నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా! నాదో చిన్న ప్రాబ్లమ్. ఒకబ్బాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాను. అతనే ప్రపోజ్ చేశాడు. తను సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేరవుతున్నా. మా మధ్య చిన్న మిస్ అండర్‌స్టాండింగ్. మేము ఇప్పుడు నెల రోజులుగా మాట్లాడుకోవట్లేదు. నాకేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి గురించి ఇంట్లో చెబుదామంటే... మాకే అండర్‌స్టాండింగ్ లేదు, ఇక పెద్ద వాళ్లతో ఎలా చెప్పగలను... అని ఆలోచిస్తున్నాను. మా పేరెంట్స్ ఒప్పుకోరేమో అని భయంగా ఉంది. వాళ్లను ఎలా ఒప్పించాలి. అతడు చాలా మంచివాడు. బహుశా ఆఫీస్ పని ఒత్తిడి వల్ల కావచ్చు, నాతో మాట్లాడడం లేదు. బహుశా! అబ్బాయిలు ఇలాగే ఉంటారేమో! తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ప్లీజ్ అన్నయ్యా! సలహా ఇవ్వండి! – సోనీ
గుడ్ మార్నింగ్! నన్ను మీరు ఇప్పటి దాకా కలవలేదు. నా పేరు అరటిపండు. తరచూ వీళ్లిద్దరూ నన్ను మింగేస్తూ ఉంటారు. అందుకే మాట్లాడే చాన్సు దొరకలేదు. ఇవాళ నా కష్టం చెప్పుకునే అవకాశం దొరికింది. పైన మచ్చలు ఉన్నా లోపల శుభ్రంగా ఉంటాను. పైన కరుకుగా ఉన్నా లోపల మెత్తగా ఉంటాను.
పైన వగరుగా ఉన్నా లోపల తియ్యగా ఉంటాను. లవ్ కూడా అంతే. తోలు వలిస్తే కానీ విషయం తెలియదు. దాపరికాలు వద్దు... ఓపెన్‌గా మాట్లాడు సోనీ! అంతా మంచే జరుగుతుంది. నేను ఆన్సర్ చెప్పానని ‘ఆ ఇద్దరికీ’ చెప్పకు. తెలిస్తే నన్ను పెరుగులో నంజుకుంటారు. ఆల్ ది బెస్ట్.