శ్రద్ధగా వినాలి... ఆదరంగా మాట్లాడాలి!
ఆత్మీయం
మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో సంభాషిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నా... అవతలివారు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్న విషయం మీద అత్యంత జాగరూకతతో ఆలోచన చేయాలి. అలాగే మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కమాట పొల్లుపోకూడదు. కొంతమందికి కొన్ని ప్రమాదకరమైన ఊతపదాలు అపయత్నంగా దొర్లుతుంటాయి. వాటి విషయంలో జాగత్తగా ఉండాలి. జీవితంలో వృద్ధిలోకి రావడానికి మొట్టమొదట అలవరచుకోవలసింది ఈ నైపుణ్యాలనే.
ఒకవేళ అవి లేకపోతే భేషజాలకు పోకుండా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండొచ్చన్న అంశం మీద ఎక్కువ శ్రద్ధచూపే బదులు... ‘సరే! ఈ తప్పు జరిగింది, వెంటనే దీన్ని ఎలా సరిదిద్దవచ్చు, సాధ్యమైనంతగా దీన్ని మనం ఎలా సఫలీకృతం చేయవచ్చు’ అన్న దాని మీద దృష్టి పెట్టాలి. విమర్శించడానికి, రాళ్ళు వేయడానికి గుంపులో ఒకడిగా నిలబడడం గొప్పకాదు. ఒకరు చేసిన పొరబాటును వేరొకరు దిద్దడం విశాల హృదయానికి సంకేతం.
అదేవిధంగా ఏదైనా ఒక విషయంలో అవతలివారు నోరు విప్పకముందే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటాం. అలా వచ్చేసిన తరవాత ఎదుటివాడు చెప్పేది వినడానికి మనసు అంగీకరించదు, కాబట్టి మనం వినం. అది ప్రతిఘటనకు దారితీస్తుంది. దాంతో వినే ఓపిక నశించిపోయి అవతలివారి మీద కోప్పడతాం. అది మంచి లక్షణం కాదు.