ప్రేమ కానుక
షాజహాన్‌కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్‌మహల్‌లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్‌నెట్ సెన్సేషన్‌గా మారాయి...
ఫేస్‌బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్‌కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్‌తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!
19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్‌లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్‌డోర్ వెడ్డింగ్‌లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.
జుకర్‌బర్గ్ చాన్‌కు ఇచ్చిన పేపర్‌లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.
ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్‌ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.
చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్‌కు ‘ఇన్‌స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్‌ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు జుకర్ బర్గ్.
టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్‌వర్క్‌ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.
ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్‌బర్గ్‌కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్‌లతో పోలుస్తూ జోక్‌లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
కన్నీళ్లు తుడిచే విగ్రహం
‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్‌కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్‌లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment