ఉదయం టిఫిన్ చేయండి... గుండెజబ్బులను తరిమేయండి!
ప్రతిరోజూ ఉదయమే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో గుండెజబ్బుల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోని వారు, తరచూ దాన్ని మిస్ చేసే వారిలో గుండెజబ్బుల రిస్క్ గణనీయంగా పెరిగినట్లు గుర్తించిన ఆ అధ్యయనవేత్తలు ఆ అంశాన్ని ‘సర్క్యులేషన్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో 26,902 మంది పురుషులు పాల్గొన్నారు. వీరిలో 16 నుంచి 82 ఏళ్ల వయసున్నవారూ ఉన్నారు.
సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అధ్యయనంలో తరచూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారిని పరిశీలించగా... వారిలో 27 శాతం మందికి గుండెజబ్బుల రిస్క్ ఫ్యాక్టర్లు మొదలైనట్లు పరిశోధనవేత్తలు గుర్తించారు. ఇక రాత్రివేళ కూడా చాలా ఆలస్యంగా భోజనం చేసేవారిలో 55 శాతం మందికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు.