జుకర్‌బర్గ్ దంపతుల ఆసక్తికరమైన పోస్ట్
ఫేస్బుక్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ తన రెండవ బిడ్డ ఆగమనాన్ని సంతోషంగా షేర్ చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా జకర్ బర్గ్ ప్రిస్కిల్లా దంపతులు తమ రెండవ కుమార్తె ఆగస్టుకు ప్రపంచానికి స్వాగతం పలికారు. 2015లో మొదటి బిడ్డ మాక్సిమా పుట్టినపుడు కూడా ఇలాగే ఆహ్వానించిన దంపతులు ఈసారి ఒక ఆసక్తికరమైన లేఖను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ప్రియమైన ఆగస్ట్ ప్రపంచానికి స్వాగతం! భవిష్యత్తులో నువ్వు ఏమి కానున్నావోనని ఆతృతగా, సంతోషంగా ఎదురు చూస్తున్నామంటూ లేఖ మొదలు పెట్టారు. నీ సోదరి జన్మించినప్పుడు, మేం ఆశించిన ప్రపంచం గురించి ఒక లేఖ రాశాం.. కానీ ఇపుడు మీరు మంచి విద్య, తక్కువ వ్యాధులు, బలమైన సమాజాలు, మరియు సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగబోతున్నారన్నారు. బాల్యం జీవితంలో ఒక్కసారే వస్తుంది కనుక భవిష్యత్తు గురించి బెంగలేకుండా హాయిగా జీవించమని దీవించారు. అందుకే పెరగడం గురించి కాకుండా, బాల్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ప్రపంచం చాలా ప్రమాదకరమైన స్థలంగా ఉంది. అందుకే బయటికి వచ్చి హాయిగా ఆడుకోవాలి..దానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో యుగంలో అన్ని పురోగమనాలతో మీ తరం మాకంటే మెరుగైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఇది జరిగేలా చేసే బాధ్యత తమపై ఉందని ఈ జంట తమ లేఖ లో పేర్కొంది. నీ భవిష్యత్తుకోసం.. నీ తరానికి సంబంధించిన బాలలకోసం శక్తిమేరకు తాము చేయాల్సినంత చేస్తామంటూ లేఖలో పాపకు హామీ ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రుల్లాగే, తాము కూడా బుజ్జి పాపాయి అయిన నువ్వు హాయిగా ప్రశాంతంగా బొజ్జోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా మాక్స్ పుట్టిన దగ్గరినుంచి, పాపతో తాను గడిపిన విలువైన సమయం, ఆమె ఎదుగుదల, ఫస్ట్ స్విమ్ లాంటి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్‌లతో సందడి చేసిన సంగతి తెలిసిందే. బహుశా ఈ సారి ఇదే ధోరణిని కొనసాగించనున్నట్టే కనిపిస్తోంది.