నీరు చల్లితే.. బ్యాక్టీరియా ఖతం!
తాజా పండ్లు, కాయగూరలు. కానీ వాటితో పాటు కోట్లకొద్ది బ్యాక్టీరియాలు కూడా ఉచితం! అసలే రసాయనాలు.. ఆపై హానికర సూక్ష్మజీవులు! రైతు పొలం నుంచి మన ఇంటికి చేరేదాకా.. దాదాపు ప్రతిచోటా పండ్లు, కాయగూరలది ఇదే పరిస్థితి. రుద్దిరుద్ది కడిగినా.. ఈ.కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు పోతాయన్న గ్యారంటీ లేదు! అందుకే.. కాయగూరలు, పండ్లపై ఉండే బ్యాక్టీరియాలను హతమార్చే నీటి బిందువులను సృష్టించారు కేంబ్రిడ్జి, మసాచూసెట్స్లోని హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.
పండ్లపై ఈ నీటి బిందువులను చిలకరిస్తే చాలు.. ఎలాంటి మొండి బ్యాక్టీరియా అయినా హరీమంటుంది. ఈ ‘మంత్రజలం’తో ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు చక్కని పరిష్కారం దొరికినట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.
పరీక్షల్లో తేలిందేమిటి?
పరీక్షల్లో భాగంగా.. టమాటాలు, స్టీలు పాత్రలపై వీటిని చల్లగా.. ఈ.కోలి, సాల్మొనెల్లా, లైస్టీరియా వంటి బ్యాక్టీరియాలు 30 నిమిషాల్లో 98% వరకూ చనిపోయాయి. ఈ పద్ధతిలో రసాయనాల వినియోగం ఉండదు కాబట్టి.. ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం కాదు. ఆహారం రుచి, రంగు కూడా మారదు. ప్రస్తుతం పలు బ్లీచింగ్ ద్రవాలు, క్లోరిన్ ఉపయోగిస్తూ మాంసం, కాయగూరలు, పండ్ల వంటివాటిని సూక్ష్మజీవరహితం చేస్తున్నారు. విద్యుదావేశ నీటిచుక్కల పద్ధతిని మరింత అభివృద్ధిపర్చి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హార్వార్డ్ పరిశోధకులు వెల్లడించారు.
నీటి చుక్కలు ఎలా చంపుతాయి?
మామూలు నీటి చుక్కలు అయితే బ్యాక్టీరియాను చంపలేవు. కానీ ఇవి ప్రత్యేకంగా సృష్టించిన విద్యుదావేశ పూరిత నీటి బిందువులు. ‘ఇంజనీర్డ్ వాటర్ నానోస్ట్రక్చర్స్’ అనే ఈ నీటి చుక్కలు జస్ట్ 25 నానోమీటర్ల(ఒక నానోమీటరు అంటే మీటరులో వంద కోట్ల వంతు) పరిమాణంలో మాత్రమే ఉంటాయి. బలమైన విద్యుత్ క్షేత్రం గుండా నీటిని పంపడం వల్ల ఈ నీటి అణువులు స్థిరమైన హైడ్రాక్సిల్, అస్థిరమైన సూపర్ఆక్సైడ్ రాడికల్స్ అనే రెండు అణువులుగా విడిపోతాయి.
విద్యుదావేశానికి గురికావడం వల్ల స్థిర అణువులు పొరగా ఏర్పడి అస్థిర అణువులను బంధించి ఉంచుతాయి. అందువల్ల ఈ అణువులు గాలిలో కొన్ని గంటల వరకూ ఆవిరి కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ నీటి బిందువుల ఉపరితలంపై బలమైన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. దీనివల్ల ఇవి బ్యాక్టీరియా కణపొరలను ఛిద్రంచేయడంతో అవి చనిపోతాయి.