాంపియా ఒలింపిక్స్ వరకు వెళ్లాడు. అనేక మంది పేద క్రీడాకారులు, అనాథలు, వికలాంగులను చేరదీసిన లెనిన్ తన సర్వస్వాన్నీ అకాడమీ కోసమే ధారపోశాడు.
‘రియో ఒలింపిక్స్ (2016)లో అకాడమీలోని పిల్లల్లో ఎవరో ఒకరు పతకం గెలవాలనేది లెనిన్ కల. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా... ఎన్ని కష్టనష్టాలైనా భరించి లెనిన్ ఆశయాన్ని నెరవేరుస్తాం’
- చెరుకూరి సత్యనారాయణ (లెనిన్ తండ్రి)
‘కోల్‌కతా, పుణే, రాంచీలలోని అకాడమీలకు దీటుగా లెనిన్ విజయవాడలో అకాడమీ నెలకొల్పారు. ప్రాక్టీస్‌లో స్వేచ్ఛ ఇచ్చి... తర్వాత వీడియో ద్వారా తప్పులు చూపించేవారు. తను బతికి ఉంటే విజయవాడ నుంచి మరింత మంది ఆర్చర్లు వచ్చేవాళ్లు’
- రిషిత (లెనిన్ శిష్యురాలు)