
మరచారో... చెరసాలే!
విడ్డూరం
సమాజానికి చెడు జరగకూడదని ప్రభుత్వాలు కొన్నింటి మీద నిషేధం విధిస్తుంటాయి. కొన్ని చట్టాలను రూపొందిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారిని శిక్షిస్తుంటాయి. అయితే ప్రపంచంలో కొన్ని విచిత్రమైన నియమాలు, చట్టాలు ఉన్నాయి. వాటి గురించి చదివితే... ఇవేం చట్టాలు అనిపిస్తుంది. వాటిలో ఇవి కొన్ని...
జపాన్‌లో విక్స్ ఇన్‌హేలర్ వాడకూడదు. ఎందుకంటే అందులో pseudoephedrine అనే పదార్థం ఉంటుంది. అది ఉన్న మందులేవీ జపాన్‌లో వాడకూదనే నియమం ఉంది.
ఫిజీ దేశంలో... పబ్లిక్ ప్లేసుల్లో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆడయినా, మగయినా సరే, ఒళ్లు కనిపించకూడదు. ఈత కొట్టేటప్పుడు కూడా కాస్త నిండుగా బట్టలు వేసుకోవాలి.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో పావురాలకు మేత వేయడం నేరం. పావురాలు ఆస్తులకు నష్టం కలిగించడమే కాక ఒక రకమైన వ్యాధిని కూడా ప్రబలేలా చేస్తాయని వాళ్లు అంటారు. పావురాలకు మేత వేసేవారిని పట్టించినవారికి అక్కడి పోలీసులు బహుమతులు కూడా ఇస్తుంటారు.
మాల్దీవులకు ఎవరూ బైబిల్ తీసుకెళ్లకూడదు. ఇస్లాం తప్ప మరే మత నీడ కూడా తమ దేశం మీద పడటానికి వాళ్లు ఒప్పుకోరు.
కజకిస్తాన్‌లో విమానాశ్రయాల్లో ఫొటోలు తీసుకోవడం నేరం. మిలిటరీ భవనాలను, ప్రభుత్వ కార్యాలయాలను ఫొటోలు తీసినా శిక్ష పడుతుంది.
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పబ్లిక్‌లో తిరగేటప్పుడు పద్ధతిగా ఉండాలి. కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు కుదరవు. చివరకు చేతులూ చేతులూ పట్టుకుని నడిచినా నేరమే. ఆ దేశస్థులనే కాదు... టూరిస్టులను కూడా వదలరు.
సింగపూర్లో రోడ్డు మీద సిగరెట్ వెలిగించినా, చూయింగ్ గమ్ నములుతూ కనిపించినా తిన్నగా జైలుకు పోవాల్సిందే.
బార్సిలోనాలో స్విమ్‌సూట్‌తో కనిపిస్తే అంతే సంగతులు. బీచుల్లో కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు.