
ముఖాన్ని చూడకు.. గొంతు విను
సినిమా / ఫేస్ ఆఫ్
గిరగిరా తిరుగుతున్న రంగుల రాట్నం. అక్కడే కొడుకు మైఖేల్‌ను ఆడిస్తున్నాడు ప్రముఖ ఎఫ్‌బీఐ ఏజెంట్ సీన్ ఆర్చర్ (జాన్ ట్రవోల్టా). ఇద్దరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇంతలో సడన్‌గా ఓ బుల్లెట్ ఆర్చర్ వీపులోకి దూసుకెళ్లింది. ఆర్చర్‌తో పాటు మైఖేల్ కూడా కింద పడ్డాడు. తలకు గాయమవడంతో ఆ పిల్లాడు చనిపోయాడు. కట్ చేస్తే, ఆ బుల్లెట్ దింపింది మోస్ట్ వాంటెడ్ టైస్ట్ కాస్టర్ ట్రాయ్ (నికోలాస్ కేజ్). ఆర్చర్‌ను చంపుదామనుకున్నాడు. కానీ అతను చావలేదు గానీ కొడుకు మాత్రం చనిపోయాడు. ఇంతలో ఆరేళ్లు గడిచిపోయాయి. తన కొడుకు చావుకు కారణమైన క్యాస్టర్ కోసం ఈ ఆరేళ్లూ ప్రపంచమంతా జల్లెడ పడుతూనే ఉన్నాడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. కానీ దొరకలేదు. సిటీలోని ఓ ఆడిటోరియంలోకి క్యాస్టర్ ట్రాయ్(నికోలాస్ కేజ్) ఓ పాస్టర్ వేషంలో ఎంటరై, ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లి పెద్ద పెద్ద సూట్‌కేసుల్లో బాంబ్ ప్లాంట్ చేశాడు. ఓ పది రోజుల కౌంట్ డౌన్. క్యాస్టర్ సిటీలోకి వచ్చాడని ఆర్చర్ (జాన్ ట్రవోల్టా)కు ఇన్‌ఫర్మేషన్. వెంటనే తన సిబ్బందిని అలర్ట్ చేశాడు.
విమాన ంలో క్యాస్టర్ తన తమ్ముడితో కలిసి ఇంకొంచెం సేపటిలో లాస్ ఏంజెల్స్‌ను వదలి ఎగిరిపోవాలి. రన్‌వే నుంచి విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. సడన్‌గా విమానానికి ఎదురుగా రన్‌వే మీద కారులో ఆర్చర్! మొత్తానికి ఆర్చర్ తన ప్రయత్నంతో క్యాస్టర్ ఉన్న విమానాన్ని ఎగరకుండా చేస్తాడు. ఓ పదినిమిషాల ఫైట్‌లో కొంత మంది ఎఫ్‌బీఐ అధికారులు, టైస్టుల ప్రాణాలు గాల్లో కలిశాక క్యాస్టర్ పట్టుబడతాడు. అయితే కోమాలోకి వెళిపోతాడు. అతని తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. అంతా బాగానే ఉంది కేసు క్లోజ్ చేసేసిన ఆర్చర్‌కు ఓ షాకింగ్ న్యూస్. క్యాస్టర్ ప్లాంట్ చేసిన బాంబ్ గురించి తెలుస్తుంది. కానీ ఎక్కడో ఏమిటో తెలీదు. ఆర్చర్ కోమాలో. అతని తమ్ముడు జైల్లో. ఆర్చర్ లేచి చెప్పలేడు. అతని తమ్ముడు అవసరమైతే చచ్చిపోతాడు గానీ నోరు మాత్రం విప్పడు. కానీ క్యాస్టర్ సీక్రెట్స్ తెలిసిన వ్యక్తి ఇతనే. ఇంతలో తన పై అధికారి ఐడియా చెప్పింది. కానీ రిస్కే. ఏ మాత్రం తేడా వచ్చినా అతని జీవితం గల్లంతే. మొదట్లో ఒప్పుకోలేదు. కానీ క్యాస్టర్ గురించి పూర్తిగా తెలిసిన అతనే ఇది చేయడానికి కరెక్టేనని పై ఆధికారి కన్విన్స్ చేయడంతో సరేనన్నాడు ఆర్చర్. అదే ఫేస్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అంటే కోమాలో ఉన్న క్యాస్టర్ ముఖాన్ని తీసి ఆర్చర్‌కు పెట్టి సర్జరీ చేయాలి. ఈ రహస్యం తెలిసింది ఆ డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరికే. ఒకరు అతని పై అధికారి, ఇంకొకతను ఆర్చర్ సహోద్యోగి. ఆపరేషన్ సక్సెస్. ఇక నుంచి ఆర్చర్ (జాన్ ట్రవోల్టా)కి కొత్త రూపం. ప్రపంచానికి అతను క్యాస్టర్ ట్రాయ్ (నికోలాస్ కేజ్). క్యాస్టర్ తమ్ముడున్న జైల్లోకి ఆర్చర్‌ను పంపించారు. బాంబ్ విషయం రాబట్టాలి అదీ ప్లాన్. మొత్తానికి సక్సెస్ అయ్యాడు ఆర్చర్ . ఈ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. జైలుకి తనను కలవడానికి వచ్చిన వ్యక్తిని చూసి షాకయ్యాడు. అతను తన ముఖంతో ఉన్న క్యాస్టర్ ట్రాయ్(జాన్ ట్రవోల్టా)ను చూసి షాక్ అయ్యాడు. ఇంతలో కోమా నుంచి సడన్‌గా లేచిన క్యాస్టర్ ట్రాయ్(నికోలాస్ కేజ్) తన ముఖానికి జరిగిన సర్జరీని ఆ హాస్పిటల్లోని వీడియోలో చూశాడు. ఆ డాక్టర్‌ను బెదిరించి ఆర్చర్(జాన్ ట్రవోల్టా) ముఖాన్ని తనకు ప్లాంట్ చేయించుకున్నాడు. ఈ సర్జరీ విషయం తెలిసిన అందరినీ చంపేశాడు క్యాస్టర్. ఇక నుంచి పోలీసు ముసుగలో టైస్టు. ఆ ఉగ్రవాది ముసుగులో పోలీసాఫీసర్. సీన్ రివర్స్ అయింది. ఆర్చర్ ముసుగులో ఉన్న క్యాస్టర్ తన అధికారాన్ని ఉపయోగించి జైల్లో ఉన్న తన తమ్ముడిని విడిపించాడు. టైస్టుగా చేసే పనులు, ఎఫ్‌బీఐ అధికారి ఆర్చర్‌గా చేసే చాన్స్. ఎవరికీ ఏ మాత్రం సందేహం రాదు.
బాంబ్‌ను కూడా తానే డిస్కనెక్ట్ చేసి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు క్యాస్టర్. ఆర్చర్ మాత్రం జైలు నుంచి తప్పించుకుని తన పాత జీవితాన్ని వెనక్కి తీసుకోవడానికి యుద్ధం ప్రారంభిస్తాడు. క్యాస్టర్‌గా ఆర్చర్ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మరో వైపు ఆర్చర్ లా క్యాస్టర్ జీవించడం స్టార్ట్ చేశాడు. ఇద్దరి జీవితాలు మారిపోయాయి. అంటే హీరో...విలన్‌గా, విలన్ హీరోగా మారిపోయారు. కానీ స్వభావాలు మారవు కదా! క్యాస్టర్ కు అబ్బాయి ఉన్నాడని తెలుస్తుంది. ఇంతలో ఆర్చర్‌ను చంపడానికి వేసిన కుట్రలో క్యాస్టర్ తమ్ముడు చనిపోతాడు. అందుకే ఇక ఆర్చర్‌ను చంపాలన్న కసితో ఉంటాడు కాస్టర్. ఈ బాధ, కోపంలోనే తన మీద అరిచిన ఓ అధికారిని చంపేశాడు కూడా. తన కుటుంబాన్ని చూడాలన్న ఆశతో ఇంటికి వెళతాడు ఆర్చర్. ఆర్చర్‌ను చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. భార్య అతన్ని గుర్తుపట్టదు. ‘‘నా ముఖాన్ని చూడకు... నా గొంతు విను. దాన్ని అర్థం చేసుకో’’ అంటూ అసలు విషయం చెబుతాడు. ఇది నిజమా ? కాదా? అని క్యాస్టర్ బ్లడ్‌ను టెస్ట్ చేస్తుంది ఆర్చర్ భార్య. నిజం ఆమెకూ అర్థమవుతుంది. తన చేతిలోనే చనిపోయిన అంత్యక్రియలకు క్యాస్టర్ వెళ్తాడు. అక్కడే ఆర్చర్, క్యాస్టర్ తలపడతారు. చివరికి క్యాస్టర్ చనిపోవడంతో ఆర్చర్‌కి తన పాత రూపం తిరిగివస్తుంది. క్యాస్టర్ కొడుకు ఆడమ్‌ను ఆర్చర్ దత్తత తీసుకోవడంతో సినిమా ముగుస్తుంది. - బి. శశాంక్
ఫేస్ ఆఫ్... ఇలా మొదలైంది!
తొంభైలలో ఫిల్మ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో మైక్ వెర్బ్, మైఖేల్ కొలెరీ అనే స్క్రీన్ రైటర్స్ రాసిన సైన్స్ ఫిక్షన్ స్టోరీ ‘ఫేస్ ఆఫ్’. అప్పట్లో హాలీవుడ్‌ను ఏలుతున్న ఆర్నాల్డ్, స్టాలోన్ లు ఇందులో హీరో, విలన్. పారామౌంట్ పిక్చర్స్ సంస్థ వీరి స్క్రిప్ట్‌ను ఓకే చేసింది. వీరి స్క్రిప్ట్ ఓకే కావడానికి ఏడేళ్లు పట్టింది. దర్శకునిగా రోబర్ట్ కొహెన్ ఫిక్స్. కానీ,షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మళ్లీ ఈ సినిమా భవిష్యత్తు డైలమాలో పడింది. దర్శకునిగా జాన్ వూని లాక్ చేసిందా సంస్థ. స్క్రిప్ట్ అంతా విన్న జాన్ వూ మళ్లీ దాంట్లో మార్పులు సూచించాడు. భవిష్యత్తులో జరిగే సైన్స్ ఫిక్షన్ అంటే సినిమాలో భావోద్వేగాలకు చోటు ఉండదని, ట్రెండ్‌కు తగ్గట్టు మార్చమన్నాడు జాన్ వూ. ఆర్నాల్డ్, స్టాలోన్‌లు అప్పుడు తమ సినిమాలతో బిజీ బిజీ. దాంతో హీరోగా జాన్ ట్రవోల్టా, విలన్‌గా నికోలాస్ కేజ్‌ను అనుకున్నాడు జాన్. అప్పటికే హీరోగా నికోలాస్, విలన్‌గా జాన్ ట్రవోల్టా మంచి స్వింగ్ మీద ఉన్నారు. నికోలాస్ మొదట విలన్ అనగానే చేయనన్నాడు. కానీ ఈ స్క్రిప్ట్ పూర్తిగా విన్నాక మాత్రం ఓకే అన్నాడు. ఈ కథలో ఉన్న గొప్పదనం ఏంటంటే, సినిమా ప్రథమార్థంలోనే హీరో విలన్‌గా, విలన్ హీరోగా మారిపోతారు. అదే ఈ స్క్రిప్ట్‌లో కిక్ ఇచ్చే అంశం. అదే ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ను చేసింది!