ఈ మల్లిక పదవిలోనూ పరిమళించింది!
స్ఫూర్తి
ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేశారు. భారతదేశంలో అత్యుత్తమ ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గవర్నింగ్ మెంబర్‌గా ఉన్నారు. మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించారు... 2006 ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఫోర్బ్స్ అమేజింగ్ టాప్ 50లో పవర్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ఎప్పుడూ ఆకాశాన్ని అందుకోవడానికే ప్రయత్నిస్తారు... కాని నేల మీదే నడుస్తారు... కొందరు ఆమెకు తలపొగరని అంటారు... కాని పెద్ద పెద్ద కంపెనీలు తల ఎత్తుకునేలా చేస్తారామె. ఆమె 2500 కోట్ల టర్నోవర్ ఉన్న టాఫే కంపెనీ డెరైక్టర్ మల్లికా శ్రీనివాసన్.
బడా పారిశ్రామికవేత్త శివశైలమ్ ఇంట్లో 1959 నవంబర్ 19న పుట్టిన మల్లిక, మద్రాసు యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ పట్టా పుచ్చుకున్నాక, పెన్సిల్వేనియాలో ఎం.బి.ఏ చేసి, టీవీఎస్ కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్‌ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు.
1986లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆమె తన తండ్రిదైన ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ (టాఫే)లో ఉద్యోగిగా చేరారు. సొంత కంపెనీలోనే పని చేస్తున్నప్పటికీ మల్లిక మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆమెది ఆ కంపెనీలో ఏ పదవో తెలియలేదు. అయితే ఆమె ఏం చేయాలో మాత్రం చెప్పారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోగలిగే చాకచక్యం... తండ్రి పర్యవేక్షణ, సాటి ఉద్యోగుల చేయూతతో ఆమె తాను ఎదుగుతూ, ట్రాక్టర్ పరిశ్రమకు సిఈవో అయ్యే స్థాయికి చేరారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ దృఢదీక్షతో ముందుకు దూసుకువెళ్లారు. ట్రాక్టర్ మ్యాన్యుఫాక్చరింగ్‌లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ట్రాక్టర్‌ను రైతులకు మరింత ఉపయోగపడేలా చేశారు.
స్వభావం... గొప్పశక్తి అనేది గొప్ప బాధ్యత నుంచి వస్తుంది అని నమ్మే మల్లిక తన ఆశయాలు, ఆలోచనల విషయంలో ఆశావాది. ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ (టాఫే) చెన్నైలో ఉంది. చైర్మన్, సిఈవో ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె అందరితో కలిసి పని చేస్తారు.
తాను కంపెనీలో చేరిన తొలి రోజులను గుర్తు తెచ్చుకుంటూ... టాఫే బిల్డింగ్ కారిడార్‌లో కొంత భాగాన్ని వేరు చేసి అందులో ఆఫీసు పెట్టారు. ఉన్న స్థలంలోనే మంచి టీమ్ ఎంతో పొందికగా కంఫర్ట్‌గా ఉంది. పనిచేస్తున్నవారిలో చాలామంది మా నాన్నగారి టైమ్‌లో అంటే 1964లో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఉన్నారు. కొందరు నన్ను ఆహ్వానించారు. కొందరు మాత్రం ‘ఈవిడ ఎంతకాలం ఉంటుందిలే’ అనుకునేవారు’’ అని చెప్పారామె.
2005లో ఏషర్ మోటార్స్‌ను దాటి టాఫే రెండోస్థానానికి రావడం చూసి ‘‘ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయానికి చాలామంది ఆశ్చర్యపోయారు’’ అంటారు టాఫే కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవహారాలు చూసే విజయకుమార్ బ్రౌనింగ్. మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ స్ట్రాటెజీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి.ఆర్ కేశవన్... మల్లిక చాలా నిబద్ధత కల్గిన వ్యక్తి. అందరినీ ముందుకు నడిపించే శక్తి ఆమెలో ఉంది అంటారు. 1986లో నాలుగు వేల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం 1,20,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి వెళ్లి, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
2000 వ సంవత్సరంలో కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుని పోయి ఉన్న సమయంలో మల్లిక రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లోను, కొత్త ఉత్పత్తుల కోసమూ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, ఉత్పత్తుల ప్రమాణాలను పెంచారు. తాను చేరే నాటికి 86 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీని 2011 నాటికి 5800 కోట్లకు తీసుకువెళ్లారు. మహీంద్రా ట్రాక్టర్ల తరువాత రెండోస్థానాన్ని సంపాదించి పెట్టారు టాఫేకి.
‘‘జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అవకాశాల కోసం వెతుకుతూండాలి. అలాగే... చేస్తున్న పని పట్ల నిబద్ధతతో ఉంటూ, ఆనందంగా చేయాలి’’ అంటారు మల్లిక. ఉత్తమ సీఈఓగానే కాదు, ఉత్తమ ఉద్యోగిగా... ఆఖరుకు బాధ్యత గల పౌరుడిగా పేరు తెచ్చుకోవాలన్నా కూడా ఆమె చెప్పిన సూత్రాలను, క్రమశిక్షణను పాటించడం అవసరమేమోననిపిస్తుంది. ఎందుకంటే అది అక్షర సత్యం కాబట్టి!
- డా. వైజయంతి
ఏ ప్రధాన బాధ్యత స్వీకరించవలసి వచ్చినా, ముందుగా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని తనను తాను నిరూపించుకునేవారు మల్లిక. తన ఉద్యోగస్థులందరితోటీ చక్కగా మాట్లాడతారు. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని, దానికి పరిష్కారం కనుక్కునేవారు. కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్నా కూడా చాలా సాధారణ ఉద్యోగిలాగే ఉంటారామె. ‘‘ఇలా ఉండటం వలన ఎవరు ఎక్కడ పనిచేయగలరో తెలుసుకోవడానికి ఉపయోగపడింది’’ అంటారు మల్లిక. పొద్ద్దున్న తొమ్మిది గంటలకు ఆఫీసుకి వెళ్లి చూస్తే, అప్పటికే ఆమె కంపెనీ ఫైల్స్ చూస్తూ, ఉద్యోగులకు సూచనలు ఇస్తూ కనిపిస్తారు. బహుశ అదే ఆమె విజయ రహస్యం కావచ్చు!