
గాయాలపాలైన మార్జాల మేయర్
ఆ మార్జాలం గత పదహారేళ్లుగా అలాస్కా పట్టణానికి ఆనరరీ మేయర్‌గా ఉంది. అలాంటిది మొన్నీమధ్య... కుక్కకాట్లు తిని చావుతప్పి కన్నులొట్టబోయినంత పనై, కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఇంతకీ... మార్జాలమేంటీ, మేయర్‌గా ఉండటమేంటీ? పాశ్చాత్యదేశాలలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు గనక స్థానికులకు నచ్చకపోతే వారు పాలుతాగే పసివారి దగ్గరనుంచి పశుపక్ష్యాదుల వరకు... ఎవరికైనా సరే ఓటేసి గెలిపించే సంప్రదాయం ఉంది.
అలా గెలిచిన పసివారికి లేదా పశువులు, పక్షులు, జంతువులకు గౌరవ బాధ్యతలు కట్టబెట్టి, ఆ స్థానంలో ప్రజలందరూ కలిసి తమను తామే పాలించుకుంటారన్నమాట. ఆ కోవలో పదహారేళ్లక్రితం ఎన్నికైనవారే మన మార్జాల మేయరుగారు. అప్పట్లో అన్ని పత్రికల్లోనూ పతాక వార్తల్లోకెక్కింది కూడా.
అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాని పెత్తనాన్ని సహించలేని జాతివిరోధి అయిన ఓ ఊరకుక్కకు మేయర్‌గారు ఒంటరిగా దొరికారు. దాంతో అది కసితీరా కరవడంతో గాయాలతో రోడ్డుమీద పడిపోయింది. అటుగా వెళుతున్న స్థానికులెవరో చూసి, దానిని మేయర్‌గా గుర్తించి పశువులాస్పత్రిలో చేర్పించారు.
పశువైద్యులు నానాతంటాలుపడి నాలుగైదు గంటలపాటు శ్రమించి, దాని ఒంటికి, ఊపిరితిత్తులకు అయిన గాయాలకు ఆపరేషన్లు చేసి, ఎలాగో బతికించారు. దాంతో కాస్త కోలుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఇలా ఫోజులిచ్చి మళ్లీ పేపర్లకెక్కింది మేయర్ మార్జాలం.