శాస్త్రాన్ని ఆచరించకపోయినా వందనీయుడే!
ఆచార్య దేవోభవ
పండిపోవడం అని ఒక మాట ఉంది. పంట పండిందంటాం. ఆయన జీవితంలో పండిపోయాడండీ అంటారు. పండు విషయంలో పండడం అంటే రంగుమారి లోపల గట్టిగా ఉన్న పదార్థం మెత్తబడి పులుపు, తీపి, వగరు రుచులుగా మారుతూ దానంతట అది తొడిమను వదిలి కింద పడిపోవడం. ఇక పరిణతి చెందిన వ్యక్తి సంగతికొస్తే... సాధన చేయగా చేయగా ‘నేను అంటే ఈ శరీరం కాదు, ఆత్మను’ అని తెలుసుకుని, దానిని వదిలిపెట్టడానికి సిద్ధం కావడం. ‘పండుట’ అన్న మాట వెనుక అంత సంస్కారం ఉంది.
తాను ఆత్మగా నిలబడ గలిగినా పదిమందికి ఆదర్శంగా ఉండడం కోసమని కొంతమంది పెద్దలు కిందకు దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు. అలా చూపించినవాడు పట్టుకోవడానికి, అనుకరించడానికి మీకు చాలా తేలికగా దొరుకుతాడు. ఆయనలా బతకాలని మనకు తెలుస్తుంది. ఆయన అలా బతుకుతాడు కాబట్టి మనకు మనం ఎలా బతకాలో ఆయన చెప్పినదంతా సత్యమని తెలుసుకునేటట్లు చేస్తాడు. ఆయన–ఆచార్యుడు. గురువులందరిలోకి శ్రేష్ఠుడు. అంటే మిగిలిన వాళ్ళు తక్కువని కాదు. వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ‘ఆచార్య’ అన్నపదం ఉన్న వాళ్ళు ఎక్కువ అని, లేనివాళ్ళు తక్కువని సిద్ధాంతం చేయడం లేదు.
రామకృష్ణ పరమహంసను ఒకసారి శిష్యులు కలకత్తా వీథులగుండా పల్లకిలో తీసుకెడుతున్నారు. సాయంకాలం వేశ్యలు విటుల కోసం బయటకొచ్చి నిలబడ్డారు. రామకృష్ణులవారు పల్లకిలోంచి తెరతీసి చూస్తే వేశ్యలు కనబడ్డారు. అమాంతం పల్లకిలోంచి దూకి పరుగెత్తికెళ్ళి ఒక వేశ్యను గట్టిగా పట్టుకుని కాళ్ళదగ్గర తలపెట్టేసి కళ్ళవెంట నీళ్ళు ఉబికి వస్తుండగా ఉద్వేగంతో మాట్లాడుతున్నారు. గబాగబా శిష్యులు వెళ్ళి ఆయనను తీసుకొచ్చి పల్లకీ ఎక్కించి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ‘అయ్యా! మీకు తగినపనేనా ఇది! ఏమిటండీ ఈ అచేష్ఠితం!’ అన్నారు. దానికి ఆయన ‘‘వాళ్ళు వేశ్యలా? నాకు కాళికామాతలా కనబడ్డారే’’ అన్నారు. పండిపోవడమంటే అదీ. అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస. తెల్లవారి లేచి ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తూ చెప్పే మంత్రాల్లో ’నమఃచోరాయచ’ అని ఒక మంత్రం చెబుతుంటాం. ఇది యజుర్వేద మంత్రం. దానర్థం ‘అయ్యా, దొంగ మీరే. ఓ దొంగ గారూ, మీకు నమస్కారం’ అని. శివుడిని దొంగ అని పిలవడమేమిటి !
నా వాచీ పక్కనబెడితే ఎవడో పట్టుకెడుతున్నాడు. దొంగ, దొంగ అని అరిస్తే నేను సామాన్యుణ్ణి. అలా కాదు. ‘‘ఇంతకుముందు నాకు వాచీ ఇచ్చినవాడు ఒకడున్నాడు. ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడెవడో ఉన్నాడు. అది వాడికి ఇవ్వడానికి పట్టుకుపోయాడు. అయితే నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగగా కనబడ్డాడు. పరమేశ్వరుడు దొంగరూపంలో వచ్చి ఇక్కడ నిలబడి దానిని తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ నిల్చున్న భూమికి నమస్కరించి అక్షింతలు వేసి నమస్కరిస్తే... నేను జ్ఞానిని. జ్ఞానమన్న మాటకు అర్థం అదీ. ఆయన జ్ఞాని. ఆయన గురువు. అటువంటి గురువు ఆచార్య అని బిరుదు లేకపోయినా, శాస్త్రాన్ని ఆచరించకపోయినా వందనీయుడే.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు