priscilla chan
-
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్‌కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్‌మహల్‌లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్‌కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్‌తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్‌డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్‌బర్గ్ చాన్‌కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్‌కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్‌ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్‌వర్క్‌ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్‌బర్గ్‌కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్‌లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్‌కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్
సాక్షి,ముంబై: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. లిటిల్ బ్లెస్సింగ్.. అరేలియా చాన్కి స్వాగతం అంటూ జుకర్ బర్గ్ ప్రకటించారు. దీంతో 1 మిలియన్‌కు పైగా లైక్స్ అభినందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) (ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) కాగా గతంలోనే తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్‌బర్గ్.. 2003 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట.ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. (జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) -
మార్క్ జుకర్‌బర్గ్ 'కక్కుర్తి' పని, వందల కోట్లకు ఇల్లు అమ్మకం!
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఇంటి కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేది లేక శానిఫ్రాన్సిస్కోలో ఉన్న తన ఇంటిని మెటా సీఈవో 31 మిలియన్ డాలర్లకు అమ్మినట్లు తెలుస్తోంది. 2012లో కొన్ని ఆ ఇల్లును అమ్మగా ఇప్పుడు అదనంగా 3 రెట్ల లాభం వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మార్క్ జుకర్‌బర్గ్‌కు శాన్ ఫ్రాన్సిస్కోలో అత్యంత ఖరీదైన నివాసం ఉంది. 1928లో 7వేల స్కైర్ ఫీట్లో ఆ ఇంటిని నిర్మిచగా..2012 నవంబర్‌లో సోషల్ మీడియా దిగ్గజం దానిని 10మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భార్యకు ప్రేమతో మే 18, 2012లో ఫేస్బుక్ ఐపీవోకి వెళ్లింది. కొన్ని నెలల తర్వాత జుకర్ బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌పై ప్రేమతో అతిపురాతనమైన ఆ ఇంటిని కొనుగోలు చేశారు. లాండ్రీ రూం, వైన్ రూం,వెట్ బార్, గ్రీన్‌తో ఆ ఇంటిని పునరుద్ధరించేందుకు మల్టీ మిలియన్డాలర్లు ఖర్చు చేశారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 10మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆ ఇంటిని కొనుగోలు చేసిన మార్క్ జుకర్‌బర్గ్‌పై స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో ఉన్న విస్తీర్ణం కంటే అదనంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 7,400 స్కైర్ ఫీట్లో ఇంటిని మోడిఫికేషన్ చేసిన జుకర్ బర్గ్..కార్ పార్కింగ్‌ను అక్రమంగా నిర్మించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జుకర్ బర్గ్ ఆ ఇంటిని అమ్మడం ఆసక్తికరంగా మారింది. -
జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్
శాన్ ఫ్రాన్సిస్కో: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వైఖరిపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వైఖరి చాలా విచారకరమైంది, అసహ్యకరమైందంటూ పేర్కొన్నారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడంలేదని ఇప్పటిదాకా సమర్ధించిన మార్క్ తాజాగా వివాదాస్పద పోస్టులపై మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ కు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించే స్పష్టమైన ప్రకటన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు సమాధానమిస్తూ తమ దేశ చరిత్రలో అసాధారణమైన, బాధాకరమైన ఇన్ఫ్లేషన్ సమయమని మార్క్ దంపతులు వ్యాఖ్యానించారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ చేసిన బాధాకరమైన వ్యాఖ్యలు తమను కదిలించాయని పేర్కొన్నారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఫేస్బుక్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ రెండూ వేర్వేరు సంస్థలని తెలిపారు. (ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!) అలాగే ట్రంప్ పోస్ట్ ను తొలగించకపోవడంపై స్పందిస్తూ సైన్యాన్ని మోహరిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే అలా ఉంచామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఫ్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి జుకర్ బర్గ్, చాన్ మద్దతు తెలపడం విశేషం. NEW — Mark Zuckerberg & Priscilla Chan have responded to the 270+ scientists at the @ChanZuckerberg Initiative who called on Zuckerberg to curb misinformation. Zuckerberg says he and Chan are "deeply shaken and disgusted by President Trump’s divisive and incendiary rhetoric." pic.twitter.com/j5ziU15Ik9 — Teddy Schleifer (@teddyschleifer) June 12, 2020 -
జుకర్‌బర్గ్ దంపతుల ఆసక్తికరమైన పోస్ట్
ఫేస్బుక్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ తన రెండవ బిడ్డ ఆగమనాన్ని సంతోషంగా షేర్ చేశారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా జకర్ బర్గ్ ప్రిస్కిల్లా దంపతులు తమ రెండవ కుమార్తె ఆగస్టుకు ప్రపంచానికి స్వాగతం పలికారు. 2015లో మొదటి బిడ్డ మాక్సిమా పుట్టినపుడు కూడా ఇలాగే ఆహ్వానించిన దంపతులు ఈసారి ఒక ఆసక్తికరమైన లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రియమైన ఆగస్ట్ ప్రపంచానికి స్వాగతం! భవిష్యత్తులో నువ్వు ఏమి కానున్నావోనని ఆతృతగా, సంతోషంగా ఎదురు చూస్తున్నామంటూ లేఖ మొదలు పెట్టారు. నీ సోదరి జన్మించినప్పుడు, మేం ఆశించిన ప్రపంచం గురించి ఒక లేఖ రాశాం.. కానీ ఇపుడు మీరు మంచి విద్య, తక్కువ వ్యాధులు, బలమైన సమాజాలు, మరియు సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగబోతున్నారన్నారు. బాల్యం జీవితంలో ఒక్కసారే వస్తుంది కనుక భవిష్యత్తు గురించి బెంగలేకుండా హాయిగా జీవించమని దీవించారు. అందుకే పెరగడం గురించి కాకుండా, బాల్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ప్రపంచం చాలా ప్రమాదకరమైన స్థలంగా ఉంది. అందుకే బయటికి వచ్చి హాయిగా ఆడుకోవాలి..దానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో యుగంలో అన్ని పురోగమనాలతో మీ తరం మాకంటే మెరుగైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఇది జరిగేలా చేసే బాధ్యత తమపై ఉందని ఈ జంట తమ లేఖ లో పేర్కొంది. నీ భవిష్యత్తుకోసం.. నీ తరానికి సంబంధించిన బాలలకోసం శక్తిమేరకు తాము చేయాల్సినంత చేస్తామంటూ లేఖలో పాపకు హామీ ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రుల్లాగే, తాము కూడా బుజ్జి పాపాయి అయిన నువ్వు హాయిగా ప్రశాంతంగా బొజ్జోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా మాక్స్ పుట్టిన దగ్గరినుంచి, పాపతో తాను గడిపిన విలువైన సమయం, ఆమె ఎదుగుదల, ఫస్ట్ స్విమ్ లాంటి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్‌లతో సందడి చేసిన సంగతి తెలిసిందే. బహుశా ఈ సారి ఇదే ధోరణిని కొనసాగించనున్నట్టే కనిపిస్తోంది. -
జోష్: తీపి కబురు చెప్పిన జుకర్ బర్గ్
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వారికి త్వరలో మరో బిడ్డ జన్మించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా జూకర్ బర్గ్ తన అధికారిక పేజీలో పేర్కొన్నారు. అయితే, తమకు మరో కూతురు పుట్టబోతోందని బర్గ్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే వారికే మ్యాక్స్ అనే ఓ పాప ఉంది. ఇప్పుడా పాపకు 15 నెలలు. ఆ సంతోషంలో నుంచే ఇప్పటి వరకు బయటపడని ఆ దంపతులు మరో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ‘మాకు మరో ఆడబిడ్డ పుట్టుబోతోందనే విషయం మీతో పంచుకోవడంపట్ల నేను, ప్రిస్కిల్లా చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా నవ శిశువుకు స్వాగతం చెప్పేందుకు మేం ఇక ఎంతమాత్రము ఎదురుచూడలేము. మరో శక్తిమంతమైన మహిళగా ఆమెను పెంచేందుకు మేం శాయాశక్తులా ప్రయత్నిస్తాం’ అంటూ జూకర్ తన పేజీలో చెప్పారు. తొలుత అసలు తమకు పిల్లలే పుట్టరని అనుకున్నామని, తన భార్యకు అంతకుముందు మూడు సార్లు గర్భస్రావం అయిందని, ఆ తర్వాతే మ్యాక్స్ జన్మించిందని, ఇప్పుడు మరో బేబీ రాబోతుందంటూ ఆయన సంతోషం పంచుకున్నారు. తమకు జన్మించబోయే రెండో కూతురు చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. -
చాన్ బుక్
ఫేస్‌బుక్‌ని మర్చిపోండి. జుకర్బర్గ్నీ కాసేపు పక్కన పెట్టండి. చాన్బుక్ తెరవండి. ప్రిసిల్లా చాన్ జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలున్నాయి. ఆమె జుకర్‌బర్గ్ భార్య అయితే కావచ్చు. కానీ ఆమెకు ఆమెగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చాన్.. మానవత్వం మూర్తీభవించిన ఓ జీనియస్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే ప్రిసిల్లా చాన్ కుటుంబంలో ఏటా మే నెలలో మూడు ముఖ్యమైన రోజులు వస్తాయి. మార్క్ జుకర్‌బర్గ్ పుట్టిన రోజు, స్టాక్ మార్కెట్లో ఫేస్బుక్ లాంచ్ అయిన రోజు, పెళ్లి రోజు. మొన్ననే... మే 14న మార్క్ బర్త్ డే అయింది. ఎల్లుండి... మే 18 ఫేస్బుక్ ‘స్టాక్’ డే. మర్నాడు... మే 19న చాన్, మార్క్‌ల మ్యారేజ్ డే. అయితే ప్రత్యేకమైన ఈ మూడు రోజుల్లో ఆ ఇంట్లో మరీ అంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. ఎప్పటిలాగే మార్క్ తన లాప్టాప్ పట్టుకుని ఆఫీసుకు వెళ్లిపోతాడు. చాన్ స్టెతస్కోప్ మెడలో వేసుకుని ఆసుపత్రికి వెళ్లిపోతుంది. ఐదునెలల పసికందు మాక్స్ తన మూడ్‌ని బట్టి తన లోకంలో తను ఉంటుంది. అప్పుడప్పుడు ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి ‘గ్రాండ్మా’ లు, ‘గ్రాండ్‌పా’ లు వచ్చి వెళుతుంటారు. సాయంత్రం అంతా ఒకచోట కలుసుకున్నప్పుడు... అదే పెద్ద సెలబ్రేషన్. లక్షల కోట్ల రూపాయల నికర ఆస్తి కలిగి ఉన్న ఆ చిన్న ఇంట్లో... ఆ ఆస్తి కన్నా పై అంతస్థులో ఉన్నవి... కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతలు! వాటిని గాఢంగా పెనవేసి ఉంచుతున్న శక్తి... ప్రిసిల్లా చాన్. తెల్లగౌనులో తొలి దర్శనం ప్రిసిల్లా చాన్ అనే ఒక అమ్మాయి ఈ భూమండలం మీద ఉందన్న సంగతి సగం ప్రపంచానికి తెలిసిన రోజది. మిగతా సగం ప్రపంచానికి తెలియడానికి... ఆ తర్వాత పెద్దగా సమయం పట్టలేదు! ఆరోజు... తెల్ల గౌనులో ఉన్న 27 ఏళ్ల ఆ యువతి ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ భార్యగా ఆయన పక్కన నిలుచుని దర్శనమివ్వగానే... ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. మార్క్ భార్య అనగానే అమెరికనే అయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చైనా అమ్మాయిలా ఉంది!! డెబ్బయ్‌లలో శరణార్థిగా అమెరికా వచ్చిన చైనా-వియత్నాం సంతతి తండ్రి కూతురు ఉంటే అలానే కదా ఉంటుంది. చైనా అమ్మాయి అమెరికన్ కల అమెరికా రాగానే డెన్నిస్ చాన్‌కు అర్థమైంది. తన పెద్ద కూతురు అమెరికన్ కల కంటోందని. ఆ కలను నిజం చెయ్యాలంటే రోజుకు కనీసం 18 గంటలు పని చెయ్యాలి తను. కొద్దిగా డబ్బు పోగవ్వగానే చైనీస్ రెస్టారెంట్ పెట్టాడు. కలల్ని నిజం చేసుకోవడం తేలికే... వాటి రెక్కల్ని కత్తిరించుకుంటే! కానీ ఆ తండ్రి తన కూతురు కంటున్న కలల రెక్కల్ని కత్తిరించలేదు. తన రెక్కల్ని ముక్కలు చేసుకున్నాడు. భార్య పై కూడా ఆ భారం పెట్టాడు. చాన్ తల్లి ఇవాన్... బోస్టన్లోని ‘టేస్ట్ ఆఫ్ ఏషియా’ రెస్టారెంట్లో, మరో చోట... రోజుకు రెండు షిఫ్టులు పనిచేసింది. బోస్టన్ దగ్గరి క్విన్సీ పట్టణంలో ఉండేవాళ్లంతా ఇలాంటి కష్టజీవులే. క్విన్సీ హైస్కూల్ అని అక్కడో గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులో 1200 మంది చదువుతున్నారు. వారిలో ఒకరు... డెన్నిస్, ఇవాన్ల ముద్దుల కూతురు ప్రిసిల్లా చాన్. హార్వర్డ్ యూనివర్శిటీలో చదవడం ఆ అమ్మాయి కల. కానీ క్విన్సీలాంటి సాధారణ పాఠశాలలో చదివితే అక్కడి వరకు వెళ్లలేరే! ఎలా? తొలి రోజే.. టీచర్‌కు ప్రశ్న! స్కూల్లో చేరిన మొదటి రోజే చాన్ అడిగిన ప్రశ్నకు పీటర్ స్వాన్సన్ అబ్బురంగా ఆమె వైపు చూశారు. ఆయన సైన్స్ టీచర్. టెన్నిస్ కోచ్ కూడా. ‘హార్వర్డ్ యూనివర్శిటీలో సీటు రావాలంటే నేనేం చేయాలి సార్’ - ఇదీ చాన్ ఆయన్ని అడిగిన ప్రశ్న. అప్పుడు ఆమె వయసు 13. స్వాన్సన్ చాలాసేపటి వరకు తేరుకోలేదు. అన్నేళ్ల సర్వీసులో ఎవరూ అలా అడగలేదట! అదీ ఆయన ఆశ్చర్యం. ఆ రోజు నుంచి చాన్‌ను యూనివర్శిటీకి పంపించే ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. టెన్సిస్ నేర్పించాడు. చక్కటి ఇంగ్లిష్ నేర్పించాడు. సబ్జెక్టులు నేర్పించాడు. దరఖాస్తు ఎంత బలంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా చాన్ని అన్నిట్లోనూ ప్రవీణురాలిని చేశాడు. అమ్మమ్మ ప్రభావం స్వాన్సన్ తర్వాత చాన్ మీద అంతటి ప్రభావం చూపింది ఆమె అమ్మమ్మ. ఆమెకు ఇంగ్లిష్ రాదు. అమెకు అర్థం అవడం కోసం చాన్ దక్షిణ చైనా ప్రాంతీయ భాష కాంటనీస్ను నేర్చుకుంది. ఆ భాషలోనే ఆమెతో సంభాషించేది. చాన్కి అమ్మమ్మ అంటే ప్రాణం. ఆమె చెప్పే జానపద కథల్ని వింటూ ఆ అమ్మాయి పెరిగింది. అమ్మానాన్న రోజంతా పాటు పడుతుంటే, వాళ్ల కోసం ఎదురుచూస్తూ కునికిపాట్లు పడుతూ కూర్చుండిపోయే చాన్ని గుండెల్లోకి తీసుకునేది అమ్మమ్మ. రోజులు గడుస్తున్నాయి. అమ్మానాన్న బయట కష్టపడి పనిచేస్తుంటే, చాన్ స్కూల్లో కష్టపడి చదువుతోంది. ఆ ఇంట్లో అందరి ధ్యేయం ఒక్కటే... ప్రిసిల్లా చాన్‌ను హార్వర్డ్‌కి పంపించడం. 2003లో క్విన్సీ హైస్కూల్ చదువు ముగించుకుని ‘స్కూల్ జీనియస్’గా బయటికి వచ్చి, హార్వర్డ్ గేటు ముందు నిలబడింది చాన్. ఆమె సర్టిఫికెట్స్ చూశాక యూనివ ర్శిటీ తలుపులు బార్లా తెరుచుని ఆహ్వానం పలికాయి. జుకర్‌బర్గ్‌దే అదృష్టం స్కూలు వీడ్కోలు వేడుకలో చాన్ తన మాస్టారికి గిఫ్టుగా వాళ్ల నాన్న నడిపే రెస్టారెంట్ నుంచి ఫ్రీ మీల్ టిక్కెట్స్ తెచ్చి ఇచ్చింది. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పేదరికంలోని ఆ ఆత్మగౌరవానికి ఆయన కదిలిపోయారు. చాన్లోని అణకువ, అథ్లెట్ కావాలని లేకపోయినా అర్హతలను పెంచుకోవడం కోసం ఆమె టెన్నిస్ క్లబ్లో చేరడం, హార్వర్డ్‌లో చేరాక మళ్లీ వచ్చి అందరికీ ‘నేను చెప్పానా సీటు సంపాదిస్తానని’ అని మనిషి మనిషికీ చెప్పడం... ఇవన్నీ ఆమె తర్వాతి బ్యాచ్‌ల పిల్లలకు ఆయన తను స్కూల్లో ఉన్నంత కాలం కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. పెళ్లయిన కొత్తలో చాన్ వాళ్ల ఇంటికి వెళ్లారు స్వాన్సన్. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ప్రాంతంలో ఉంది చాన్ దంపతుల ఇల్లు. ఆయన వెళ్లే సరికి జుకర్‌బర్గ్ వంటింట్లో ఉన్నారు. కూరలు తరుగుతున్న భార్య పక్కనే కూర్చుని కంప్యూటర్లో తన పని తను చేసుకుంటున్నాడు. ‘‘అంతా... ప్రిసిల్లా చాన్ అదృష్టవంతురాలు అనుకుంటారు. నాకైతే జుకర్‌బర్గే అదృష్టవంతుడిలా అనిపిస్తాడు. చాన్ అమ్మానాన్న అమెరికా వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చారు. చాన్... సొంతకాళ్ల మీద నిలబడిన ఒక వ్యక్తిని పెళ్లాడింది. చాన్ జీవితం ఆదర్శవంతమైనది’’అని స్వాన్సన్ అంటుంటారు. ప్రిసిల్లా చాన్ W/o జుకర్‌బర్గ్ జన్మస్థలం : బ్రెయిన్ ట్రీ (మాసచుసెట్స్, యు.ఎస్) జన్మదినం : 24 ఫిబ్రవరి 1985 (31) తల్లిదండ్రులు : డెన్నిస్, ఇవాన్ తోబుట్టువులు : ఇద్దరు చెల్లెళ్లు స్కూల్లో గుర్తింపు : క్లాస్ జీనియస్ చదువు : బయాలజీ డిగ్రీ (హార్వర్డ్) : ఎం.డి. (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా) వృత్తి : పిల్లల వైద్యం ప్రవృత్తి : దాతృత్వం స్వజాతీయత : ైచె నా పౌరసత్వం : అమెరికా మాతృత్వం : 1 డిసెంబర్ 2015 (కూతురు మాక్సిమా) ప్రస్తుత నివాసం : కాలిఫోర్నియా చాన్ ప్రేమకథ క్విన్సీ హైస్కూల్లో (మసాచుసెట్స్) చదువు పూర్తయ్యాక చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. అప్పుడు మొలకెత్తి, మహా వృక్షం అయిందే చాన్, జుకర్‌బర్గ్‌ల ప్రేమకథ. ఇద్దరూ హార్వర్డ్‌లోనే చదువుతున్నారు. ఓ రోజు జుకర్‌బర్గ్, అతడి ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వెళ్లారు. అప్పటికి చాన్కి జుకర్‌బర్గ్ ఎవరో తెలీదు. పార్టీ అవుతుండగా వాష్ రూమ్ దగ్గర లైన్లో ఒకర్నొకరు చూసుకున్నారు. సహజంగానే చాన్ కన్నా ఎక్కువగా జుకర్‌బర్గే చూశాడు. అలా వారి మధ్య ప్రేమ అంకురించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే జుకర్‌బర్గ్ కాలేజ్ మానేసి ‘ఫేస్బుక్’ తెరిచాడు. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత వీళ్ల పెళ్లిపుస్తకం తెరుచుకుంది. 2012లో వివాహమైంది. దాతృత్వ స్ఫూర్తి... చాన్ చాన్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మరి ఇన్నిన్ని బిలియన్ డాలర్ల విరాళాలను ఇవ్వడం ఎలా సాధ్యమయింది? పైగా తన విరాళాలన్నీ 2013 తర్వాత ప్రకటించినవే. అంటే ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ భార్య అయిన తర్వాత ఇచ్చినవి. ఇక చాన్ గొప్పతనం ఏముంది? ఉంది. ఇవ్వాలన్న తలంపు ఆ భర్తకు కలిగింది ఈ భార్య వల్లనే. క్విన్సీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు... పేదరికం, నిరక్షరాస్యత... పిల్లల్ని ఎలా వీధి కొట్లాటకు పురికొల్పుతాయో, ఆ గొడవల్లో వారు ఎంత భయంకరమైన గాయాలకు గురవుతారో చాన్ ప్రత్యక్షంగా చూశారు. ‘‘రక్తం ఓడుతున్న ఆ పసివాడి ముఖాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ఇలాంటి వాళ్ల కోసం నేనేం చేయలేనా అని చాలాసార్లు మథనపడ్డాను’’ అని ఇటీవల ‘శాన్ జోస్ మెర్క్యురీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు చాన్. అందుకే ఆమె భర్త సహకారంతో ప్రధానంగా... విద్య, ఆరోగ్యం, సైన్స్ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ వివరాలు... సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్ : 970 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6450 కోట్లు) పబ్లిక్ స్కూళ్లు : 120 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 798 కోట్లు) శాన్ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ : 75 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 499 కోట్లు) కూతురు పుట్టిన సంతోషంలో ప్రకటించిన విరాళం : ఫేస్బుక్ షేర్ల విలువలో 99 శాతం! చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ : 100 కోట్ల డాలర్లు (3 ఏళ్ల పాటు) సుమారు రూ. 6650 కోట్లు -
నాన్న కుట్టిగా ఆ చిట్టితల్లి!
భూమి మీదకు అడుగుపెడుతూనే 46 బిలియన్ డాలర్ల సంపదకు వారసురాలైంది ఆ చిట్టితల్లి. తన రాకను ఘనంగా స్వాగతిస్తూ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల కోసం రూ. 3 లక్షల కోట్లు విరాళంగా ఇచ్చాడు ఆమె తండ్రి. ఔను! మనం మాట్లాడుకోబోతున్నది మాక్సిమా చాన్ జూకర్బర్గ్ గురించే. ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ నుంచి రెండు నెలలు పెటర్నటీ సెలవు తీసుకున్న జుకర్‌బర్గ్ తన చిట్టితల్లి మాక్సిమాతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆమె కూడా 'నాన్నకుట్టి'లా మారిపోయినట్టే కనిపిస్తున్నది. తన కూతురిని తొలిసారిగా తాకిన మధురానుభూతిని ఫొటోల ద్వారా జుకర్‌బర్గ్ మంగళవారం ఫేస్బుక్లో పంచుకున్నాడు. ఓ సాధారణ తండ్రిలాగా తన చిన్నారి పక్కన కార్పెట్ మీద పడుకొని ఆమెను చూసి మురిసిపోతున్న ఫొటోను ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడైన జుకర్ బర్గ్ పంచుకొన్నారు. ఈ ఫొటోకు వేలసంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అభిమానుల కామెంట్లకు సమాధానమిచ్చిన జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్, కూతురు మాక్సిమా చాలాబాగా ఉన్నారని తెలిపారు. ఈ ఫొటోతోపాటు కామెడీ హనుక్కా దుస్తుల్లో 'బీస్ట్' అనే బుజ్జికుక్క ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఫేస్బుక్ లో కొందరు అభిమానులు జుక్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పెట్ మీద కాకుండా ఓ దుప్పటి పరిచి అందులో చిన్నారిని పడుకోబెట్టాలని, లేకుంటే అశుభ్రత, జెమ్స్ కారణంగా చిన్నారికి ఏమైనా హాని జరుగవచ్చునని సున్నితంగా సలహాలు ఇచ్చారు. శిశువుల సంరక్షణ, పరిశుభ్రత అంశాలపై చర్చించారు. మొత్తానికి ఈ పోస్టు జుకర్‌బర్గ్ గత పోస్టుల మాదిరిగానే ఫేస్బుక్ లో హల్ చల్ చేస్తోంది. -
'మాకు పాపే పుడుతుంది.. ఈసారి కలిసొస్తుంది'
న్యూయార్క్ : తనకు పాప పుడుతుందని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్బర్గ ఆశాభావ్యక్తం చేశారు. తన భార్యతో దిగిన ఓ ఫొటో అప్ లోడ్ చేసి ఈ విషయాన్ని ఫేస్ బుక్ వెబ్సైట్లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. పోస్ట్ చేసిన 9 గంటల్లోపే లక్షమందికి పైగా యూజర్లు లైక్ కొట్టగా, 70 వేల మంది కామెంట్ చేశారు. ఈ పోస్టు 28 వేల సార్లు షేర్లు చేశారని తెలిపారు. తన భార్య ప్రిస్సిల్లా చాన్ కూడా తమ ఇంట్లోకి వచ్చేది పాపే అని అనుకుంటుందన్నారు. ఇక ఇప్పటి నుంచి తమ పిల్లల కోసం, తర్వాతి తరాల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్యను కలవడానికి వెళ్లినప్పడు చాలా ఉద్వేగానికి లోనయినట్లు జూకర్బర్గ్ తన సైట్లో రాసుకొచ్చారు. పిల్లల విషయంలో ఈ దంపతులు గతంలో మూడుసార్లు నిరాశకు గురైన విషయం తెలిసిందే. సమస్యలు వచ్చినప్పుడు తమ మధ్య బంధం మరింత బలపడుతుందని.. ప్రేమ మరింత ఎక్కువవుతుందని ఆయన పోస్టు చేశాడు. ఈసారైనా తమ ఆశలు ఫలించవచ్చని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమ జీవితంలో నూతన అధ్యాయం మొదలైనట్లేనని, గతంతో పోలిస్తే ఈ సారి తన భార్య, కడుపులో బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.