చాన్ బుక్ | Mark Zuckerberg propose to Priscilla Chan! | Sakshi
Sakshi News home page

చాన్ బుక్

Published Mon, May 16 2016 2:03 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

చాన్ బుక్ - Sakshi

చాన్ బుక్

ఫేస్‌బుక్‌ని మర్చిపోండి. జుకర్‌బర్గ్‌నీ కాసేపు పక్కన పెట్టండి. చాన్‌బుక్ తెరవండి. ప్రిసిల్లా చాన్ జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలున్నాయి. ఆమె జుకర్‌బర్గ్ భార్య అయితే కావచ్చు. కానీ ఆమెకు ఆమెగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చాన్.. మానవత్వం మూర్తీభవించిన ఓ జీనియస్..
 
ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే ప్రిసిల్లా చాన్ కుటుంబంలో ఏటా మే నెలలో మూడు ముఖ్యమైన రోజులు వస్తాయి. మార్క్ జుకర్‌బర్గ్ పుట్టిన రోజు, స్టాక్ మార్కెట్‌లో ఫేస్‌బుక్ లాంచ్ అయిన రోజు, పెళ్లి రోజు. మొన్ననే... మే 14న మార్క్ బర్త్ డే అయింది. ఎల్లుండి... మే 18 ఫేస్‌బుక్ ‘స్టాక్’ డే. మర్నాడు... మే 19న చాన్, మార్క్‌ల మ్యారేజ్ డే.
 
అయితే ప్రత్యేకమైన ఈ మూడు రోజుల్లో ఆ ఇంట్లో మరీ అంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. ఎప్పటిలాగే మార్క్ తన లాప్‌టాప్ పట్టుకుని ఆఫీసుకు వెళ్లిపోతాడు. చాన్ స్టెతస్కోప్ మెడలో వేసుకుని ఆసుపత్రికి వెళ్లిపోతుంది. ఐదునెలల పసికందు మాక్స్ తన మూడ్‌ని బట్టి తన లోకంలో తను ఉంటుంది. అప్పుడప్పుడు ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి ‘గ్రాండ్‌మా’ లు, ‘గ్రాండ్‌పా’ లు వచ్చి వెళుతుంటారు. సాయంత్రం అంతా ఒకచోట కలుసుకున్నప్పుడు... అదే పెద్ద సెలబ్రేషన్. లక్షల కోట్ల రూపాయల నికర ఆస్తి కలిగి ఉన్న ఆ చిన్న ఇంట్లో... ఆ ఆస్తి కన్నా పై అంతస్థులో ఉన్నవి... కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతలు! వాటిని గాఢంగా పెనవేసి ఉంచుతున్న శక్తి... ప్రిసిల్లా చాన్.
 
తెల్లగౌనులో తొలి దర్శనం
ప్రిసిల్లా చాన్ అనే ఒక అమ్మాయి ఈ భూమండలం మీద ఉందన్న సంగతి సగం ప్రపంచానికి తెలిసిన రోజది. మిగతా సగం ప్రపంచానికి తెలియడానికి... ఆ తర్వాత పెద్దగా సమయం పట్టలేదు! ఆరోజు...  తెల్ల గౌనులో ఉన్న 27 ఏళ్ల ఆ యువతి ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ భార్యగా ఆయన పక్కన నిలుచుని దర్శనమివ్వగానే... ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. మార్క్ భార్య అనగానే అమెరికనే అయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చైనా అమ్మాయిలా ఉంది!! డెబ్బయ్‌లలో శరణార్థిగా అమెరికా వచ్చిన చైనా-వియత్నాం సంతతి తండ్రి కూతురు ఉంటే అలానే కదా ఉంటుంది.
 
చైనా అమ్మాయి అమెరికన్ కల
అమెరికా రాగానే డెన్నిస్ చాన్‌కు అర్థమైంది. తన పెద్ద కూతురు అమెరికన్ కల కంటోందని. ఆ కలను నిజం చెయ్యాలంటే రోజుకు కనీసం 18 గంటలు పని చెయ్యాలి తను. కొద్దిగా డబ్బు పోగవ్వగానే చైనీస్ రెస్టారెంట్ పెట్టాడు. కలల్ని నిజం చేసుకోవడం తేలికే... వాటి రెక్కల్ని కత్తిరించుకుంటే! కానీ ఆ తండ్రి తన కూతురు కంటున్న కలల రెక్కల్ని కత్తిరించలేదు. తన రెక్కల్ని ముక్కలు చేసుకున్నాడు. భార్య పై కూడా ఆ భారం పెట్టాడు. చాన్ తల్లి ఇవాన్... బోస్టన్‌లోని ‘టేస్ట్ ఆఫ్ ఏషియా’ రెస్టారెంట్‌లో, మరో చోట... రోజుకు రెండు షిఫ్టులు పనిచేసింది.

బోస్టన్ దగ్గరి క్విన్సీ పట్టణంలో ఉండేవాళ్లంతా ఇలాంటి కష్టజీవులే.  క్విన్సీ హైస్కూల్ అని అక్కడో గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులో 1200 మంది చదువుతున్నారు. వారిలో ఒకరు... డెన్నిస్, ఇవాన్‌ల ముద్దుల కూతురు ప్రిసిల్లా చాన్. హార్వర్డ్ యూనివర్శిటీలో చదవడం ఆ అమ్మాయి కల. కానీ క్విన్సీలాంటి సాధారణ పాఠశాలలో చదివితే అక్కడి వరకు వెళ్లలేరే! ఎలా?
 
తొలి రోజే.. టీచర్‌కు ప్రశ్న!
స్కూల్లో చేరిన మొదటి రోజే చాన్ అడిగిన ప్రశ్నకు పీటర్ స్వాన్‌సన్ అబ్బురంగా ఆమె వైపు చూశారు. ఆయన సైన్స్ టీచర్. టెన్నిస్ కోచ్ కూడా. ‘హార్వర్డ్ యూనివర్శిటీలో సీటు రావాలంటే నేనేం చేయాలి సార్’ - ఇదీ చాన్ ఆయన్ని అడిగిన ప్రశ్న. అప్పుడు ఆమె వయసు 13. స్వాన్‌సన్ చాలాసేపటి వరకు తేరుకోలేదు. అన్నేళ్ల సర్వీసులో ఎవరూ అలా అడగలేదట! అదీ ఆయన ఆశ్చర్యం. ఆ రోజు నుంచి చాన్‌ను యూనివర్శిటీకి పంపించే  ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. టెన్సిస్ నేర్పించాడు. చక్కటి ఇంగ్లిష్ నేర్పించాడు. సబ్జెక్టులు నేర్పించాడు. దరఖాస్తు ఎంత బలంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా చాన్‌ని అన్నిట్లోనూ ప్రవీణురాలిని చేశాడు.
 
అమ్మమ్మ ప్రభావం
స్వాన్‌సన్ తర్వాత చాన్ మీద అంతటి ప్రభావం చూపింది ఆమె అమ్మమ్మ. ఆమెకు ఇంగ్లిష్ రాదు. అమెకు అర్థం అవడం కోసం చాన్ దక్షిణ చైనా ప్రాంతీయ భాష కాంటనీస్‌ను నేర్చుకుంది. ఆ భాషలోనే ఆమెతో సంభాషించేది. చాన్‌కి అమ్మమ్మ అంటే ప్రాణం. ఆమె చెప్పే జానపద కథల్ని వింటూ ఆ అమ్మాయి పెరిగింది. అమ్మానాన్న రోజంతా పాటు పడుతుంటే, వాళ్ల కోసం ఎదురుచూస్తూ కునికిపాట్లు పడుతూ కూర్చుండిపోయే చాన్‌ని గుండెల్లోకి తీసుకునేది అమ్మమ్మ.
 
రోజులు గడుస్తున్నాయి. అమ్మానాన్న బయట కష్టపడి పనిచేస్తుంటే, చాన్ స్కూల్లో కష్టపడి చదువుతోంది. ఆ ఇంట్లో అందరి ధ్యేయం ఒక్కటే... ప్రిసిల్లా చాన్‌ను హార్వర్డ్‌కి పంపించడం. 2003లో క్విన్సీ హైస్కూల్ చదువు ముగించుకుని ‘స్కూల్ జీనియస్’గా బయటికి వచ్చి, హార్వర్డ్ గేటు ముందు నిలబడింది చాన్. ఆమె సర్టిఫికెట్స్ చూశాక యూనివ ర్శిటీ తలుపులు బార్లా తెరుచుని ఆహ్వానం పలికాయి.
 
జుకర్‌బర్గ్‌దే అదృష్టం
స్కూలు వీడ్కోలు వేడుకలో చాన్ తన మాస్టారికి గిఫ్టుగా వాళ్ల నాన్న నడిపే రెస్టారెంట్ నుంచి ఫ్రీ మీల్ టిక్కెట్స్ తెచ్చి ఇచ్చింది. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పేదరికంలోని ఆ ఆత్మగౌరవానికి ఆయన కదిలిపోయారు. చాన్‌లోని అణకువ, అథ్లెట్ కావాలని లేకపోయినా అర్హతలను పెంచుకోవడం కోసం ఆమె టెన్నిస్ క్లబ్‌లో చేరడం, హార్వర్డ్‌లో చేరాక మళ్లీ వచ్చి అందరికీ ‘నేను చెప్పానా సీటు సంపాదిస్తానని’ అని మనిషి మనిషికీ చెప్పడం...

ఇవన్నీ ఆమె తర్వాతి బ్యాచ్‌ల పిల్లలకు ఆయన తను స్కూల్లో ఉన్నంత కాలం కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. పెళ్లయిన కొత్తలో చాన్ వాళ్ల ఇంటికి వెళ్లారు స్వాన్‌సన్. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ప్రాంతంలో ఉంది చాన్ దంపతుల ఇల్లు. ఆయన వెళ్లే సరికి జుకర్‌బర్గ్ వంటింట్లో ఉన్నారు. కూరలు తరుగుతున్న భార్య పక్కనే కూర్చుని కంప్యూటర్‌లో తన పని తను చేసుకుంటున్నాడు. ‘‘అంతా... ప్రిసిల్లా చాన్ అదృష్టవంతురాలు అనుకుంటారు. నాకైతే జుకర్‌బర్గే అదృష్టవంతుడిలా అనిపిస్తాడు. చాన్ అమ్మానాన్న అమెరికా వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చారు. చాన్... సొంతకాళ్ల మీద నిలబడిన ఒక వ్యక్తిని పెళ్లాడింది. చాన్ జీవితం ఆదర్శవంతమైనది’’అని స్వాన్‌సన్ అంటుంటారు.    
 
ప్రిసిల్లా చాన్ W/o జుకర్‌బర్గ్
జన్మస్థలం    : బ్రెయిన్ ట్రీ (మాసచుసెట్స్, యు.ఎస్)
జన్మదినం    : 24 ఫిబ్రవరి 1985 (31)
తల్లిదండ్రులు    : డెన్నిస్, ఇవాన్
తోబుట్టువులు    : ఇద్దరు చెల్లెళ్లు
స్కూల్లో గుర్తింపు    : క్లాస్ జీనియస్
చదువు    : బయాలజీ డిగ్రీ (హార్వర్డ్)
           : ఎం.డి. (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా)
వృత్తి    : పిల్లల వైద్యం
ప్రవృత్తి    : దాతృత్వం
స్వజాతీయత    : ైచె నా
పౌరసత్వం    : అమెరికా
మాతృత్వం    : 1 డిసెంబర్ 2015 (కూతురు మాక్సిమా)
ప్రస్తుత నివాసం    : కాలిఫోర్నియా
 
చాన్ ప్రేమకథ
క్విన్సీ హైస్కూల్‌లో (మసాచుసెట్స్) చదువు పూర్తయ్యాక చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. అప్పుడు మొలకెత్తి, మహా వృక్షం అయిందే చాన్, జుకర్‌బర్గ్‌ల ప్రేమకథ.
 
ఇద్దరూ హార్వర్డ్‌లోనే చదువుతున్నారు. ఓ రోజు జుకర్‌బర్గ్, అతడి ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వెళ్లారు. అప్పటికి చాన్‌కి జుకర్‌బర్గ్ ఎవరో తెలీదు. పార్టీ అవుతుండగా వాష్ రూమ్ దగ్గర లైన్‌లో ఒకర్నొకరు చూసుకున్నారు. సహజంగానే చాన్ కన్నా ఎక్కువగా జుకర్‌బర్గే చూశాడు. అలా వారి మధ్య ప్రేమ అంకురించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే జుకర్‌బర్గ్ కాలేజ్ మానేసి ‘ఫేస్‌బుక్’ తెరిచాడు. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత వీళ్ల పెళ్లిపుస్తకం తెరుచుకుంది. 2012లో వివాహమైంది.
 
దాతృత్వ స్ఫూర్తి... చాన్
చాన్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మరి ఇన్నిన్ని బిలియన్ డాలర్ల విరాళాలను ఇవ్వడం ఎలా సాధ్యమయింది? పైగా తన విరాళాలన్నీ 2013 తర్వాత ప్రకటించినవే. అంటే ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ భార్య అయిన తర్వాత ఇచ్చినవి. ఇక చాన్ గొప్పతనం ఏముంది? ఉంది. ఇవ్వాలన్న తలంపు ఆ భర్తకు కలిగింది ఈ భార్య వల్లనే.

క్విన్సీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు... పేదరికం, నిరక్షరాస్యత... పిల్లల్ని ఎలా వీధి కొట్లాటకు పురికొల్పుతాయో, ఆ గొడవల్లో వారు ఎంత భయంకరమైన గాయాలకు గురవుతారో చాన్ ప్రత్యక్షంగా చూశారు. ‘‘రక్తం ఓడుతున్న ఆ పసివాడి ముఖాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ఇలాంటి వాళ్ల కోసం నేనేం చేయలేనా అని చాలాసార్లు మథనపడ్డాను’’ అని ఇటీవల ‘శాన్ జోస్ మెర్క్యురీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు చాన్. అందుకే ఆమె భర్త సహకారంతో ప్రధానంగా... విద్య, ఆరోగ్యం, సైన్స్ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ వివరాలు...

సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్    : 970 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6450 కోట్లు)
పబ్లిక్ స్కూళ్లు    : 120 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 798 కోట్లు)
శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్    : 75 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 499 కోట్లు)
కూతురు పుట్టిన సంతోషంలో ప్రకటించిన విరాళం : ఫేస్‌బుక్ షేర్‌ల విలువలో 99 శాతం!    
చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్    : 100 కోట్ల డాలర్లు (3 ఏళ్ల పాటు) సుమారు రూ. 6650 కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement