జోష్: తీపి కబురు చెప్పిన జుకర్ బర్గ్
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వారికి త్వరలో మరో బిడ్డ జన్మించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా జూకర్ బర్గ్ తన అధికారిక పేజీలో పేర్కొన్నారు. అయితే, తమకు మరో కూతురు పుట్టబోతోందని బర్గ్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే వారికే మ్యాక్స్ అనే ఓ పాప ఉంది. ఇప్పుడా పాపకు 15 నెలలు. ఆ సంతోషంలో నుంచే ఇప్పటి వరకు బయటపడని ఆ దంపతులు మరో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
‘మాకు మరో ఆడబిడ్డ పుట్టుబోతోందనే విషయం మీతో పంచుకోవడంపట్ల నేను, ప్రిస్కిల్లా చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా నవ శిశువుకు స్వాగతం చెప్పేందుకు మేం ఇక ఎంతమాత్రము ఎదురుచూడలేము. మరో శక్తిమంతమైన మహిళగా ఆమెను పెంచేందుకు మేం శాయాశక్తులా ప్రయత్నిస్తాం’ అంటూ జూకర్ తన పేజీలో చెప్పారు. తొలుత అసలు తమకు పిల్లలే పుట్టరని అనుకున్నామని, తన భార్యకు అంతకుముందు మూడు సార్లు గర్భస్రావం అయిందని, ఆ తర్వాతే మ్యాక్స్ జన్మించిందని, ఇప్పుడు మరో బేబీ రాబోతుందంటూ ఆయన సంతోషం పంచుకున్నారు. తమకు జన్మించబోయే రెండో కూతురు చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.