
ఒక బాలుడు నది సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆ ఇసుక ప్రదేశంలో పొడవాటి గెడ్డం ఉన్న ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. బాలుడు ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. వెళ్లేటప్పటికి, వృద్ధుడు ఇసుకలో ఒక పెద్ద వలయాన్ని గీస్తూ కనిపించాడు. బాలుడు ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద వలయాన్ని వంకర్లు లేకుండా, చక్కగా, గుండ్రంగా భలే గీశాడు వృద్ధుడు. ‘‘ఓ పెద్దాయనా.. ఇంత చక్కగా ఎలా గీశావు’’ అని బుగ్గ మీద వేలు పెట్టుకుని అడిగాడు బాలుడు. వృద్ధుడు బాలుడి వైపు చూశాడు. ‘‘ఎలా గీశానో నాకూ తెలీదు. గీస్తూ, గీస్తూ, గీస్తే ఉంటే చివరికి ఇలా వచ్చింది’’ అని చెప్పాడు. ‘నువ్వూ గియ్యొచ్చు.. ఇంత చక్కగా’’ అని చెప్పి, చేతిలోని కర్రపుల్లను ఆ బాలుడికి ఇచ్చి వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బాలుడు ఆ కర్రపుల్లతో ఇసుకలో వలయం గియ్యడం మొదలుపెట్టాడు. వంకర టింకరగా వచ్చింది. మళ్లీ గీశాడు. మళ్లీ అంతే. అలా గీస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు గీసినా వృద్ధుడు గీసినంత కచ్చితంగా వృత్తాకారం రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఓ రోజు ఉదయం నదికి వచ్చి ఎప్పటిలా వృత్తం గీశాడు. సరిగ్గా వచ్చింది! ఎక్కడా వంకర లేదు. వంపు లేదు. ఎక్కువ తక్కువ లేదు. అప్పుడే వెనుక నుంచి ఓ గొంతు వినిపించింది. ‘‘ఓ పెద్దాయనా! ఇంత కచ్చితంగా వలయాన్ని ఎలా గీశావు?’’ అని. మానవ సృష్టిలో కొన్ని అద్భుతాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏళ్ల సాధనతో సాధ్యం అయినవే. అదేవిధంగా, దీర్ఘకాల సాధన అనేది.. ఏమీ తెలియని మనిషిని కూడా నిష్ణాతుడిని చేస్తుంది. కొత్త తరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అనుకరణకు ప్రేరేపిస్తుంది. ఇదొక సాధన వలయం.
Comments
Please login to add a commentAdd a comment