మామిడిపండు వేడి చేస్తుందా! | Mango will heat! | Sakshi
Sakshi News home page

మామిడిపండు వేడి చేస్తుందా!

Published Sat, May 21 2016 2:40 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

మామిడిపండు వేడి చేస్తుందా!

మామిడిపండు వేడి చేస్తుందా!

ఆయుర్వేద కౌన్సెలింగ్

మామిడిపండ్లు తింటే వేడి చేస్తుందని, ఒళ్లంతా సెగ్గడ్డలు వస్తాయని అంటుంటారు కదా... అది నిజమేనా. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడిపండ్లు తినవచ్చా? - ఎమ్. సుమన్, విశాఖపట్నం

సంస్కృతంలో మామిడికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి. ఆమ్ర, రసాల, సహకార, అతిసౌరభ, కామాంగ, చూతక, మంజరీ మొదలైనవి. మామిడిపండ్లు రెండు రకాలు. మొదటివి చెట్టుకు పండినవి. రెండోవి ముదిరిన కాయలను ఎండుగడ్డిలో పదిలపరచి, వేడిమి ద్వారా ముగ్గబెట్టినవి. (గమనిక : కార్బైడు వంటి రసాయనాల ద్వారా ముగ్గిస్తే మాత్రం అది విషతుల్యం. అది సహజంగా ముగ్గబెట్టిన రెండో కోవలోకి రాదు).

 
సహజంగా సక్రమంగా ముగ్గబెట్టిన ‘పండు’ (కృత్రిమ పక్వ ఫలం) గుణాలు : చాలా తియ్యగా ఉంటుంది (మధుర రసం). చలవ చేస్తుంది (శీతవీర్యం). తేలికగా జీర్ణమవుతుంది (లఘువు). మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది (సరం). బలకరం. వీర్యవర్థనం (శుక్రకరం). మొత్తం పండు తింటే దీనివల్ల కలిగే ఫలం, ఫలితం కనిపిస్తాయి. అదే పిండి కేవలం రసం మాత్రమే స్వీకరిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. అలా రసం మాత్రమే తీసుకుంటే కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది (గురువు). వాతహరం. కఫకరం.

 
చెట్టుకు పండిన పండు : దీంట్లో తియ్యదనంతో పాటు కొంచెం పులుపు కూడా ఉంటుంది (అమ్లరసం). కాబట్టి పిత్తాన్ని వృద్ధిచేసి కొంచెం వేడిచేస్తుంది. వాతహరం. పూర్తిగా మగ్గని పండు అమ్లరసంతో కూడి, ఉష్ణవీర్యమై, మలవిసర్జనకు సహకారం అందించదు. కాబట్టి ఎలా పండినదైనా వాటిని అతిగా తింటే అనర్థమే.

 
శ్లోకం : ‘‘తదేవ వృక్షసంపక్వం గురు వాతహరపరం మధురామ్లరసం కించిత్ భవేత్ పిత్త ప్రకోపనం; ఆమ్రం కృత్రిమ పక్వంచ తత్ భవేత్ పిత్తనాశనం... చూషితం తత్పరం రుచ్యం, బల్యం, వీర్యకరం లఘు; ... పక్వంతు మధురం వృష్యం స్నిగ్ధం బల సుఖ ప్రదం... హృద్యం, వర్ణం’’

 
కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వేసవి రాజ ఫలమైన మామిడిపండును ఆస్వాదించండి. ఒకవేళ పుల్లని మామిడి పండ్లను తిన్నట్లయితే, వెంటనే అరచెంచాడు జీలకర్రను నమిలి తినండి. లేదా మూడు గ్రాముల శుంఠి చూర్ణాన్ని తిని వేడినీళ్లు తాగండి. దుర్గుణాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. ఇది పండ్లను అధికంగా తినడం వల్ల కలిగే అనర్థాలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది.

 
మధుమేహ వ్యాధిగ్రస్తులు: తియ్యటి పండ్లను ఒకపూట ఆహారంగా నిర్భయంగా తినవచ్చు. అన్నం, రొట్టెల వంటి ఆహారంతో పాటు తినవద్దు. సాధారణంగా మధుమేహ రోగులు పాటించే ఆహార విహార (వ్యాయామం, ప్రాణాయామం, తగినంత నిద్ర మొదలైనవి) నియమాలను పాటిస్తూ, వ్యాధి తీవ్రతను బట్టి వాడే మందులను వాడుకుంటూ, ఒకరోజు మొత్తం మీద తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా మామిడిపండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అప్పుడది వాతకరం కాదు. కాబట్టి మధుమేహానికి వ్యతిరేకం కాదని ఆయుర్వేద సిద్ధాంతం.

 

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

స్కిన్ కౌన్సెలింగ్

నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి.  - రమేశ్‌కుమార్, ఒంగోలు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్ వాష్ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిష్చరైజింగ్ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి.

 
మెమటోజోన్ ఫ్యూరోయేట్ లాంటి మాడరేట్ కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రతిరోజూ  మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3-5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి.

 

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్  త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్

 

టీబీ కౌన్సెలింగ్

నా వయసు 36 ఏళ్లు. ఒక నెల రోజులుగా నాకు తీవ్రమైన దగ్గు, రాత్రిపూట కాస్త జ్వరం వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డస్ట్ అలర్జీగానీ లంగ్ ఇన్ఫెక్షన్ గానీ అయి ఉంటుందని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. కానీ ఏమాత్రం తగ్గలేదు. వారం క్రితం దగ్గినప్పుడు రెండుసార్లు కఫంలో ఎర్రటి చారలు కనిపించాయి. రక్తమేమోనని అనుమానంగా ఉంది. అసలు నాకు ఏమైందోనని భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - గిరిధర్, విజయవాడ

మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు టీబీ (క్షయ) వ్యాధి సోకినట్లుగా అనుమానంగా ఉంది. ఈ వ్యాధి సోకినా మొదట్లో సాధారణంగానే ఉంటుంది. రెండు మూడు వారాలు దాటిన తర్వాతగానీ ఈ వ్యాధిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్‌ను సంప్రదించినట్లుగానే... అది తగ్గనప్పుడు కూడా మీరు మరోసారి ఆయన దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. క్షయవ్యాధి నిర్ధారణకు సంబంధించి మీరు రెండు, మూడు రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అసలు వ్యాధి ఉందా, లేదా; ఉంటే ఏ దశలో ఉంది అనే అంశాలపై ఒక నిర్ధారణకు రావచ్చు. దీన్ని బట్టే మీ చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే వచ్చే కఫం (కళ్లె) పరీక్ష చేయించాలి. ఛాతీ ఎక్స్-రే తీస్తే వ్యాధిపై ఒక అంచనాకు రావచ్చు. ఇక 100 నిమిషాలలో గుర్తించే ఎన్‌ఏఏటీ పరీక్ష విధానం కూడా అమల్లోకి వచ్చింది. దానితో కూడా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ మీకు క్షయం ఉందని, అది చాలా అడ్వాన్స్‌డ్ దశలో ఉందని తేలితే ట్యాబ్లెట్స్ పనిచేయకపోవచ్చు.


ఆ దశ వస్తే సర్జరీ చేయాల్సి రావచ్చు. అయినా ఆందోళన పడాల్సిందేమీ లేదు. టీబీ వల్ల లంగ్స్‌కు ఏర్పడిన ముప్పును ఇప్పుడు వైద్య ప్రక్రియలలో వచ్చిన అత్యాధునిక చికిత్సలతో వంద శాతం రూపుమాపే అవకాశం ఉంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీని నిర్వహిస్తే మీకు సత్ఫలితాలు అందుతాయి. ఈ వ్యాధి చికిత్సకు సంబంధించి ఎలాంటి సొంత నిర్ణయమూ తీసుకోకూడదు. వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి.

డాక్టర్ అరుణ్ కనాలా
సీనియర్ థొరాసిక్ (లంగ్) సర్జన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement