అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల మాత్రమేకాదు, ఎంత పెద్ద రిస్కే అయినా చేసే సాహసం ఉండాలి. ? సక్సెస్ సాధిస్తామా లేదా అనే భయాలు ఒక ప్రయాణ ప్రారంభంలో చాలా ఉంటాయి. కానీ తప్పదు. విజయతీరాలను అందుకోవాలి అంటే సాహసం చేయాలి. అలా దృఢ సంకల్పంతో "ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా" గా పేరు సంపాదించుకున్న సాహసి గాథ మీకోసం..
ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్.కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోకి దూకి చాలా పెద్ద సాహసమే చేశారు. ఆమె పట్టుదల ఆత్మ విశ్వాసం అలాంటిది మరి. రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా ఎదిగారు. మహిళలు కూడా సమర్ధులని ఏ రంగంలోలోనై సత్తాచాటగలరని ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా పారిశ్రామికవేత్త, షీరో మల్లికా శ్రీనివాసన్.
1959లో జన్మించిన మల్లికా శ్రీనివాసన్ మద్రాస్ యూనివర్సిటీ డిగ్రీని, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత అమెరికా నుంచి తిరిగొచ్చి 1986లో కుటుంబ వ్యాపారంలో చేరారు. ఈ కంపెనీని చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన , దివంగత, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త S అనంతరామకృష్ణన్ 1960లో చెన్నైలోప్రారంభించారు. వ్యాపారంలో అడుగు పెట్టింది మొదలు తన కృషి సాహసోపేతమైన నిర్ణయాలతో కంపెనీని బహుళ-మిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చింది. రైతులు ఆకాంక్షల్ని, ట్రెండ్‌లను గుర్తించి దానికనుగుణంగా సంబంధిత ఉత్పత్తు లుండేలా చూసుకున్నారు. మధ్యతరగతి, వ్యవసాయ ప్రజల కోసం తన చౌకైన ట్రాక్టర్లను అందించడం మొదలు పెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు, అక్కడ టీ షాపుల వద్ద ఆగి, వ్యవసాయ పద్ధతులు, సమస్యలు, తెలుసుకోవడం, ఎలాంటి పరిష్కారాలు కావానుకుంటున్నారో అడిగి తెలుసుకునేవారట.
అయితే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మల్లిక పట్టుదలతో ముందుకు సాగారు. సహేతుకమైన ధరలతో వృద్ధిని కొనసాగించారు. చివరికి మహీంద్రా & మహీంద్రా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా కంపెనీని నిలబెట్టారు. 1961లో కేవలం ఒక ట్రాక్టర్ మోడల్‌తోన కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు. ఆమె టర్కీలో ఒక కర్మాగారాన్ని కూడా స్థాపించారు. వ్యాపారం రంగంలో ఆమెచేసిన సేవలకు గుర్తింపుగా 2014లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మల్లికా భర్త ఇండియన్ బిలియనీర్ వేణు శ్రీనివాసన్ టీవీఎస్‌మెటార్ సీఎండీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
మల్లికా శ్రీనివాసన్ AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్, అలాగే చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), ఎగ్జిక్యూటివ్ బోర్డు బోర్డులలో కూడా ఉన్నారు. మల్లికా స్విగ్గీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. స్విగ్గీ నెట్‌వర్త్ రూ.68918 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం రూ. 23,625.96 కోట్ల నికర విలువతో 83వ సంపన్న భారతీయురాలిగా నిలిచింది.ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు, ఫోర్బ్స్ ఆసియా టాప్ 50 ఆసియన్ పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా నిలిచారు.
జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకుఎప్పటికీ తలొగ్గకూడదని ఆమె చెబుతారు.ఎల్లప్పుడూ అవకాశాల కోసం వెతుకుతూనే ఉండాలంటారు. అంతేకాదు చేసే పనిని ప్రేమించడమే తన సక్సెస్ మంత్రా అంటారు మల్లికా శ్రీనివాసన్. డౌన్ టు ఎర్త్‌గా ఉండే ఆమె వ్యక్తిత్వం, వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఎందరో అమ్మాయిలకు నిజమైన ప్రేరణ.
Comments
Please login to add a commentAdd a comment