చాలామంది ఆడపిల్లలకు నాన్న లాంటి భర్త రావాలని ఉంటుంది.ఎందుకంటే చాలామంది ఆడపిల్లలకు నాన్నే ఆదర్శంగా ఉంటాడు.కాని నాన్నలు ఈ సంగతి మర్చిపోతే ఇంటి మనశ్శాంతి గంగలో కలుస్తుంది.ఇంటి మనుషులకు కన్నీరు మిగులుతుంది. రాబోయే భర్త కూడా ఇలాంటి నాన్నగా మారితే గతేం కాను అని భయమేస్తుంది.
ఇంట్లో అమ్మ మనసు కుదేలైతే అమ్మ మాత్రమే సఫర్ అవుతుంది.కాని నాన్న మనసు బెదిరితే మొత్తం కుటుంబమే సఫర్ అవుతుంది.మెడిసిన్ పూర్తయ్యింది ఆ అమ్మాయికి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయ్యింది. హైదరాబాద్‌లో మంచి కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం వచ్చింది. కాని తనే ఒక ఏరియాలోని చిన్న హాస్పిటల్‌లో పనికి కుదిరింది. తక్కువ ఫీజ్‌తో పని చేయాలని నిశ్చయించుకుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు తన వైద్యం సహాయం కావాలని అభిలషించింది. అనుకున్నట్టుగానే పని చేయడం మొదలెట్టింది.మొదట కొంచెం పేరు వచ్చింది. తర్వాత మరికొంచెం పేరు వచ్చింది. సంబంధాలు రావడం మొదలెట్టాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ కుర్రాళ్లు చేసుకుంటామని వచ్చారు. కాని అందరికీ సమాధానం ఒక్కటే– పెళ్లి చేసుకోను అని.
తల్లి మాత్రమే ఉంది.తల్లికి ఆ అమ్మాయి మనసు ఎలా మార్చాలో అర్థం కాలేదు. రూపం, చదువు, యోగ్యత, ప్రాయం అన్నీ ఉన్నా ఎందుకు పెళ్లి చేసుకోవద్దనుకుంటోంది.‘మనం డాక్టర్ దగ్గరకు వెళదామమ్మా’ అంది కూతురితో ఒకరోజు.‘నేనే డాక్టరనమ్మా.
మళ్లీ డాక్టర్ ఎందుకు?’‘అది కాదమ్మ. మనసు చూసే డాక్టర్ ఉంటారు కదా. డాక్టర్‌కి కూడా మనసు రిపేరుకు రావచ్చు కదమ్మా’ అంది తల్లి.అతి కష్టం మీద ఆ అమ్మాయి సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చింది.గది ప్రశాంతంగా ఉంది.ఎదురుగా ఆ అమ్మాయి ఒక్కత్తే ఉంది. అమ్మాయికి ఎదురుగా సైకియాట్రిస్ట్.‘పెళ్లెందుకు వద్దనుకుంటున్నారు?’‘ఎందుకు డాక్టర్. పెళ్లిలో స్ట్రెస్ ఉంటుంది’‘ఎలాంటి స్ట్రెస్’‘అన్ని విధాల స్ట్రెస్. ముఖ్యంగా ఒక మగవాడితో కలిసి ఉండాల్సిన స్ట్రెస్’‘మగవాళ్లు మంచివాళ్లు కారా?’‘అసలు మనుషులే కారు. ఐ హేట్ మెన్’సైకియాట్రిస్ట్ తల పంకించాడు.ఈమెలో మగజాతి పట్ల ఇంత ద్వేషం పుట్టించిన మనిషి ఎవరు?‘ఇలా మీకు ఎవరిని చూస్తే అనిపించింది?’‘మా నాన్నను చూస్తే’‘ఆయన చెడ్డవాడా?’‘కాదు. చాలా మంచివాడు. మంచితనం అనే మూర్ఖత్వం మలచిన శాడిస్ట్’‘కాస్త వివరంగా చెబుతారా?’ఆ అమ్మాయి చెప్పడానికి సిద్ధమవుతూ ఎదురుగా ఉన్న గ్లాసులో నుంచి ఒక గుక్క మంచినీరు తాగింది.సూర్యనారాయణరావు ఉప్పల్‌లో ఒక వ్యాపారి. కూతురు ఇంటర్ బైపిసి చదువుతోంది.
భార్య ఇంట్లోనే ఉంటూ కూతురి ఆలనా పాలనా చూసుకునే గృహిణి. సూర్యనారాయణరావుకు ఆ ఏరియాలో మంచి పేరుంది. అడిగినవాడికి సాయం చేస్తాడనే పేరు. రోజూ ఎవరో ఒకరు ఆయన దగ్గరకు సాయానికి వచ్చేవారు. ఏదైనా కార్యక్రమం ఉంటే చందాకు వచ్చేవారు. సాహితీ సంఘాలు తమ కార్యక్రమంలో ఆయనకు అధ్యక్ష స్థానమో గౌరవ అతిథి స్థానమో ఇచ్చేవి. చుట్టూ నలుగురు మనుషులు ఉండేలా జీవించడమే మానవ జన్మ పరమార్థం అని నమ్మేవాడు. భార్య, కూతురు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో అతడికి పట్టదు. అయితే అంత మంచితనం కూడా ఎప్పుడూ పనికి రాదు. మేలిమి బంగారం కూడా ముతక లోహాలు జత పడకపోతే వీగిపోతుంది. సూర్యనారాయణరావుకు ఉన్న మంచి పేరు చూసి ఒకటి రెండు పార్టీలు ఆయనను లోకల్ ఎలక్షన్లలో పోటీ చేయమన్నాయి. ఆ ఆలోచనను తెచ్చి ఇంట్లో చెప్పాడు.
ఓకే అంటే ఏం సమస్యో కాదంటే ఏం సమస్యో అని ఇంట్లో భార్య ఏం చెప్పలేదు. కూతురు ఎదురు చెప్పే ధైర్యం చేయలేదు. సూర్యనారాయణరావు చాలా ఉత్సాహంతో పోటీలో పాల్గొన్నాడు. చుట్టూ ఉన్నవారు అతడి చేత బాగా ఖర్చు పెట్టించారు. ఇంత మంచి పేరుంది తప్పక గెలుస్తానన్న నమ్మకంతో అతడు ముందూ వెనుకా ఆలోచించకుండా ఖర్చుపెట్టాడు. అదసలే ఎత్తుకు పైఎత్తులేసే రంగం. అవేమీ తెలియని సూర్యనారాయణరావు ఎలక్షన్లలో ఓడిపోయాడు. ఘోరంగా ఓడిపోయాడు. అప్పులు వచ్చి పడ్డాయి. అవి అతణ్ణి బాధించలేదు. కాని అన్నాళ్లు చుట్టూ ఉన్న నలుగురు మనుషులు హటాత్తుగా మాయమయ్యారు. ఇలాంటి వాళ్ల కోసమా తాను ఇన్నాళ్లు సొంత డబ్బు ఖర్చు పెట్టింది... ఈ స్థితికి దిగజారింది. సూర్యనారాయణ రావు పూర్తిగా కూలబడ్డాడు. పరిస్థితి ఎలా ఉందంటే కూతురి చదువుకు ఫీజు కట్టే డబ్బు కూడా అతని వద్ద లేదు. సడన్‌గా సూర్యనారాయణరావు ఇంకో మనిషిలా మారాడు. రోజూ తాగి రావడం మొదలెట్టాడు. తప్పు చేసింది అతను. నష్టం తెచ్చింది అతను. కాని ఆ వాస్తవాన్ని అతడు భార్య మీద కుటుంబం మీద నెట్టడం మొదలెట్టాడు.
‘నన్నెందుకు మీరు ఆపలేదు. ఈ పనులకు డబ్బు వృధా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. ఈ తప్పు నాది కాదు. మీదే’ అని భార్య మీద, కూతురి మీదా రంకెలు వేయడం మొదలుపెట్టాడు.చాలా మంచి కుటుంబంగా ఉండేది అది.ప్రశాంతంగా ఉండేది.కాని ఇప్పుడూ అనుదినం అదొక అగ్నిగుండంగా మారింది. నరకంగా మారింది.కూతురు చదువు మీద శ్రద్ధ కోల్పోయింది. ఆ అమ్మాయి మంచి స్టూడెంట్. ఎలాగైనా మెడిసిన్ సీట్ వచ్చి తీరుతుంది... అంత ఇంటెలిజెంట్. కాని ఇప్పుడు తండ్రి చూపిస్తున్న నరకానికి కిందా మీదా అవుతోంది.భార్య లోపలలోపల నలిగిపోయే మనస్తత్వం ఉన్న మనిషి. కూతురి టర్మ్ ఫీజ్ కట్టలేని పరిస్థితి వచ్చేసరికి ఒకరోజు ఆమె డిప్రెషన్‌తో మంచం పట్టింది. అసలే దెబ్బతిని ఉన్న తండ్రికి ఈ విషయం ఇంకా పిచ్చెక్కించింది. అతడు నిజంగానే పిచ్చివాడయ్యాడు. తానేం చేస్తున్నాడో తనకే తెలియనిస్థితికి చేరుకున్నాడు.
కుమార్తె అతణ్ణి బంధువులతో కలిసి పిచ్చాస్పత్రిలో చేర్పించింది. అతడు అక్కడే ఉన్నాడు ఇన్నాళ్లుగా. ఆ కుమార్తె తల్లిని కాపాడుకుంది. తల్లి కోసం కష్టపడి చదువుకోగలిగింది. డాక్టర్ కాగలిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతుంటే పెళ్లితో మళ్లీ కష్టాల్లోకి వెళ్లాలా అని భయపడుతోంది. ‘ఇప్పుడు చెప్పండి డాక్టర్. నేను పెళ్లి చేసుకోవాలా? మా నాన్న ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నందుకు నాకు కోపం లేదు. కాని మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఆమెను అతను క్షోభ పెట్టాడు. ఆమెకంటూ ఏ సంతోషమూ లేకుండా చేశాడు. ఇది గుర్తుకు వచ్చిన ప్రతిసారీ నేను మా నాన్నను క్షమించలేకపోతున్నాను. మా నాన్నతో పాటు మొత్తం మగజాతిని క్షమించలేకపోతున్నాను. రేపు నా జీవితంలో వచ్చిన మగవాడు ఇంతే వరస్ట్‌గా బిహేవ్ చేయడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా?’ అందా అమ్మాయి.సైకియాట్రిస్ట్ చిన్న చిర్నవ్వుతో అన్నాడు–‘వచ్చేవాడు మీ నాన్నలాంటి మూర్ఖుడుగా ఉంటాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా. నువ్వు మెచ్చే మంచివాడుగా ఉండొచ్చుగా’ అన్నాడు.ఆ అమ్మాయి కళ్లెత్తి చూసింది.
‘చూడమ్మా. నువ్వూ డాక్టర్‌వే. కాని డాక్టర్‌లలో అందరూ బెస్ట్‌డాక్టర్సే ఉన్నారంటావా? వరస్ట్ డాక్టర్స్ లేరంటావా? నువ్వు మంచి సర్జన్‌వి కావచ్చు. అలాగని నువ్వు చేసే సర్జరీలన్నీ సక్సెస్ అవుతాయని గ్యారంటీ ఇవ్వగలవా? మనిషి జీవితమే సమస్యలతో నిండి ఉండేలా డిజైన్ చేయబడింది. ఫ్యామిలీ కూర్పులో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. కాని ఫ్యామిలీ ఉన్నదే ఆ సమస్యను హ్యాండిల్ చేసేందుకు. ఒక్కరుగా ఉంటూ జీవితాంతం సమస్యలను ఫేస్ చేయడం కంటే మనిషి ఫ్యామిలీగా మారి సమస్యను ఫేస్ చేయడమే బెటర్. నీకు మంచి భర్త దొరికితే మీరిద్దరూ మీ అమ్మను సపోర్ట్ చేసినవారవుతారు. మీరు ఓపిక పడితే మీ నాన్నకు పూర్తిగా నయమయ్యి ఇల్లు చేరవచ్చేమో.
నీ దారికి ఇరువైపులా ఒక లోయ ఒక కొండ ఉంటే లోయలోకి దిగడం ఎందుకమ్మా? కొండెక్కి ఎత్తులకు చేరుకుందాం అనుకోవచ్చు కదా. నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని కంటిన్యూ చేసే బదులు పాజిటివ్ థాట్స్ తెచ్చుకుని వాటిని కంటిన్యూ చేయవచ్చు కదా. రెంటికీ ఒకే ఎనర్జీ ఖర్చవుతుంది. కాని ఒకటి నిన్ను జబ్బున పడేస్తే మరొకటి జీవితాన్ని కల్పిస్తుంది. రేపు నువ్వు పేదవాళ్ల కోసం మంచి హాస్పిటల్ నడపాలనుకున్నప్పుడు జనరల్ ఫిజీషియన్ మీ ఆయనే ఎందుకు కాకూడదు? ఆలోచించు’...ఆ అమ్మాయి కన్విన్స్ అయినట్టే కనిపించింది.సైకియాట్రిస్ట్ ఆమెకు కొద్దిపాటి యాంటీ డిప్రెసెంట్స్ రాసి ఆ ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టాడు.ప్రిస్క్రిప్షన్‌తో వెళ్లిన ఆ అమ్మాయి త్వరలో శుభలేఖతో వస్తుందని అతడికి నమ్మకం అయితే ఉంది.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment