Expertise
-
అడ్మినిస్ట్రేషన్ స్కిల్ (పాలనా నైపుణ్యం) మీలో ఉందా?
అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా? కంపెనీ లాభాల బాటలో నడవటానికి పరిపాలనా విభాగం సరిగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఉన్నవారు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించటంతో పాటు, ఉద్యోగులందరిలో పాజిటివ్ ఆటిట్యూడ్‌ను కలిగిస్తారు. సమన్వయంతో ఉంటూ, ఉద్యోగస్తులందరిలో స్ఫూర్తిని నింపుతారు. ఆపదలో కంపెనీకి అండగా నిలుస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకుంటున్నారా? పరిపాలనా నైపుణ్యం మీలో ఎలా ఉందో తెలుసుకోండి. 1. మీ దగ్గరకొచ్చేవారి పేర్లను బాగా గుర్తుంచుకుంటారు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. (సిగరెట్ తాగటం, చూయింగ్ గమ్ నమలటం, మాటలకు అడ్డురావటం లాంటివి చేయరు). ఎ. కాదు బి. అవును 2. సమయపాలనను అనుసరిస్తారు. ఇలానే ఉద్యోగులందరూ ఉండాలని సూచిస్తారు. ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకుంటారు. ఉద్యోగు లందరితో స్నేహభావంతో ఉంటారు. ఎ. కాదు బి. అవును 3. వృత్తిలో జాగరూకతతో ఉంటారు. ఎటువంటి తప్పులకు తావివ్వరు. పాలనా పరమైన అంశాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 4. వినయంగా ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఎ. కాదు బి. అవును 5. వ్యక్తిగత సమస్యలను ఆఫీసు దాకా తీసుకు రారు. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 6. వృత్తిలో పారదర్శకత చూపిస్తారు. తోటివారి సలహాలు సూచనలు అవలంబిస్తారు. వారిని కించపరచరు. క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలరు. ఎ. కాదు బి. అవును 7. ప్రతిమాటని ఆలోచించి మాట్లాడతారు. మీపై గౌరవం పెరగటానికి ఇది చాలా ముఖ్యమని మీకు తెలుసు. ఇదేవిధంగా మీటింగ్‌లలో మాట్లాడతారు. ఎ. కాదు బి. అవును 8. ఓపిక, దయ, జాలి, క్షమల ద్వారా సహనాన్ని పొందుతారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేష¯Œ ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 9. పనిచేస్తున్న సంస్థ పట్ల చాలా విశ్వాసంగా, నిజాయితీగా ఉంటారు. అవిశ్వాసం మీ కెరియర్ని మెరుగుపరచదని మీరు గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. వృత్తిని ఇష్టంగా చేస్తారు. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సెన్సాఫ్ హ్యూమర్ మీలో ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో పాలనా నైపుణ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. మీలో ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఎక్కడకు వెళ్లినా పేరు తెచ్చుకుంటుంటారు. మేనేజ్మెంట్ దృష్టిలో గుర్తింపు పొందుతారు. సాటి ఉద్యోగుల దగ్గర మన్ననలు పొందుతారు. ఈ ఆటిట్యూడ్ మీ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఆర్థికంగా బలపరచటానికి కూడ ఉపయోగపడుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే మీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేదనే చెప్పాలి. ఇతరులమీద ఆధార పడటమే కాని స్వతంత్రంగా వ్యవహరించటం మీకు తెలియదు. ‘బి’ లను సూచనలుగా భావించి పాలనా నైపుణ్యం ఎలా పొందవచ్చో తెలుసుకోండి. -
తను ఎవరు?
అద్దంలో ఒక బొడిపె ఉంటే మిగతా అద్దం కనపడదు...బొడిపే కనిపిస్తుంది.కాగితం మీద ఒక చుక్క ఉంటే ఆ చుక్కే కనిపిస్తుంది...కాగితం కనపడదు. దోషం లేని సృష్టే లేదు. మనసూ అంతే... ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తెలిసో తెలియకో చందమామలాంటి మనసులో ఒక మచ్చ కనపడవచ్చు. అలాగే వ్యక్తిత్వంలో ఇలాంటి మచ్చలు తొమ్మిది ఏరి మీకు చూపిస్తున్నాం. మచ్చ మంచిదే... అదుపు మీరకుంటే!! ఒక్కొక్క వ్యక్తి వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. ఈ తీరును బట్టే సమాజం అతడి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి వ్యవహారంలో తేడాలున్నప్పటికీ స్థూలంగా అందరూ సమాజం ఆమోదించేలాగే వ్యవహరిస్తారు. అయితే కొందరి వ్యవహారశైలి కొంత ఎక్కువ, తక్కువలతో తేడాగా ఉండి, అది సమాజాన్ని కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలతో వచ్చే ఇబ్బందులను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. వాటి గురించి అవగాహన, అలాంటి వ్యవహారశైలి ఉన్నవారు తమను ఎలా చక్కదిద్దుకోవాలో తెలియజేయడం కోసం ఈ కథనం. 1 పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు అందరితో సామాజిక సంబంధాలను సరిగా నెరపలేరు. ఇతరులను తేలిగ్గా నమ్మరు. ప్రతివారినీ అనుమానంగా చూస్తారు. ఇతరుల పట్ల వారికి ఉన్న అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు అవసరమైన సమర్థనలను (క్లూస్) ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. తాము ఏదైనా అంశంలో వైఫల్యం చెందినప్పుడు చాలా ఎక్కువగా సెన్సిటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. ఇతరులతో పొసగని సంబంధాలు నెరపుతుండటమే కాకుండా వారితో తగవు పెట్టుకునేందుకు అవసరమైన సాకులు వెతుక్కుంటుంటారు. అంతేకాదు తమకు నచ్చని పని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేయడం ఇష్టం లేక దాని పట్ల తమ అయిష్టం ఎందుకో వివరించేందుకు ఇతరుల ఉదాహరణలు తీసుకొని తమను తాము సమర్థించుకుంటుంటారు. తమను సరిచేయబోయేవారిని ద్వేషించడం ప్రారంభిస్తారు. 2 స్కీజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ వ్యక్తిత్వ సమస్య ఉన్నవారు తాము మిగతా సమాజం నుంచి వేరుగా ఉండటాన్ని ఇష్టపడతారు. తమదైన ప్రపంచంలో, తమ ఊహాలోకపు ఫ్యాంటసీలలో విహరిస్తుంటారు. ఇతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను నెరపడానికి ఇష్టపడరు. అంతేకాదు... ఎంతో బలమైనవిగా పరిగణించే లైంగికపరమైన బాంధవ్యాల పట్ల కూడా వీరికి ఆసక్తి ఉండదు. ఉద్వేగపరమైన స్పందనలు (ఎమోషనల్ రెస్పాన్స్) కూడా పెద్దగా ఉండదు. ఒక దీర్ఘకాలిక బంధాన్ని కోరుకుంటున్నప్పటికీ దాన్ని కొనసాగించలేరు. దాంతో నిరాశగా మళ్లీ తమదైన ఒంటరి ప్రపంచంలోకి ముడుచుకుపోతారు. అయితే వారి తాలూకు ప్రవర్తనను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు సాధారణంగా తమ ఆలోచనల్లో ఉన్న వైవిధ్యాన్ని ప్రదర్శించరు. దాంతో తమ ప్రవర్తన లోపంతో సమాజానికి ఒక పట్టాన పట్టుబడరు. 3 స్కీజోటైపల్ డిజార్డర్ : ఈ తరహా డిజార్డర్ ఉన్నవారు కనిపించేతీరు, ప్రవర్తన, మాటలు అన్నీ చాలా వింతగా ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారిలో కనిపించే ఆలోచనలే వీరిలోనూ ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారు కొన్ని రకాల భ్రాంతులకు గురవుతుంటారన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు తమకు ఏవో దెయ్యాలు కనిపిస్తున్నాయనీ, మాటలు వినిపిస్తున్నాయని వారు అంటుంటారు. అలాగే స్కీజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారు ఇతరులు తమకు హానిచేసేందుకు యత్నిస్తున్నారంటూ నమ్ముతూ, సామాజిక బంధాలను కొససాగించరు. చుట్టూ జరిగే సంఘటనలను తమ నమ్మకానికి అనువుగా వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే వీరికి సామాజిక బంధాలను కొనసాగించడమే ఇష్టం ఉండదు. ఇక ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే... షైజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారిలో దాదాపు 50 శాతం మంది స్కీజోఫ్రీనియాకు గురవుతుంటారు. అందుకే ఈ కండిషన్‌ను ‘లేటెంట్ స్కీజోఫ్రీనియా’ అని కూడా అంటారు. 4 బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ : భావోద్వేగాల పరంగా స్థిరత్వం లేనివారిని బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌గా చెప్పడం జరుగుతుంటుంది. ఇలాంటివారిలో బలమైన సొంత వ్యక్తిత్వం నిర్మితం కాదు. దాంతో అందరూ తనను తృణీకరిస్తున్నారనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలను స్థిరంగా కొనసాగించలేరు. ఒకసారి బలంగా సంబంధాలు నెరపుతూ అంతలోనే వాటిని బలహీన పరుచుకుంటుంటారు. భావోద్వేగాల వ్యక్తీకరణలోనూ స్థిరత్వం ఉండదు. ఒక్కోసారి చాలా కోపంగా, హింసాత్మకంగా ఉంటారు. ప్రత్యేకంగా తమను ఎవరైనా విమర్శించినప్పుడు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతుంటారు. తిరగబడేరీతిలో చాలా త్వరగా ప్రతిస్పందిస్తుంటారు. తాము ఆత్మహత్య చేసుకుంటామనీ లేదా తమకు తాము హాని చేసుకుంటామనే బెదిరింపులు చాలా సాధారణం. వీరిలో అటు నరాలకు సంబంధించిన (న్యూరోటిక్) ప్రవర్తనలతో పాటు ఇటు సైకోటిక్ తరహా ప్రవర్తలు కనిపిస్తుంటాయి. యాంగై్జటీ, స్కీజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి లక్షణాలకు బార్డర్లో ఉండటం వల్ల ఈ వ్యక్తుల ప్రవర్తన తీరుకు ‘బార్డర్‌లైన్’ అని పేరు పెట్టారు. సాధారణంగా చిన్నప్పుడు లైంగికంగా వేధింపులకు గురైనవారిలో ఈ బార్డర్‌లైన్ పర్సనాలిటీ పెరుగుతుంది. ఇది మహిళల్లో ఎక్కువ అని కొందరు విశ్లేషిస్తుంటారు. మహిళల్లో ఈ తరహా పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఒకే భాగస్వామితో ఉండరనీ, అదే పురుషులు అయితే హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారనీ కొందరు పేర్కొనడం ఈ వ్యాధి విషయంలో ఉన్న చర్చ. 5 హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా ప్రవర్తన ఉన్నవారిలో సొంత వ్యక్తిత్వం ఉండదు. వీరు ప్రతిపనినీ పక్కవారి దృష్టిని ఆకర్షించడం కోసం చేస్తుంటారు. ప్రతిదానికీ పక్కవారి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటారు. ‘హిస్ట్రియానిక్’ అంటే లాటిన్లో ‘నటులకు సంబంధించిన’ అని అర్థం. వీరు కాస్త నాటకీయంగా ప్రవర్తిస్తుండటం వల్ల ఈ వ్యక్తిత్వ సమస్యకు ఆ పేరు వచ్చింది. తాము ఎవరినైనా ఆకర్షించగలమనీ, ఎవరినైనా తమ ప్రవర్తనతో ఆకట్టుకోగలమని భావిస్తారు. ఎప్పుడూ ఎక్సయిట్మెంట్ కోసం కోరుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏదైనా సాధించడానికీ లేదా ప్రమాదాల్లో కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. తమకు ఏదైనా దక్కకపోయినా లేదా తమను ఎవరైనా విమర్శించినా చాలా ఎక్కువగా కుంగిపోతారు. దాంతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తారు. ఈ గుణం వల్ల మరింత ఎక్కువగా సమస్యలపాలవుతారు. సమస్యల పాలయ్యామని మళ్లీ చెడుగా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తన విషయంలో ఈ విషవలయం ఇలా సాగుతూనే ఉంటుంది. 6 నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్: వీరు తమనూ, తమ ప్రాధాన్యాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ, తమను ఎల్లప్పుడూ అందరూ మెచ్చుకోవాలని భావిస్తారు. తమలోని గుణాలే ఎదుటివారిలోనూ ఉన్నాయంటూ ఎదుటివారిని మెచ్చుకుంటే వీరు భరించలేరు. ఉదాహరణకు వీరు బాగా నటిస్తారనుకుందాం. అప్పుడు ఏదో సందర్భంలో ఎదుటి నటుడిని మెచ్చుకుంటూ... అతడూ మీలాగే బాగా నటిస్తాడు అన్నా తట్టుకోలేరు. నాతో పోలికేమిటి అన్న భావన ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారిలో ఎదుటివారి పట్ల సహానుభూతి ఉండదు. తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని ఎంతగానైనా ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకు సిద్ధమవుతారు. అందుకే ఇలాంటి వారు ఎదుటివారికి సహనం లేనివారిగా, స్వార్థపరులుగా, ఎదుటివారి సమస్యల పట్ల స్పందించని వారిగా కనిపిస్తుంటారు. వీరిని కాస్త ఆటపట్టించినా లేదా సరదాగా ఛలోక్తులు విసిరినా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇలాంటి ప్రతిచర్యనే ‘నార్సిస్టిక్ రేజ్’ అంటారు. ఇది చాలా విధ్వంసపూరితమైన ప్రవర్తన. 7 అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు సామాజికంగా ఎలాంటి ప్రత్యేకతలు, నైపుణ్యాలు లేకుండా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాస లేమితో ఉంటారు. ఎప్పుడూ బిడియంగా కనిపిస్తూ తమ ఆత్మవిశ్వాస లేమి కారణంగా విమర్శలకు లోనవుతూ ఉంటారు. వీరితో మెలగడం ఎవరికైనా పెద్దగా ఆసక్తిగా ఉండదు. వీరిలో ఏదైనా ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ అంశం కారణంగా కలవాల్సిన వ్యక్తులను మినహాయించి, ఎవరినీ కలవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు ఎప్పుడూ యాంగై్జటీతో బాధపడుతుంటారు. నిజానికి చిన్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులూ తృణీకరించిన వారిలో ఈ తరహా వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది. దాంతో వీళ్లు కూడా సామాజికంగా అందరితోనూ కలవలేరు. ఇక్కడ కూడా తాము కలవలేకపోవడంతో దూరం జరగడం, దూరం జరగడం వల్ల ఇతరులతో కలవలేకపోవడం అనే ఒక విషవలయం కొనసాగుతూ ఉంటుంది. 8 డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా వ్యక్తిత్వ సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. వీరు ప్రతిదానికీ ఇతరుల మీదే ఆధారపడతారు. తమ తరఫున ఇతరులే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. తమను ఎదుటివారు తృణీకరిస్తారేమోనని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దాంతో ఎప్పుడూ సురక్షితమైన బంధాలను కొనసాగించడానికి చాలా తాపత్రయపడుతూ, కష్టపడుతూ ఉంటారు. తను ఏదైనా కీలకమైన విషయాన్ని డీల్ చేయాల్సి వచ్చేటప్పటికి పక్కవారి అధీనంలోకి వెళ్లిపోతారు. ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు తమకు అంతగా అనుభవం లేదంటూ ఒప్పుకుంటూ, తమ చేతకాదని చెప్పుకుంటూ, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎప్పుడూ తమను ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, తమను దోచుకోడానికి అవకాశమిస్తూ ఉంటారు. 9 ఎనాన్కాస్టిక్ (అబ్సెసివ్–కంపల్సివ్) పర్సనాలిటీ డిజార్డర్: ఇలాంటి పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నిబంధనల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ నిబంధన ప్రకారం ఇది తప్పు.. ఆ రూల్‌ను బట్టి ఇలా చేయకూడదు.. ఫలానా మార్గదర్శకాల ప్రకారం ఇది పూర్తిగా సరికాదు.. అంటూ ఎప్పుడూ చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. పనిలో పూర్తిస్థాయి సునిశితత్వం కోసం ఆత్రపడుతుంటారు. వీరి గుణం వల్ల చాలా పనులు సరిగా పూర్తికాకుండా పెండింగ్‌లో పడిపోతుంటాయి. వీరి కారణంగా పనులు ఒక పట్టాన జరగకపోవడంతో అందరూ వీరి నుంచి దూరంగా ఉంటారు. ఇలాంటి ఎనాన్కాస్టిక్ పర్సనాలిటీ ఉన్నవారు ఎప్పుడూ ప్రతిదాన్నీ సందేహిస్తూ, అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కఠినంగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయంలోనూ మితిమీరిన స్వీయనియంత్రణతో ఉంటారు. హాస్యపూరితమైన ధోరణి, నవ్వుతూ ఉండటం వంటి గుణాలే ఉండవు. ఏమాత్రం లోపం జరిగినా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. అందుకే సహోద్యోగులు, తోటిపనివారు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో సంబంధాలు నెరపడం లేదా ఇలాంటివారితో మిగతావారు సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమవుతుంటుంది. చక్కదిద్దడం ఎలా : ఒక మానసిక వ్యాధికీ, ప్రవర్తనపూర్వకమైన సమస్యలకు చాలా తేడా ఉంది. అలాగే సాధారణ ప్రజల వ్యవహారాలకు, ఈ తరహా వ్యక్తిత్వ లోపాలకు మధ్య తేడా కనుగొనడం కూడా చాలా సంక్లిష్టమైన వ్యవహారమే. అందుకే ఇలాంటి లోపాలను కనుగొనడానికి సైకియాట్రిస్టులు ఎంతో నైపుణ్యంతో, సునిశితత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వారి ప్రవర్తన కారణంగా సామాజిక సమస్యలు వచ్చే తీరుతెన్నులను గుర్తించడంతో పాటు చాలా నేర్పుగా ఈ విషయాలను డిజార్డర్‌తో బాధపడేవారికి తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ దిశగా వారిని చక్కదిద్దే ప్రయత్నంలో కౌన్సెలింగ్‌తో పాటు, పర్సనాలిటీ డెవలప్ ట్రైయినింగ్ కార్యకలాపాలు బాగా దోహదపడతాయి. వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుందంటే? ఒకరి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం జన్యువులు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధానభూమిక వహించినప్పటికీ అవే పూర్తిగా వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. ఎందుకంటే.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో వేర్వేరు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. అందుకే జన్యువులతో పాటు వారు పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఏవైనా అఘాయిత్యాలకు గురికావడం, కొన్ని అంశాల పట్ల అతిగా స్పందించడం (హైపర్ రియాక్టివిటీ), చుట్టుపక్కలవారి స్నేహాలు (పియర్), బలమైన వ్యక్తిత్వం గల ఇతరులతో ప్రభావితం కావడం... ఇలాంటి ఎన్నో అంశాలు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అందరు వ్యక్తులు సమాజంతో వ్యవహరించాలి. సమాజం అంటే వేరే ఏమిటో కాదు... ఎదుట ఉన్న వ్యక్తులే. ఒకరు ఒక సమూహంతో ఒకలాగా మరో సమూహంతో ఒకలాగా వ్యవహరించవచ్చు. ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించే యజమాని ఇంటి సభ్యులతో ప్రేమగా ఉండవచ్చు. ఇంటి సభ్యులతో కఠినంగా ఉండే వ్యక్తి స్నేహితులతో ఆప్యాయంగా ఉండొచ్చు. కొందరి ప్రవర్తన వ్యక్తికీ వ్యక్తికీ మారుతుండవచ్చు. ఇవి సాధారణ స్థాయిలో ఉంటే సరేగానీ శృతి మించి అవి సమాజానికి చెరపు చేస్తున్నప్పుడు... మనస్తత్వశాస్త్రం వాటిని వ్యక్తిత్వానికి సంబంధించిన రుగ్మతలుగా పేర్కొంటుంది. వాటినే ఇంగ్లిష్‌లో పర్సనాలిటీ డిజార్డర్స్‌గా చెప్పవచ్చు. -
మీ వ్యక్తిత్వంలో పరిణతి ఉందా..?
ఎంతకాలం గడిచినా కొంతమంది మానసికంగా పరిణతి సాధించలేరు. అంతా బాగానే ఉన్నా, కొందరికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో, తోటివారితో ఎలా నడుచుకోవాలో తెలియదు. అందరిలో పెద్దగా అరవటం, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, అభాసుపాలవటం మొదలైన లక్షణాలు పరిణతిలేని వారిలో కనిపిస్తుంటాయి. మెచ్యూరిటీ అందరిలో ఒకే సమయంలో ఒకే రకంగా జరగకపోవచ్చు. ఇది నిర్ణయాలు తీసుకొనే శక్తి, ప్రజ్ఞ, స్పృహ, వయసు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది లేదని బాధపడి న్యూనతకు గురయ్యేకన్నా పరిణతి ఎలా సాధించవచ్చో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం మంచిది. మీరు మెచ్యూర్డ్ పర్సన్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ క్విజ్ పూర్తిచేయండి. 1. ఎవరినీ అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. మీరనుకన్నది జరగకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. కాదు బి. అవును 2. మీ బలాలు బలహీనతనలు గుర్తించగలరు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీ సహనాన్ని కోల్పోరు. ఎ. అవును బి. కాదు 3. ఎవరైతే నాకేంటి, ఇతరులను నేనెందుకు లెక్క చేయాలి? అనే అహంభావం మీలో ఉంటుంది. ఎ. కాదు బి. అవును 4. ఎలాంటి విషయాన్నైనా రిసీవ్ చేసుకోగలరు. అందరి మర్యాదలు మీకు లభిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 5. ఎలాంటి పరిస్థితుల్లోనూ నైతిక విలువలను మరచిపోరు. అబద్ధం, దొంగతనం, మోసం మొదలైనవాటికి దూరంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 6. చేసిన పొరపాట్లను వెంటనే ఒప్పుకోరు. ఇతరులకు మీ వల్ల అసౌకర్యం కలిగితే క్షమాపణలు అడగటం మీకిష్టం ఉండదు. ఎ. కాదు బి. అవును 7. జాగ్రత్తగా, హుందాగా ఉండాల్సిన సమయాల్లో ఎలా ఉండాలో, సరదాగా ఉండాల్సినప్పుడు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. మీ కష్టాలకు ఇతరులను కారకులుగా భావిస్తారు. వారివల్లే మీకు నష్టం జరిగిందని చెప్తుంటారు. ఎ. కాదు బి. అవును 9. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కించపరచుకోరు. ఆత్మ గౌరవం మీకుంటుంది. ఎ. అవును బి. కాదు 10. బాధ్యతాయుతంగా ఉంటారు. మీరు నిర్వర్తించవలసిన పనులను ఎప్పటికీ మరచిపోరు. విశాలదృక్పథంతో ఉంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు నాలుగు దాటితే మీలో పరిణతి పూర్తి స్థాయిలో ఉండదని అర్థం. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు మెచ్యూర్డ్ పర్సన్. చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే జీవితంలో మీరింకా పరిణతి సాధించలేదనే చెప్పాలి. దీనివల్ల ఎక్కడకు వెళ్లినా మీకు ఇబ్బందులు తప్పవు. డోన్ట్ వర్రీ పరిణతి అందరిలో ఒకేరకంగా ఉండదు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. అనుభవాలను సోపానాలుగా చేసుకోండి. చేసిన పొరపాట్లను మళ్లీ చే యకుండా ఉండండి. ‘ఎ’ లను సూచనలుగా తీసుకోండి. -
శాస్త్రాన్ని ఆచరించకపోయినా వందనీయుడే!
ఆచార్య దేవోభవ పండిపోవడం అని ఒక మాట ఉంది. పంట పండిందంటాం. ఆయన జీవితంలో పండిపోయాడండీ అంటారు. పండు విషయంలో పండడం అంటే రంగుమారి లోపల గట్టిగా ఉన్న పదార్థం మెత్తబడి పులుపు, తీపి, వగరు రుచులుగా మారుతూ దానంతట అది తొడిమను వదిలి కింద పడిపోవడం. ఇక పరిణతి చెందిన వ్యక్తి సంగతికొస్తే... సాధన చేయగా చేయగా ‘నేను అంటే ఈ శరీరం కాదు, ఆత్మను’ అని తెలుసుకుని, దానిని వదిలిపెట్టడానికి సిద్ధం కావడం. ‘పండుట’ అన్న మాట వెనుక అంత సంస్కారం ఉంది. తాను ఆత్మగా నిలబడ గలిగినా పదిమందికి ఆదర్శంగా ఉండడం కోసమని కొంతమంది పెద్దలు కిందకు దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు. అలా చూపించినవాడు పట్టుకోవడానికి, అనుకరించడానికి మీకు చాలా తేలికగా దొరుకుతాడు. ఆయనలా బతకాలని మనకు తెలుస్తుంది. ఆయన అలా బతుకుతాడు కాబట్టి మనకు మనం ఎలా బతకాలో ఆయన చెప్పినదంతా సత్యమని తెలుసుకునేటట్లు చేస్తాడు. ఆయన–ఆచార్యుడు. గురువులందరిలోకి శ్రేష్ఠుడు. అంటే మిగిలిన వాళ్ళు తక్కువని కాదు. వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ‘ఆచార్య’ అన్నపదం ఉన్న వాళ్ళు ఎక్కువ అని, లేనివాళ్ళు తక్కువని సిద్ధాంతం చేయడం లేదు. రామకృష్ణ పరమహంసను ఒకసారి శిష్యులు కలకత్తా వీథులగుండా పల్లకిలో తీసుకెడుతున్నారు. సాయంకాలం వేశ్యలు విటుల కోసం బయటకొచ్చి నిలబడ్డారు. రామకృష్ణులవారు పల్లకిలోంచి తెరతీసి చూస్తే వేశ్యలు కనబడ్డారు. అమాంతం పల్లకిలోంచి దూకి పరుగెత్తికెళ్ళి ఒక వేశ్యను గట్టిగా పట్టుకుని కాళ్ళదగ్గర తలపెట్టేసి కళ్ళవెంట నీళ్ళు ఉబికి వస్తుండగా ఉద్వేగంతో మాట్లాడుతున్నారు. గబాగబా శిష్యులు వెళ్ళి ఆయనను తీసుకొచ్చి పల్లకీ ఎక్కించి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ‘అయ్యా! మీకు తగినపనేనా ఇది! ఏమిటండీ ఈ అచేష్ఠితం!’ అన్నారు. దానికి ఆయన ‘‘వాళ్ళు వేశ్యలా? నాకు కాళికామాతలా కనబడ్డారే’’ అన్నారు. పండిపోవడమంటే అదీ. అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస. తెల్లవారి లేచి ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తూ చెప్పే మంత్రాల్లో ’నమఃచోరాయచ’ అని ఒక మంత్రం చెబుతుంటాం. ఇది యజుర్వేద మంత్రం. దానర్థం ‘అయ్యా, దొంగ మీరే. ఓ దొంగ గారూ, మీకు నమస్కారం’ అని. శివుడిని దొంగ అని పిలవడమేమిటి ! నా వాచీ పక్కనబెడితే ఎవడో పట్టుకెడుతున్నాడు. దొంగ, దొంగ అని అరిస్తే నేను సామాన్యుణ్ణి. అలా కాదు. ‘‘ఇంతకుముందు నాకు వాచీ ఇచ్చినవాడు ఒకడున్నాడు. ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడెవడో ఉన్నాడు. అది వాడికి ఇవ్వడానికి పట్టుకుపోయాడు. అయితే నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగగా కనబడ్డాడు. పరమేశ్వరుడు దొంగరూపంలో వచ్చి ఇక్కడ నిలబడి దానిని తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ నిల్చున్న భూమికి నమస్కరించి అక్షింతలు వేసి నమస్కరిస్తే... నేను జ్ఞానిని. జ్ఞానమన్న మాటకు అర్థం అదీ. ఆయన జ్ఞాని. ఆయన గురువు. అటువంటి గురువు ఆచార్య అని బిరుదు లేకపోయినా, శాస్త్రాన్ని ఆచరించకపోయినా వందనీయుడే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శ్రద్ధగా వినాలి... ఆదరంగా మాట్లాడాలి!
ఆత్మీయం మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో సంభాషిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నా... అవతలివారు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్న విషయం మీద అత్యంత జాగరూకతతో ఆలోచన చేయాలి. అలాగే మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కమాట పొల్లుపోకూడదు. కొంతమందికి కొన్ని ప్రమాదకరమైన ఊతపదాలు అపయత్నంగా దొర్లుతుంటాయి. వాటి విషయంలో జాగత్తగా ఉండాలి. జీవితంలో వృద్ధిలోకి రావడానికి మొట్టమొదట అలవరచుకోవలసింది ఈ నైపుణ్యాలనే. ఒకవేళ అవి లేకపోతే భేషజాలకు పోకుండా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండొచ్చన్న అంశం మీద ఎక్కువ శ్రద్ధచూపే బదులు... ‘సరే! ఈ తప్పు జరిగింది, వెంటనే దీన్ని ఎలా సరిదిద్దవచ్చు, సాధ్యమైనంతగా దీన్ని మనం ఎలా సఫలీకృతం చేయవచ్చు’ అన్న దాని మీద దృష్టి పెట్టాలి. విమర్శించడానికి, రాళ్ళు వేయడానికి గుంపులో ఒకడిగా నిలబడడం గొప్పకాదు. ఒకరు చేసిన పొరబాటును వేరొకరు దిద్దడం విశాల హృదయానికి సంకేతం. అదేవిధంగా ఏదైనా ఒక విషయంలో అవతలివారు నోరు విప్పకముందే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటాం. అలా వచ్చేసిన తరవాత ఎదుటివాడు చెప్పేది వినడానికి మనసు అంగీకరించదు, కాబట్టి మనం వినం. అది ప్రతిఘటనకు దారితీస్తుంది. దాంతో వినే ఓపిక నశించిపోయి అవతలివారి మీద కోప్పడతాం. అది మంచి లక్షణం కాదు. -
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ట్రిపుల్ ఐటీ ఉపకులపతి సత్యనారాయణ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ బాసర : ఎన్ఎస్ఎస్ వలంటీర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ఎంఎస్ఎన్ రెడ్డి అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘యూనివర్సిటీ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్’ శిక్షణ కార్యక్రమాన్ని ట్రిపుల్ఐటీ ఉపకులపతి ఎస్.సత్యనారాయణ సూచన మేరకు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరై విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ పుట్టుక, పనితీరు, విద్యా సంస్థలు, ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లను ఏ విధంగా నిర్వహించాలో వివరించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నైపుణ్యాన్ని సాధించే విధానాన్ని తెలిపారు. భాషా, వత్తి, జీవన విధానం, సాంకేతిక పరమైన నైపుణ్యాలు, మెళకువలు పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డి.శ్యాంబాబు మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు నైపుణ్య అభివద్ధిపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిచే సందేశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, అనిత, నరేష్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.