ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను
అంతర్వీక్షణం: రతీ అగ్నిహోత్రి
రతీ అగ్నిహోత్రి అంటే... ప్రేమసింహాసనం, కలియుగరాముడు సినిమాల్లో ఎన్.టి. రామారావు పక్కన బంగారు తీగలా కనిపించిన అమ్మాయి. సత్యం శివంలో ఏఎన్నార్‌కి జోడీ. ఇంకా చెప్పాలంటే ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి సినిమాకు డ్యూయెట్‌ల గ్లామర్‌నద్దిన రూపసి. మరోచరిత్రలో నటి సరిత నటించిన పాత్రను హిందీలో ‘ఏక్ తుజే కే లియే’ సినిమాతో దేశమంతటికీ పరిచయం చేసిన నటి. ఇవాళ రతి అగ్నిహోత్రి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె అంతర్వీక్షణం.
పంజాబీ కుటుంబంలో పుట్టిన మీకు దక్షిణాది సౌకర్యంగా అనిపించిందా?
మాది పంజాబీ కుటుంబమే అయినా నేను పుట్టేనాటికి మా కుటుంబం ముంబయిలో ఉండేది. నా స్కూలు రోజుల్లోనే నాన్నకు చెన్నైకి బదిలీకావడంతో ఆ వాతావరణం బాగా అలవాటైంది. నాకెప్పుడూ దక్షిణాది కొత్తగా అనిపించలేదు. నా పుట్టింటిలాగానే భావించాను.
సినిమారంగంలో అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
నేను చెన్నైలోని ‘గుడ్ షెఫర్డ్స్’ కాన్వెంట్‌లో చదువుకుంటున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో ఓ నాటకంలో నటించాను. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చిన వారు దర్శకులు భారతీరాజా అనే విషయం కూడా తెలియదు. ఆయన నేరుగా నాన్నగారిని కలిసి తన సినిమాలో నటించమని అడిగినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. భారతీరాజా వంటి పెద్దాయన అడగడంతో కాదనలేక నాన్న అయిష్టంగానే అంగీకరించారు.
అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు కదా! మరి అన్ని భాషలూ నేర్చుకున్నారా? ఇప్పుడెవరూ అంత పట్టుదలగా నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు!
భాష నేర్చుకుని డైలాగ్‌ని పలికితే నటనలో యాభై శాతం పాసైనట్లే. నేను ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను. తెలుగు, కన్నడ బాగా మాట్లాడతాను. మలయాళం కూడా ఫర్వాలేదు ఓ మోస్తరుగా వచ్చు.
హిందీ సినిమాల్లో కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే తెరమరుగయినందుకు తర్వాత చింతించారా?
ఏ మాత్రం లేదు. అనిల్‌ని పెళ్లి చేసుకోవడం నేను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం. పెళ్లి తర్వాత వైవాహిక జీవితానికి, కుటుంబానికి పరిమితం కావాలనేది కూడా నేను ఇష్టంగా తీసుకున్న నిర్ణయమే. పైగా అది అవసరమైన నిర్ణయం కూడా.
మరి దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ నటించాలని ఎందుకనిపించింది?
మా అబ్బాయి తనూజ్ పెద్దయ్యాడు. నాకు అవసరానికి మించినంత ఖాళీ సమయం ఉంది. ‘మళ్లీ నటించవచ్చు కదా’ అని మావారు, అబ్బాయి ఇద్దరూ ప్రోత్సహించడంతో అంగీకరించాను.
ఆ పదిహేనేళ్ల కాలాన్ని వెనక్కి చూసుకుంటే మీకేమనిపిస్తోంది?
ఆ విరామంలో నేను చాలా నేర్చుకున్నాను. మా వారు ఆర్కిటెక్ట్ కావడంతో ఆయన వృత్తి వ్యవహారాల్లో ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ వంటి నాకు తోచినవేవో చేసేదాన్ని. గ్లాస్ పెయింటింగ్స్ వేశాను. శిల్పాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. నేను సొంతంగా డ్రై ఫ్లవర్స్ తయారు చేస్తాను కూడా. వీటన్నింటితోపాటు ‘రేకీ’ అనే వైద్య ప్రక్రియలో కోర్సు చేశాను.
వివాహం, భర్త ఎంపిక విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా?
నా పెళ్లయి దాదాపు 30 ఏళ్లయింది. సరైన నిర్ణయం తీసుకున్నాననే విశ్వాసంతోపాటు జీవితాన్ని చక్కగా మలుచుకున్నాననే సంతోషం కూడా ఉంది.