
రక్తంలోని విటమిన్ డీ తక్కువైన కొద్దీ మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతాయని అంటున్నారు దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు. 1997 – 99 మధ్యకాలంలో మధుమేహంతోపాటు ప్రీడయాబిటిస్ వంటివేవీ లేని వెయ్యి మంది వివరాలు తాము సేకరించామని.. పదేళ్ల తరువాత అంటే 2009లో వీరందరినీ మళ్లీ పరీక్షించినప్పుడు విటమిన్ డీకి మధుమేహానికి మధ్య ఉన్న సంబంధం స్పష్టమైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
మొత్తం వెయ్యి మందిలో 47 మంది మధుమేహులుగా తేలితే.. 337 మంది ప్రీడయాబిటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిసిందని, వీరందరిలోనూ రక్తంలోని విటమిన్ డి మోతాదు బాగా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. విటమిన్ డీ మోతాదు ఎక్కువైన కొద్దీ వారికి మధుమేహం వచ్చే అవకాశాలు అంతే స్థాయిలో తక్కువవుతున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని వివరించారు. అయితే మధుమేహంలో విటమిన్ డీ పాత్ర ఏమిటన్నది స్పష్టంగా తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment