ముగురమ్మలు
నాయకత్వ లక్షణాలకు అసలైన నిదర్శనం - డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయనతో ఒక్క నిమిషం గడిపినా - దాన్ని ఎన్నో వందల నిమిషాల విలువగా మలిచేవారాయన. ఉత్తమనాయకుడు కొండెక్కి కూచోకూడదు, జనంతో మమేకమై పోవాలి. వైఎస్ చేసిందదే!
అచ్చుగుద్దినట్లు ఆరణాల తెలుగువాడి వస్త్రధారణ వైఎస్‌ది. తేటతెలుగు నుడికారపు పలకరింపు ఆయన సొంతం. నిండుగా, పెదవులారా, నోరారా, కళ్లారా, కడుపారా, మనసారా నవ్వడం వైఎస్‌కే తెలుసు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఈ లక్షణం మచ్చుకైనా కనిపించదు. ఎంతటి విషమ పరిస్థితుల్లోనయినా మొహమంతా పరచుకొన్న ఆ చిర్నవ్వు చెక్కు చెదరదు. ఎంతటి షాకింగ్ న్యూస్ విన్నా - ధైర్యంగా నిబ్బరంగా నిలబడేవారాయన.
కంగారు పడరు, తోటివారిని కంగారుపెట్టరు. సమయపాలనకు ప్రాణమిచ్చిన వ్యక్తి వైఎస్. క్రమశిక్షణకు చిరునామా ఆయన. ఉదయం నాలుగు గంటలకే లేవడం, గంటసేపు వ్యాయామం, ట్రెడ్‌మిల్‌పై వాకింగ్, పది నిమిషాల ధ్యానం - ఇదీ రోజుని ప్రారంభించే తీరు. ఎక్స్‌ర్‌సైజులు చేసేటప్పుడు కూడా పక్కన ఓ చిన్నపుస్తకం, పెన్ను ఉండాల్సిందే. కొత్త ఆలోచనని రాసేసుకోవాల్సిందే.
ఎంత బిజీ ఉన్నా - కుటుంబంతో గడపడం ఆయనకు ఇష్టం. బయటి ఒత్తిళ్లను ఇంట్లో చూపేవారు కారాయన. కార్యక్రమాలు ఎన్ని ఉన్నా, రాజకీయ టెన్షన్లు ఎన్ని ఉన్నా - ఇంట్లోకి అడుగుపెట్టగానే అవన్నీ దూది పింజలైపోవాల్సిందే. మనసుపై గట్టిపట్టు ఉంటేనే ఇది సాధ్యం. ఏ విషయంలోనయినా సరే - ముందు తన మీద తాను పవర్ సాధించాలి. ఆపై ఇతరులపై పవర్ సాధించడం చిటికెలో సాధ్యం.
స్త్రీని అమితంగా గౌరవించడం నాయకుడి లక్షణం. ‘‘నా జీవితాన్ని ముగ్గురు మహిళలు మలిచారు. మా అమ్మ జయమ్మ - నన్ను ధైర్యస్ధుణ్ని చేసింది. భార్య విజయమ్మ - కంటిపాపలా చూసుకొంది. కుమార్తె షర్మిలమ్మ - వెలుగులు నింపింది’’ అని చెప్పేవారాయన.
ఇలాంటి అనేక నాయకత్వ లక్షణాలు వైఎస్‌కి రాత్రికి రాత్రి రాలేదు. శిల నుంచి సమస్యల ఉలిదెబ్బలతో రాటు తేలితే వచ్చాయి. కాలంతో పాటు, వయసుతో పాటు, అనుభవంతో పాటు తనను తాను మలచుకొన్న వ్యక్తిత్వం ఆయనది.
ఇవ్వాళ ప్రపంచానికి అతి పెద్ద సమస్య - నాయకుల్లేకపోవడం. ప్రజల్ని ప్రేమించగల, జనాన్ని నడిపించగల, కోట్లాది మందిని కలగలుపుకొని పోగలవాడే అచ్చమైన నాయకుడు. అందుకు సిసలైన నిర్వచనం - వైఎస్‌ఆర్.
- ఆకెళ్ల రాఘవేంద్ర
‘దటీజ్ వైఎస్‌ఆర్’ గ్రంథ రచయిత