
మేడ్ ఫర్ ఈచదర్...మేడీజీ ఇలా...
దాంపత్యం
‘చాలా మంది భర్తలు తమ భార్యలను తేలికగా తీసి పక్కన పెట్టేస్తుంటారు. లేదా నెమిలీకగా అపురూపంగానే చూసినా... పుస్తకాల్లాంటి చీకట్లలో మూసిపెట్టేస్తుంటారు. కానీ... మహిళా రంజకుడైన ఆ దేవుడి సంగతి వేరు. శ్రీకృష్ణుడి మాటే వేరు. నెత్తిమీద నెమిలీకతో పాటు భార్యనూ అక్కడే పెట్టుకుంటాడాయన. భార్యకు ఎంత విలువివ్వాలో తెలిసిన వాడు కాబట్టే దేవుడయ్యాడు. మగువకు దక్కాల్సిన మర్యాదను గౌరవంగా దక్కించేవాడు మగడయ్యాడు. భార్యగా తానంటే కృష్ణుడికి ఎంత ప్రేమో చెలులకు ఆమె చెప్పిన మాటలివి.,.
సీ. కలలోననైనా నవ్వులకైనా నా మాట జవదాట వెఱచు నో చంద్రవదన
యే పదార్థంబు నా యెదుట బెట్టకమున్న యెవ్వారి కొసగడో యిగురుబోడి
చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబు లిచ్చు నో చంచలాక్షి...... ॥
నవ్వులాటకోసమైనా తన మాట జవదాటడట. చిరుతిండ్లేవైనా తనకు పెట్టకముందు చిగురంత కూడా పక్కవాళ్లకూ ఇవ్వడట. తన గురించి సత్యభామ దగ్గర ఎవరైనా చాడీలు చెబుతారేమోనని చెలికత్తెలకు లంచాలిచ్చి మంచి చేసుకుంటాడట...
సాక్షాత్తూ అవతార పురుషుడే అయినా... బ్రహ్మాది దేవతలు కూరిమితో పూజించే దేవతలకే దేవుడైనా భార్యను అంతగా గౌరవించాడు కాబట్టే అంతమంది భార్యలున్నా కూడా మంచి భర్తగా మన్ననలు అందుకుంటున్నాడు. మరి భర్తగారు భార్యకు ఇంతగా లోబడి ఉన్నందుకేనేమో ‘నడిరేయి ఏ ఝాములో స్వామి నిను చేర దరివచ్చినా... పతిదేవుడికి కాస్త ఓ మాట చెప్పమ్మా’ అని పద్మావతిని కోరేవాళ్లూ... ‘మమూ బ్రోవమని చెప్పవే’ అంటూ సీతమ్మ తల్లి సిఫార్సులను కోరేవాళ్లూ ఉన్నారు. భర్త భార్యను సత్యభామలా నెత్తికెక్కించుకున్నా... సీతమ్మ వారు సిఫార్సులు స్వీకరించినా స్వీకరించకపోయినా... మహిళలు మంచివారు. అన్‌డ్యూ అడ్వాంటేజీ ఎప్పటికీ తీసుకోరు. జన్యూన్‌గా అవసరమైతే మాత్రం జగమంతటికి ఎదురుతిరిగి జయించగలరు. తాము తలచింది జరిగేవరకూ పట్టువిడువరు. కొప్పుముడువరు. ఈ గుణమే కొందరికి కాస్త వేరుగా అనిపించవచ్చు. పెళ్లాన్ని తేలికగా చూసేవాడికి ఇది మంకుపట్టులా అనిపిస్తుంది. నెమలీకగా నెత్తినపెట్టుకునేవాడికి పట్టుదలలా కనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకునే భర్తే దేవుడు! ఇక దేవుడైనా సరే... చెలికత్తెలు చాడీలు చెబుతారేమో అని భార్యకు భయపడటం ఏమిటంటారా...? దానికి ఈ లోకంలో సత్యభామ అయినా మరో భామ అయినా చెప్పే మాట ఒకటే...
‘ఏ పనినైతే చాటుగా చేయాలని ఎవరైనా అనుకుంటున్నారంటే... ఆ పనిలో ఏదో తప్పుందన్నమాట. పతిదేవుడు పబ్లిగ్గా చేసే ప్రతిపనినీ మహిళ ఓకే అంటుంది. నా ఓటు నీకే అంటుంది. ఆ పని చేయగలిగితే... అలా పనిచేయగలిగితే ఎవరైనా, ఎవరికైనా భయపడాల్సిన పనేముంటుంది?’
ఈ కీలకం తెలిస్తే చాలు... సంసారానికి అదే పీజీ...
మేడ్ ఫర్ ఈచదర్ మార్గం మేడ్ బహు ఈజీ. బహుత్ ఈజీ.