ఆ అవగాహన వస్తుంది ఇలా...
మాకు ఎనిమిది, పది సంవత్సరాల పిల్లలున్నారు. వాళ్లకు పొదుపు చేయడం నేర్పించాలనుకుంటున్నాను. మంచి సలహా ఇవ్వగలరు.
- రాగిణి, గుంటూరు
ఇప్పటినుంచే పిల్లలకు పొదుపు, పెట్టుబడిని అలవాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇందు కోసం కొన్ని ఐడియాలు...{పతి నెల వారికి కొంత పాకెట్ మనీ ఇవ్వండి. అలాగే ఒకటి పొదుపు కోసం, మరొకటి ఖర్చుల కోసం అంటూ రెండు డిబ్బీలు ఏర్పాటు చేయండి. పాకెట్ మనీ అయినా, ఇతరత్రా గిఫ్ట్ రూపంలో డబ్బులు వచ్చినా వాటిల్లో వేసేట్లు అలవాటు చేయండి. ముందు పొదుపు కోసం అంటూ ఇంత మొత్తం అని కేటాయించి, మిగతాదే ఖర్చుల డిబ్బీలో వేసేలా నేర్పండి. ఊరికే పొదుపు చేయడం అని కాకుండా సైకిల్, ఐప్యాండ్ లాంటివి ఏదో ఒకటి సమకూర్చుకునేలా దానికి ఒక లక్ష్యం అంటూ నిర్దేశించండి.
{పస్తుతం బ్యాంకులు పిల్లల కోసం కూడా ఖాతాలు అందిస్తున్నాయి. కాబట్టి పిల్లల పేరిట అకౌంటు తెరిచి, రెగ్యులర్‌గా ప్రతి నెలా అందులో ఎంతో కొంత డిపాజిట్ చేసేలా ప్రోత్సహించవచ్చు. డిబ్బీలో దాచిపెట్టుకోవడం, బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం మధ్య తేడాలను, ప్రయోజనాలను వారికి వివరించండి. మరోవైపు, చిన్నతనం నుంచే పొదుపు, పెట్టుబడులు చేయడం వల్ల చక్రవడ్డీ మహిమతో అధిక ప్రయోజనం ఎలా పొందవచ్చన్నది తెలిసేలా చెప్పండి. ఇవే కాకుండా, ప్రతి నెలా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు మీ పిల్లలను కూడా వెంట తీసుకెళ్లండి. వివిధ ఉత్పత్తుల ధరల గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. దీనివల్ల రేట్ల పెరుగుదల, తగ్గుదల గురించి వారికి కూడా తెలుస్తుంది.
- రజనీ భీమవరపు, సీఎఫ్‌పీ, జెన్‌మనీ