మలిసంధ్య వాకిట్లో మాతృప్రేమ | malisandhya vakitlo mathru prema | Sakshi
Sakshi News home page

మలిసంధ్య వాకిట్లో మాతృప్రేమ

Published Wed, Apr 9 2014 12:09 AM | Last Updated on Fri, Aug 17 2018 7:49 PM

మలిసంధ్య వాకిట్లో మాతృప్రేమ - Sakshi

మలిసంధ్య వాకిట్లో మాతృప్రేమ

వృద్ధాప్యం కోరే ఏకైక కోరిక ప్రేమ. ఆ వయసులో ఒంటరితనాన్ని మించిన నరకం మరొకటి ఉండదు. ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్లే వారికి పంచభక్ష్యపరమాన్నాలతో సమానం. అలాంటి ప్రేమను పంచాలంటే డబ్బుంటే సరిపోదు, ఆ పండుటాకులను ప్రేమగా పలకరించే గుండె కావాలి. లక్ష్మికి ఆ రెండూ ఉన్నాయి. ‘వృద్ధులపై అభిమానమున్నవారు డబ్బిస్తున్నారు, నేను సేవ మాత్రమే చేస్తున్నాను’ అని ఎంతో వినమ్రంగా చెప్పే లక్ష్మి చేసే సేవొక్కటే కాదు ఆమె జీవితం కూడా ఆదర్శమే.
 
 పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ‘తబితా డెవలప్‌మెంట్ సొసైటీ’ గురించి ఆ చుట్టుపక్కల చాలామందికి తెలుసు. ఎక్కడైనా అనాథ వృద్ధులు కనిపిస్తే వెంటనే ఆ సొసైటీకి ఫోన్ చేసి వివరాలు చెబుతుంటారు. విద్యార్థులయితే వారిని వెంటనే తీసుకొచ్చి సొసైటీలో చేర్పించేస్తారు. ప్రస్తుతం ఆ సొసైటీలో ముప్పైమంది వృద్ధులున్నారు. వీరిలో పదిమంది అనాథలు. వారికి లక్ష్మే కొడుకు, కూతురు. ‘‘ ఆశ్రమంలో తొంభై ఏళ్ల వయసువాళ్లు కూడా ‘అమ్మా’ అని పిలుస్తుంటే ఇంతమందికి తల్లినయ్యానా అనిపిస్తుంటుంది నాకు.  మా ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో ‘కాళ్లకూరు’ అనే గ్రామంలో ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. చాలామంది ఆమెకు పళ్లు, ఆహారం పంపేవారు. ఒకప్పుడు బాగా బతికినామె... ఇప్పుడు అనాథఅయిందని అందరూ జాలి చూపించేవారు.

నేను కూడా నాకు తోచింది పంపేదాన్ని. ఒకరోజు ఆమెను చూడాలనిపించి పిల్లల్ని వెంటపెట్టుకుని వెళ్లాను. 80 ఏళ్ల వృద్ధురాలు...ఒక రేకులగదిలో మంచంపై పడుకుని ఉంది. రేకుల సందుల్లోనుంచి వర్షం కురుస్తోంది. ఓ అరగంట ఆమెతో గడిపాక ఒంటరి వృద్ధుల గురించి ఆలోచన మొదలైంది. దానికి తోడు నేను తిరిగొస్తూ ఉంటే, ఆమె నా చెయ్యిపట్టుకుని ‘నన్ను వదిలిపెట్టి వెళ్లకమ్మా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూటకు ఆమెకు నచ్చజెప్పి వచ్చానే గాని ఇంటికొచ్చాక ప్రతిక్షణం ఆమె ఆలోచనలే ఉండేవి. ఇద్దరు పిల్లలతో పాటు ఆమె కూడా నా బిడ్డే అనుకుని తీసుకొచ్చాను. అలా ఆమెకిచ్చిన ఆశ్రయం...ఇలా ఇంత పెద్ద ఆశ్రమంలా మారింది’’ అని చెప్పారు లక్ష్మి. ఆమె మాటలు వినగానే అందరికీ వచ్చే సందేహం తనకు కుటుంబ బాధ్యతలు లేవా? అని. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకొని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆమె ఆ బాధను మరచిపోడానికి ఎంచుకున్న మార్గం సేవ.
 
పదేళ్లక్రితం...

 ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మికి ఇద్దరు పిల్లలు పుట్టగానే భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయారు. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసినవాడు ఉన్నట్టుండి దూరమైపోవడంతో లక్ష్మి తట్టుకోలేకపోయింది. భర్తను మరచిపోలేక ఆత్మహత్యే శరణ్యమనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు స్కూలుకెళ్లాక ఒంటరిగా కూర్చుని ఏవో ఆలోచిస్తూ గడిపే లక్ష్మికి వృద్ధులకు ఆశ్రయం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. దీనివల్ల తన జీవితానికి ఒక అర్థం ఉంటుందనిపించింది. అలా 2004లో అద్దె ఇంట్లో వృద్ధాశ్రమాన్ని స్థాపించింది. ‘‘మా అమ్మా, తమ్ముడి భార్య ఫణికుమారి, ఇతర బంధువుల, స్నేహితులు... సహకారంతో నేనీ సేవకు సిద్ధమయ్యాను. పదేళ్ల నుంచి మా ఆశ్రమంలో వందమందికి పైగా వృద్ధులు ఆశ్రయం పొందారు. మా పనితీరుని చూసి ఎమ్‌విఎన్‌ఎస్ రాజు, మణి అని దంపతులు ముందుకొచ్చి వారి తండ్రిగారి పేరున వృద్ధులకు ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. వసుధ ఫౌండేషన్, పిఎల్ రాజుగారు ఏటా ఆర్థికసాయం చేస్తున్నారు. ఇలా మరికొంతమంది వంట సాగు, బట్టలు, ఇతర ఖర్చులకు సహకరిస్తున్నారు’’ అని చెప్పారు లక్ష్మి.
 
చివరిరోజులు...

 ఇప్పటివరకూ ‘తబితా డెవలప్‌మెంట్ సొసైటీ’లో 50మంది వృద్ధులవరకూ కన్నుమూశారు. వారి అంత్యక్రియలకు సంబంధించిన పనులన్నీ లక్ష్మి దగ్గరుండి చూసుకుంటారు. ‘‘చివరి దశ అనగానే బోలెడు ఇబ్బందులుంటాయి. ప్రతిరోజూ వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. మంచంపట్టినవారికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటారు. అన్నింటినీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అనాథ వృద్ధులకు ఆశ్రమంలోనే వైద్యం ఏర్పాట్లు చేయిస్తాను. పిల్లలున్నవారికి ప్రత్యేక సౌకర్యాలు వారే ఏర్పాటు చేసుకుంటారు. ఇక చనిపోయినపుడంటారా... దగ్గరలో ‘మోక్షధామ’ అనే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన శ్మశానవాటిక ఉంది. అనాథ వృద్ధులకు ఉచితంగా అంత్యక్రియలు చేస్తారు వాళ్లు. ఇలా నలుగురి సాయంతో నా సేవ కొనసాగుతోంది’ అని చెిప్పిన లక్ష్మి మాటలు విన్నవారికి ఆమె చేస్తున్న సేవ పట్ల అభిమానం, వృద్ధులపైన ప్రేమ పెరుగుతాయి. శ్రీలంక దేశానికి చెందిన ది ఓపెన్ యూనివర్శిటీవారు లక్ష్మి సేవను గుర్తించి డాక్టరేట్ కూడా ఇచ్చారు.  జీవితం మధ్యలో ఆగిపోయిందన్న అపోహలో ఉన్న మహిళలకు తలుచుకొంటే తామూ ఎంతో చేయగలమన్న ధైర్యం పెరుగుతుంది.
 - భువనేశ్వరి, ఫొటోలు: బి. పూర్ణ చంద్రరావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement