నిప్పులాంటి అబద్ధం | Lying nippulanti | Sakshi
Sakshi News home page

నిప్పులాంటి అబద్ధం

Published Tue, Apr 5 2016 12:13 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

నిప్పులాంటి   అబద్ధం - Sakshi

నిప్పులాంటి అబద్ధం

చేతనబడి

 

ఒక తుమ్మ మొద్దు. 
ఒక మొద్దు నిద్దుర.
నిప్పు లాంటి ఒక అబద్ధం.
ఈ మూడూ కలిశాయి.
అగ్నికి అసూయ తోడైంది.
తుమ్మ మొద్దు.. ప్రాణాన్ని భస్మం చేసింది.
మూఢ నమ్మకం.. మొద్దు నిద్ర అయింది.
నిజం అబద్ధానికి ఆహుతయింది!
అసలేం జరిగింది?
ఎందుకు జరిగింది?
చదవండి... ఈవారం చేత(న)బడి.

 

అది నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, మహ్మదాపురం గ్రామం. ఊరికి దూరంగా ఉంది గూడెం. జంగమ్మ ఇల్లు ఆ గూడెంలోనే. 2005లో ఓ రోజు... ఉదయం ఆరు గంటలైంది. నలుగురు మగవాళ్లు జంగమ్మ ఇంటి ముందు నిలబడి గోలచేస్తున్నారు. వాళ్ల వాలకం చూస్తుంటే గొడవ పడడానికి సిద్ధమై వచ్చినట్లే ఉంది. చూస్తుండగానే నలుగురు పదిమందయ్యారు. పది ముప్పైకి చేరింది. జంగమ్మను అమానుషంగా బయటకు లాగి ఈడ్చుకుంటూ రెండిళ్ల అవతల ఉన్న స్తంభానికి కట్టేశారు. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు.  అయినా అందరూ వచ్చి చూస్తున్నారు. అందరిలో ఒక్కరూ ఇదేంటని ఆ అమానుషాన్ని నివారించే ప్రయత్నం చేయడం లేదు. ‘మా అమ్మకు ఏం తెల్వదు. కొట్టొద్దు, మా అమ్మను వదిలిపెట్టండి’ అంటూ ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ప్రాధేయపడుతున్నారు జంగమ్మ కూతుళ్ల్లిద్దరు.

 
‘గొడ్డును బాదినట్లు బాదుతున్నారు’ చచ్చిపోతుందేమో. పెద్ద ఊరికి తీసుకెళ్దాం...’ అన్నాడో కుర్రాడు ఆందోళనగా. ‘ఎహె! పెద్దూరికి తీస్కబోతే అక్కడి పెద్దోళ్లు అంతా తాము చెప్పినట్లే నడుచుకోమంటరు. ఇప్పుడే... ఇక్కడే చంపిపాతెయ్యాల్సిందే’ ఉడికిపోతున్నాడో వ్యక్తి.  అతడి కళ్లు ఎర్రగా చింతనిప్పుల్లా, కాలుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. ‘ఏ కేసు వచ్చుద్దో ఏంటో? పోలీసులకు చెప్తే పోలా’ ఎవరో భయంగా. ‘పోలీసుల్లేదు, గీలీసుల్లేదు నిప్పెట్టి తగలబెట్టేద్దాం, పీడ వదిలిపోద్ది’ మరొకరు ఆవేశంగా. ‘మీ ఇంట్లో కిరసనాయిలుందా తేపో’ అంటూ పక్కనున్న కుర్రాడిని కొట్టినంత పని చేశాడొకతడు. ఆ మాట పూర్తయ్యేలోపు అక్కడి వారి చూపు దగ్గరల్లోనే ఉన్న తుమ్మ మొద్దు మీదకు మళ్లింది. ప్రతి ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి తెచ్చుకున్న కిరోసిన్ అంతా జమ అయింది. జంగమ్మను మొద్దుకు కట్టేసి, కిరోసిన్ పోసి నిప్పు పెట్టేశారు. పొలానికెళ్లిన పెద్ద కొడుకు సంగతి తెలిసి పరుగెత్తుకొస్తుంటే దూరంగా జంగమ్మ పెడుతున్న చావుకేకలు చెవిన పడుతున్నాయి. ఊరు దగ్గరయ్యే కొద్దీ అరుపులు సద్దుమణిగాయి, కొడుకు వచ్చే లోపే తల్లి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి చితిమంటలు కూడా ఆరిపోయాయి. ఈ దురాగతంలో పాల్గొన్న 30 మందినీ అరెస్టు చేశారు.

  

 
చోద్యం చూడడానికొచ్చిన వారిలో ఒకావిడ ‘ఎందుకు జంగమ్మను కట్టేశారు’ గుసగుసగా అడిగింది పక్కనున్నామెని. ‘చేతబడి చేస్తోందట, పోయిన వారం మల్లేశన్న పిట్టపిడుగున పోయాడు గదా! అది చేతబడితోనే. ‘గుండెపోటని చెప్పార్ట పట్నంలో డాక్టరు’ ప్రశ్నార్థకంగా చూసిందా మహిళ. ‘గట్టిగా పిడిరాయిలా ఉన్న మనిషికి అట్లాంటి మాయదారి రోగం ఎందుకొస్తుంది. ఏ చేతబడో చేయకపోతే. అయినా ఈ జంగమ్మ ఇప్పుడే కాదు... అంతకు ముందు కూడా చాలా చేసింది. అందుకే వాడలో ఎవరింట్లోనూ డబ్బులు చాలడం లేదు. అట్టాంటిది బళ్లకొద్దీ పంట, మేకలు అన్నీ జంగమ్మ ఇంటికే వస్తున్నాయి. సౌభాగ్యం అంతా తనింటికే రావాలని అందరిళ్లకూ చేతబడి చేయిస్తోంది. మొగుడిని అమాయకుడిని చేసి చక్రం తిప్పుతోంది. ఎదురులేనట్లు ఊరేగుతోంది’ మెల్లగా అంటున్నప్పటికీ ఆమె మాటల్లో మనసులోని అక్కసంతా వ్యక్తమైంది.

  

ఊరు సద్దుమణిగింది. అరెస్టయిన వారి ఇళ్లలో భయాందోళనలు రగులుతుంటే జంగమ్మ ఇంట్లో తీవ్రమైన నైరాశ్యం చోటుచేసుకుంది. ఎవరు ఏ మూలన ముడుచుకుని ఉన్న వాళ్లు అక్కడే అన్నట్లు గడుస్తోంది రోజు. వాళ్ల మనసుల్లో ఆవేదన సుళ్లు తిరుగుతోంది. ‘కళ్లలో నిప్పులు పోసుకున్నారు కదరా, నా పెండ్లాన్ని చంపితే మీకేమొచ్చింది’ అని పదే పదే తనలో తానే మాట్లాడుకుంటున్నాడు జంగమ్మ భర్త. అయినా ఊరంతా ఒకటైనప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత. ‘మూఢ నమ్మకానికి బలైంది జంగమ్మ’ అనుకున్నారు విద్యావంతులు, వివేకవంతులు. వార్తా పత్రికలు కూడా అదే రాశాయి. కానీ... నిజం అది కాదు... జంగమ్మ మూఢనమ్మకం ముసుగులో అసూయకు గురయింది. ద్వేషానికి బలైంది. ఆమె అలా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించడం ఊళ్లో వాళ్లకు నచ్చలేదు. కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని వారు ఎక్కడా చదువుకోలేదు. కానీ అంత లౌక్యంగానూ వ్యవహరించారు.

  

మహ్మదాపురంలో జరిగిన మహిళ సజీవదహనం సంఘటన జిల్లా మొత్తాన్ని కుదిపేసింది. పోలీసుల ఆధ్వర్యంలో జనవిజ్ఞానవేదిక మహ్మదాపురంలో చైతన్య సమావేశం ఏర్పాటు చేసింది. అరెస్టయిన 30 మందిని కూడా తీసుకువచ్చారు పోలీసులు. చైతన్య సమావేశం పూర్తయింది. జనవిజ్ఞానవేదిక బృందం వెళ్లిపోవడానికి సన్నద్ధమవుతోంది. ఇంతలో... అందరి కళ్లూ నిప్పుల గుండం మీదకు మళ్లాయి. ఆశ్చర్యంతో పెద్దవైన కళ్లు, తెరిచిన నోరు కొద్ది క్షణాలపాటు అలాగే ఉండిపోయాయి.

 
జంగమ్మ పెద్ద కూతురు యాదమ్మ... అప్పటి వరకు నోరు విప్పని యాదమ్మ... మౌనంగా నిప్పుల మీద నడుస్తోంది. ఆమె కళ్లు వేనవేల ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఇవన్నీ మంత్రాలనే కదా మీరు మా అమ్మను చంపేసింది అని ఆ అమ్మాయి అడగలేదు. కానీ ఆ కళ్లు ప్రశ్నిస్తున్నాయి.  మా అమ్మ కాలిపోయింది. మరో తల్లి ఇలాంటి మూఢనమ్మకాలకు బలికాకూడదు... అనే సందేశం ఆ మౌనంలో ఉంది. తన తల్లి మూఢనమ్మకాలకు ఆహుతైంది. ఆమె తన ప్రాణంతోపాటు ఆ ఊరిలోని మూఢత్వాన్ని కూడా ఆహుతి చేసిందనడానికి ప్రతీకలా ఉంది యాదమ్మ. మూఢత్వం నుంచి చైతన్యవంతమైన కొత్తతరానికి ప్రతీకలా నిప్పుల గుండాన్ని దాటి బయటకు వచ్చింది. ఊరంతా దోషిలా తలవంచుకుంది. ఇది జరిగి పదేళ్లు దాటింది. యాదమ్మను ఇప్పుడెళ్లి పలకరించినా తల్లిని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కారుస్తోంది. మా అమ్మలాగ మరెవరికీ జరగకూడదని కోరుకుంటోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి  - తిరుమణి శేఖర్, సాక్షి, నాంపల్లి

 

 
మా అమ్మ నిర్దోషి!

మా అమ్మను మా దాయాదులే చంపేశారు. చేతబడులేంటో మాకు తెలియదు. మా నాన్న అమాయకుడు. మాకు సాగు పొలం, ఎడ్లు, మేకలు ఉన్నాయి. వాళ్లకవేవీ లేవు. మా అమ్మ దేనికీ వారి ముందు చేయి చాచేది కాదు. అందుకే వారికంత అసూయ. పెద్దూరికి పంచాయతీకి తీస్కబోయి ఉంటే అమ్మ బతికేది. అలా కూడా చేయలేదు. అప్పుడు తమ్ముడు హైదరాబాద్‌లో పదవతరగతి చదువుతున్నాడు. నేను పొద్దున్నే బావికాడికి (పొలానికి) పోయాను. అంతా రెండు గంటల్లోనే అయిపోయింది.

 - వెంకటయ్య, జంగమ్మ పెద్ద కొడుకు

 

కొట్టి కిరోసిన్ పోసి కాలవెట్టిండ్రు!
మా అమ్మను మా కళ్ల ముందే కొట్టుకుంటూ లాక్కెళ్లారు. పాలోళ్ల (దాయాదులు) మోసమే అంతా. మంటల్లో కాలిపోతున్న మా అమ్మ రూపం కళ్ల ముందే కనిపించేది చాలా రోజులు. ఆమె ఏడుపు చెవుల్లో వినిపిస్తూనే ఉండేది. జనవిజ్ఞాన వేదిక వాళ్లు వచ్చి నిప్పుల మీద నడిచినప్పుడు నాకు చాలా చెప్పాలనిపించింది. ఏమీ మాట్లాడలేకపోయాను. మంత్రాలు, పూజలు లేవని వాళ్లు చూపించిన బాటలోనే నడవాలని నేను కూడా నిప్పుల మీద నడిచాను. - యాదమ్మ, జంగమ్మ పెద్ద కూతురు

 

జంగమ్మ కథతో నాటిక!
చేతబడులు లేవు, క్షుద్రపూజలు లేవు. ఎవరికో హాని జరగాలని పూజ చేసినంత మాత్రాన అలా జరగదు.. అని చెబుతూ మంత్రగాళ్ల మోసాలకు బలికావద్దని చెప్పం. నిప్పుల మీద నడవడానికి మంత్రాలు అక్కరలేదని నడిచి చూపించాం. సర్పంచ్‌తోపాటు ఊరివాళ్లు కూడా నిప్పుల మీద నడిచారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి జంగమ్మ కథ రాశాం. ఆమెకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతూ జిల్లా అంతటా ప్రదర్శించాం. మూఢత్వంతో ఇప్పటికీ చెట్టుకి కట్టేసి కొట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ సజీవదహనం వంటి దురాగతాలు ఆ చుట్టుపక్కల జరగలేదు. మూఢనమ్మకాలు లేని సమాజ నిర్మాణానికి మా ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది.  - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement