ప్రతీకాత్మక చిత్రం
► ఆసుపత్రులలో పనిచేసే నర్సుల సమస్యలకు తొలిసారిగా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చోటు లభించబోతోంది! కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే.. అపరిష్కృతంగా ఉన్న నర్సుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చగా, ఎన్నికలకు వారం ముందు టి.ఆర్.ఎస్. పార్టీ కూడా నర్సింగ్ సిబ్బందికి వాగ్గానాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకించి ఒక నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నర్సింగ్ ఉద్యోగులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సింగ్ ఖాళీల భర్తీ, నర్సుల కనీస స్థూల వేతనాన్ని 20 వేల రూపాయలకు పెంచడం, నర్సింగ్ డైరెక్టర్ నియామకం, ప్రతి నర్సింగ్ విద్యార్థికీ విధిగా కనీస స్టయిఫండ్ వంటి హామీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చిందని నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రెడావత్ తెలిపారు.
► బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బిహియా గ్రామంలో మూడు నెలల క్రితం ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రత్యేక న్యాయస్థానం 20మందిని దోషులుగా నిర్థారించింది. ఇవాళ (నవంబర్30) వారికి శిక్షను విధించబోతోంది. ఇంటర్ చదువుతున్న బిమ్లేశ్ షా అనే విద్యార్థి మృతదేహం రైల్వే పట్టాలపై పడి ఉండడాన్ని గమనించిన బిహియా గ్రామస్థులు అందుకు కారకురాలిగా ఒక మహిళను అనుమానించి, ఆమె ఒంటిమీద బట్టలు తీయించి గ్రామమంతా ఊరేగించిన ఘటన గత ఆగస్టు 20న జరగ్గా.. ఇన్నాళ్లకు ఈ కేసు కొలిక్కి వచ్చింది.
► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తన పర్సనల్ ఈ మెయిల్ ఐడీ నుంచి ప్రభుత్వ వ్యవహారాలను నడిపించారని ఆమె ప్రత్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవాంక తొలిసారిగా ఆ ఆరోపణలపై స్పందించారు. ‘‘నేను పంపే మెయిల్స్, నాకు వచ్చే మెయిల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి. ఏ ఒక్క మెయిల్‌నీ నేను డిలీట్ చెయ్యలేదు. కావాలంటే చూసుకోవచ్చు’’ అని ఎబిసి టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవాంక సమాధానమిచ్చారు.
వైట్ హౌస్ అడ్వైజర్‌గా ఉన్న ఇవాంక 2017లో అమెరికన్ పాలనా యంత్రాంగంలోని ముఖ్యమైన అధికారులతో కనీసం వందసార్లు తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారని గతవారం రోజుల నుంచీ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఇవాంక.. తన ఈమెయిల్స్ హిల్లరీ నడిపించిన ఈమెయిల్స్ వంటివి కాదని కూడా అన్నారు. ట్రంప్‌కు ముందు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హిల్లరీ క్లింటన్ తన పర్సనల్ మెయిల్ నుంచి పాలనాపరమైన సంప్రదింపులనే వేలసార్లు జరిపినట్లు 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే ఆరోపించిన సంగతి తెలిసిందే.
దోషులకు శిక్ష
ఇవాంక ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment