జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు! | Life is not a marks nota ranks | Sakshi
Sakshi News home page

జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు!

Published Fri, Apr 28 2017 12:03 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు! - Sakshi

జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు!

లైఫ్‌

చదువుకు పెద్ద పీట... మంచిదే! మరి... చదువు ఏం నేర్పాలి? పిల్లల్లో విలువల్ని నేర్పాలి... బతకగలమనే ధైర్యాన్నివ్వాలి! అలాంటి చదువును...   ఇప్పుడు చదవనిస్తున్నామా? నాకిదిష్టం అని చెప్పే అవకాశం ఈ తరం పిల్లలకు ఉంటోందా? వాళ్లలో ఆలోచన పుట్టకముందే ఆశయాలు సిద్ధమవుతున్నాయి. డాలర్ల సంపాదనే జీవితమా? తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యమా! ఇవన్నీ కనిపించని రంపాలే. ...లేత గుండెలను కోస్తున్నాయి. చిట్టి మొగ్గలు వాడిపోతున్నాయి పిల్లల్ని వికసించనివ్వండి! వాళ్లను ఆలోచించనివ్వండి!!

‘‘నేను డాక్టర్‌ కావాలనుకున్నాను... కాలేకపోయాను. మా అబ్బాయి డాక్టర్‌ అయి నా కల తీరుస్తాడు’’ మురిసిపోతూ చెప్తున్నాడు పవన్‌కుమార్‌ ఫోన్‌లో తన ఫ్రెండ్‌తో. రీడింగ్‌ టేబుల్‌ దగ్గర ఉన్న వినీత్‌కి వినిపిస్తూనే ఉన్నాయా మాటలు. తల పుస్తకంలో దూర్చి ఉన్నాడు, కళ్లు అక్షరాల వెంట పరుగుతీస్తున్నాయి. విషయమే బుర్రకెక్కడం లేదు. ఏవేవో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. న్యూటన్స్‌లా, కెమికల్‌ రియాక్షన్స్, ఈక్వేషన్స్, బయాలజీ ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌ అన్నీ 24 ఫ్రేమ్స్‌లో కళ్లముందు గిర్రున కదలాడుతున్నాయి. ఆకు అడ్డుకోత, చర్మ నిలువుకోత... రికార్డు రాసి రాసి తనకు మాత్రం గుండెకోత మిగిలేట్టుంది... నిర్లిప్తంగా పుస్తకం మూశాడు. ‘‘చంటీ బుక్‌ మూస్తున్నావ్‌... రివిజన్‌ పూర్తయిందా’’ అన్నది డైనింగ్‌ టేబుల్‌ మీద గిన్నెలు సర్దుతున్న సుమిత్ర.

‘‘వేరే సబ్జెక్టు చదువుదామని...’’ ఆపద్ధర్మంగా తోచిన అబద్ధం చెప్పి, తప్పదన్నట్లు మరో పుస్తకం తీశాడు వినీత్‌. ఆ క్షణానికైతే తప్పించుకుని మరో పుస్తకంలో తల దూర్చాడు. పేరెంట్స్‌ తన ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భావం ఎక్కడో గుండెల్లో కలుక్కుమనిపించింది. ‘‘రాత్రి పదకొండయింది. ఇక పడుకో నాన్నా! మళ్లీ నాలుగింటికే లేవాలి కదా’’ అంటూ లైటాపేసింది సుమిత్ర. ‘‘సతీశ్‌ వాళ్లబ్బాయి అర్ధరాత్రి రెండింటి వరకు చదువుకుంటున్నాడు. వీడిని పది దాటినప్పటి నుంచి నువ్వే ఎప్పుడెప్పుడు పడుకోబెడదామా అన్నట్లు చూస్తుంటావు. ఇలాగైతే మెడిసిన్‌లో సీట్‌ వచ్చినట్లే’’ విసుక్కున్నాడు పవన్‌.

‘‘నిద్రపోకపోతే ఎలా? చదివింది బుర్రకెక్కాలి కదండీ!’’ సుమిత్ర సర్దిచెప్పబోయింది. ‘‘నువ్విలాగే వెనకేసుకురా. లాస్ట్‌ వీక్‌... వీక్లీ టెస్ట్‌లో మార్కులు తగ్గినప్పటి నుంచి కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఇప్పటికి మూడుసార్లు ఫోన్‌ చేశారు. ర్యాంకు తెస్తాడని మీ వాడి మీద హోప్స్‌ పెట్టుకున్నాం. ఇలాగైతే కష్టం’’ అంటూ చివాట్లేశారాయన. ఎంతెంత ఫీజులు కట్టాను. నీకే బాధ్యత తెలియకపోతే ఇక వాడికెలా తెలుస్తుంది. డబ్బు కడితే తెలుస్తుంది... భార్య మీద ఉన్న పాత అసహనాలన్నీ ఈ వంకతో తీర్చుకున్నాడు పవన్‌. వినీత్‌ పడుకున్నాడు. కళ్లు మూసుకుంటే కనురెప్పల కింద పుస్తకాల దొంతరలు కనిపిస్తున్నాయి. పేరెంట్స్‌ మాటలు చెవుల్ని తాకుతున్నాయి. మూసుకుందామంటే చెవులకు రెప్పలు లేవు.పరీక్షలన్నీ అయిపోయాయి. రిజల్ట్స్‌ రోజు దగ్గర పడుతుంటే... పవన్‌లో ఆందోళన పెరుగుతోంది. ఏదైమైనా తన కొడుకు డాక్టర్‌ కావాల్సిందే. డాక్టర్‌గారి తండ్రిగా పొందే గౌరవాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒక్కో రిజల్ట్‌ వస్తుంటే అంచనాలు తప్పుతున్నాయేమోననే ఉద్వేగం కూడా పెరుగుతోందా తండ్రిలో.

‘‘ప్రణవ్‌! నీకు ఈ టీషర్ట్‌ ఇష్టం కదా తీసుకో’’ అంటూ స్పైడర్‌మాన్‌ టీ షర్ట్‌ తమ్ముడికిచ్చాడు వినీత్‌.‘‘థాంక్స్‌ అన్నయ్యా!’’ అంటూ స్పైడర్‌మాన్‌ టీ షర్ట్‌ తీసుకుని ఒంటిమీద పెట్టుకుని అద్దంలో చూసుకున్నాడు ప్రణవ్‌. వినీత్‌ తమ్ముడి కళ్లలో ఆనందం చూస్తూ ‘‘నా జీన్స్, హుడీస్, జెర్కిన్స్‌లో నీకేమేమి కావాలో అన్నీ తీసుకో’’ అన్నాడు. ప్రణవ్‌కది కొత్త. అన్నయ్య అడక్కుండానే ఇవ్వడం ఎప్పుడూ లేదు. ‘‘అన్నీ నేను తీసుకుంటే నీకు వద్దా అన్నయ్యా? ఎప్పుడూ ఒక్కసారి వేసుకుంటానన్నా ఇచ్చేవాడివి కాదు. ఇప్పుడన్నీ ఇచ్చేస్తున్నావేంటన్నయ్యా. నెక్ట్స్‌ ఇయర్‌ నువ్వు మెడిసిన్‌లో చేరి హాస్టల్‌కెళ్లిపోతావ్‌గా. అందుకే ఇప్పుడే ఇస్తున్నావా’’ వినీత్‌సమాధానం కోసం చూడట్లేదు ప్రణవ్‌. తానే ఓ సమాధానం వెతుక్కున్నాడు. వినీత్‌ మెల్లగా చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకు అర్థం వెతకడం ప్రణవ్‌ బాల్యానికి చేతగాదు, నవ్వులో తేడా గుర్తించగలిగిన సుమిత్రకు, పవన్‌కు... వినీత్‌ అలా నవ్వినట్లే తెలియదు.

ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరూ నిద్రలేచిన అలికిడి లేదు. సుమిత్ర నిద్రలేచి పాలపాకెట్‌ కోసం తలుపు దగ్గరకు వెళ్లింది. చెయ్యెత్తి గడియ తీయబోయింది... కానీ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇంత ఉదయాన్నే తలుపు ఎవరు తీశారు? బహుశా రాత్రి పవన్‌ కారిడార్‌లో నిలబడి ఫోన్‌ మాట్లాడాడు. ఫోన్‌ మాట్లాడుతూనే లోపలికి వచ్చాడేమో! తలుపు గడియ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు... అనుకుంది. అదే మాట భర్తను అడిగింది. తాను గడియ వేసినట్లు చెప్పాడు. అంతలోనే పవన్‌కు ఏదో సందేహం... వినీత్‌ గదిలోకెళ్లి చూశాడు.బాత్‌రూమ్‌లో ఉన్నాడేమోనని చెవులు రిక్కించాడు... నిశ్శబ్దం.

‘‘వినీత్‌ను బయటకు పంపించావా?’’ సుమిత్రకు వినిపించేలా అన్నాడు. లేదంది సుమిత్ర. గుండె కొట్టుకోవడం పైకి వినిపిస్తోంది పవన్‌కి. రీడింగ్‌ టేబుల్‌ మీద రోల్‌ చేసి క్లిప్‌ పెట్టిన పేపర్‌ మీద ఆగింది అతడి దృష్టి. క్షణాల్లోనే అర్థమైంది... వినీత్‌ లేడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ‘‘నాన్నా! మీ యాంబిషన్‌ని నేను ఫుల్‌ఫిల్‌ చేయలేను. సారీ’’ అని ఒకే ఒక వాక్యం ఉంది. సుమిత్రకు పవన్‌ మీద పట్టరాని కోపం వస్తోంది. వినీత్‌ బాల్యం వాడిది కాకుండా పోవడానికి కారకుడు భర్తేనని ఆమె గుండె ఘోషిస్తోంది. ఒక్కో సంఘటనా కళ్ల ముందు మెదలుతోంది. పవన్‌ అప్పటికే ఎవరెవరికో ఫోన్‌లు చేస్తున్నాడు. సుమిత్ర ఆవేశంగా లేచి వెళ్లి... వినీత్‌ పుస్తకాలన్నీ తెచ్చి పవన్‌ ముందు పడేసింది. ‘‘మీకు ఏడాది టైమిస్తాను. వీటన్నింటినీ చదివి పరీక్ష రాయండి. మెడిసిన్‌లో సీటొచ్చే ర్యాంకు కాదు కదా! కనీసం క్వాలిఫై అవండి’’ అంటున్నప్పుడు ఆమె కళ్లు వర్షిస్తున్నాయి.

సుమిత్రను సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు పవన్‌. వినీత్‌ ఆచూకీ తెలియడం లేదు. కనీసం బాడీ కూడా... కన్న పేగు ఆ మాట అనలేక పోతోంది... కానీ కడుపు రగిలిపోతూనే ఉంది, మనసు కుమిలిపోతోంది. వాళ్లిద్దరినీ మార్చి మార్చి చూసిన సైకాలజిస్ట్‌ ‘‘మీరు డాక్టర్‌ కావాలనుకుని కాలేకపోయారు, మీ కొడుకు ద్వారా ఆ కోరిక తీర్చుకోవడానికి ఇది రెండున్నర గంటల సినిమా కాదు కదా! జీవితం... మీ అబ్బాయి జీవితం. మీ లక్ష్యాలను అందుకోవడానికి పిల్లలను సాధనాలు చేయడం సబబేనా’’ అంటూ మొదలు పెట్టి గంటన్నర సేపు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విద్య వ్యాపారంగా మారిన నేపథ్యంలో ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఇంజనీరు లేదా డాక్టరు అయి తీరాలనే టార్గెట్‌ని పేరెంట్స్‌ మెదళ్లలో చొప్పించిన వైనం పవన్‌కు అర్థమవుతోంది. ఆ మాయాజాలంలో పడి వినీత్‌ గమ్యాన్ని అగమ్యగోచరంగా చేశాననే పశ్చాత్తాపం మొదలైంది.‘‘వినీత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదో పని చేసుకుని బతుకుతున్నాడా? ఎప్పటికైనా ఇంటికి వస్తాడా’’ ప్రశ్నలు అనుక్షణం ఎదురుగా వెక్కిరిస్తున్నాయి.

పరీక్షే జీవితం కాదు!
జీవితం అంటే పరీక్షలో రాణించడం ఒక్కటే కాదని పిల్లలకు చెప్పాలి. లైఫ్‌లో సక్సెస్‌ అయిన వారిలో స్కూల్‌ ఫైనల్‌ ఫెయిలైన వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లు ఒక ఫెయిల్యూర్‌ తర్వాత జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ఎలా మలుచుకున్నారో, ఎలా రాణించారో వివరించాలి. ఒకసారి పరీక్ష పోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, కోరుకున్న కోర్సులో సీట్‌ రాకపోయినా ప్రయత్నించడానికి మరో ఏడాది మన చేతుల్లోనే ఉందని చెప్పి వారిని ప్రోత్సహించాలి.

కనిపించే లక్షణాలివి!
⇒ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. దేనిమీదా ఆసక్తి ఉండదు.
⇒వాళ్లకు ఇష్టమైనవి వండినా కడుపునిండా తినలేరు. కంటినిండా నిద్రపోలేరు.
⇒తమకిష్టమైన దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఇతరులకిచ్చేస్తుంటారు.
⇒కొన్నాళ్లయినా అమ్మానాన్నలను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తుంటారు.
పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు, రిజల్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఫలితాలు ఆశించిన విధంగా లేనప్పుడు... పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ల ప్రవర్తనలో తేడాను గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ఒంటరిగా వదలకూడదు.
– వాకా మంజులారెడ్డి
ఇన్‌పుట్స్‌: రోష్ని స్వచ్ఛంద సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement