ఇండియన్ టెలివిజన్ సిరీస్‌లో మెగా బడ్జెట్ ఫాంటసీ సీరియల్ గురించి చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా చంద్రకాంతనే గుర్తు చేసుకోవాలి. ఈ సీరియల్ సృష్టికర్త, రచయిత, నిర్మాత, దర్శకుడు నీర్జా గులేరీ బుల్లితెర మీద ఓ మెగా మాయను సృష్టించారు. మంత్ర తంత్ర విద్యలను కళ్లకు కట్టారు. రాజులు–రాజ్యాల మధ్య జరిగిన యుద్ధ హోరుతో ప్రేక్షకులను కట్టడి చేశారు. ఈ మెగా సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కథనం హోరు
‘చంద్రకాంత’ ఓ ఊహాజనిత ప్రేమ కథనం. విజయ్‌గఢ్ యువరాణి చంద్రకాంత. అపూర్వ సౌందర్యరాశి. అసామాన్యమైన తెలివితేటలు. రూపంలోనూ, వ్యక్తిత్వంలోనూ దేశదేశాల్లో ఆమె పేరు మార్మోగుతుంటుంది. నవ్‌గఢ్ రాజు వీరేంద్రసింగ్ చంద్రకాంతను ప్రేమిస్తాడు. విజయగఢ్‌కు పొరుగుననే ఉన్న చునాడ్‌గఢ్ రాజు శివదత్తుడూ చంద్రకాంతను మోహిస్తాడు. ఒక రాణి కోసం ఈ రెండు ప్రత్యర్థి రాజ్యాల రాజుల మధ్య జరిగిన ప్రేమ పోరాటం కథనమే చంద్రకాంత సీరియల్.
కట్టడి చేసే మాయోపాయాలు
యువరాణి చంద్రకాంత ఉన్న విజయగఢ్ కోటలోనే క్రూర్‌సింగ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకొని, రాజ్య కిరీటం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. అయితే, పొరుగున ఉన్న చునాడ్‌గఢ్ రాజు శివదత్తు శక్తివంతమైన రాజు కావడంతో తన పాచికలు పారవని గ్రహించి, అతనికి నమ్మిన బంటుగా మారిపోతాడు. క్రూర్‌సింగ్ మాయోపాయాలు పన్ని చంద్రకాంతను శివదత్తుని చేత బంధించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. శివదత్తుడి మాయోపాయాలు, మంత్రతంత్రాలతో చంద్రకాంతను బందీ చేస్తాడు. అతని బందిఖానా నుంచి బయటపడి, పారిపోతున్న చంద్రకాంత్‌ను గుర్తించి శివదత్తకు సమాచారం చేరవేస్తాడు క్రూర్‌సింగ్. విషయమంతా తెలుసుకున్న వీరేంద్రసింగ్ అయ్యర్ల (గూఢచారులు+సైనికులు) సాయంతో శివదత్తతో పోరాడుతాడు.
ఈ కథనం అంతా చంద్రకాంత అపహరణ, ఆమెను కాపాడటం.. వంటివాటితో నడుస్తుంది. చంద్రకాంతను ట్రాప్ చేయడానికి మాయలు, మంత్రవిద్యలు ప్రయోగించడం... వాటిని రాజు వీరేంద్ర తిప్పికొట్టే విధానాలతో నడుస్తుంది. శివదత్తుని మాయోపాయాలన్నీ వీరేంద్ర కనిపెట్టి, వాటిని తిప్పి కొట్టడంతో శివదత్తుడు వెనక్కి తగ్గుతాడు. ఈ పోరాటంలో శివదత్తు తన చునాడ్‌గడ్ కోటని వదులుకొని వెనుతిరగాల్సి వస్తుంది. వీరేంద్రసింగ్ చంద్రకాంతను పెళ్లి చేసుకొని విజయ్‌గఢ్‌ను, తన రాజ్యమైన నవగఢ్‌ను, శివదత్తుని రాజ్యమైన చునాడ్‌గఢ్‌ను కూడా సొంతం చేసుకొని పరిపాలిస్తుంటాడు.
దీంతో విధిలేక శివగఢ్ నుంచి పరిపాలన కొనసాగిస్తుంటాడు శివదత్తు. అంతటితో ఊరుకోకుండా వీరేంద్రసింగ్, చంద్రకాంతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. శివదత్తు పాలనా వ్యవహారాలను చూస్తున్న పండిట్ జగన్నాథ్ చునాడ్‌గఢ్‌ని, చంద్రకాంతను ఎలా కైవసం చేసుకోవాలో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంటాడు. అనుచరులు క్రూర్‌సింగ్, అహ్మద్, నజిమ్‌లు వీరేంద్రసింగ్ మీద ప్రతీకారం తీర్చుకోమని శివదత్తుని ప్రేరేపిస్తుంటారు. వీరేంద్రసింగ్‌ను చంపి చంద్రకాంతను పెళ్లి చేసుకోవడానికి శివదత్తే కాదు క్రూర్‌సింగ్ కూడా ప్రయత్నిస్తుంటాడు.
మూలకథకు చాలా దూరం
‘చంద్రకాంత’ నవల నుంచి స్టోరీ లైన్‌ని తీసుకున్నప్పటికీ నవలకి– సీరియల్‌కి పూర్తి భిన్నంగా నడుస్తుంది కథనం. ఈ సీరియల్ ఎన్నో కొత్త కొత్త పాత్రలను పరిచయం చేసింది. చంద్రకాంత మూల కథ రచయిత దేవకి నందన్ ఖత్రీ. ఇతను హిందీ భాషలో మొదటి తరానికి చెందిన ప్రసిద్ధ రచయిత. ఇతను మిస్టరీ నావలిస్ట్‌గా కూడా ప్రసిద్ధి. చంద్రకాంత సీరియల్‌ను 1994 నుంచి 1996 వరకు 130 ఎపిసోడ్లను దూరదర్శన్ ప్రసారం చేసింది. ఈ సీరియల్ నిర్మాత, దర్శకులు నిర్జా గులేరీ, సునీల్ అగ్నిహోత్రి. ఈ సీరియల్ ఒకదశలో వివాదాస్పదం కావడంతో పునః ప్రసారానికి నిర్మాతలు సుప్రీమ్‌కోర్టులో దావా వేశారు. దీంతో 1999లో చంద్రకాంత సీరియల్‌ని తిరిగి ప్రసారం చేశారు.
ఇతర టీవీలలో
ఆ తర్వాత స్టార్ ప్లస్, సోనీ టెలివిజన్‌లలోనూ చంద్రకాంత సీరియల్ ప్రసారమైంది. ‘కహానీ చంద్రకాంతకి’ సీరియల్ 2011లో సహారా ఒన్‌లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘చంద్రకాంత సంతతి’ పేరుతో దర్శకులు సునిల్ అగ్నిహోత్రి సీరియల్‌గా తీశారు. ఇది దేవకీ నందన్ ఖత్రీ నవలకు అసలు సిసలు రూపం. అయితే, ‘చంద్రకాంత సంతతి’ కథకి, టీవీ సీరియల్ ‘కహానీ చంద్రకాంత’కి చాలా భిన్న సారుప్యాలు ఉన్నాయి. 2017లో స్టార్ భారత్ ‘ప్రేమ్ యా పహేలీ –చంద్రకాంత’ అని మళ్లీ ఈ కథను పరిచయం చేసింది. ఏక్తాకపూర్ తీసిన ‘చంద్రకాంత’ సీరియల్ కలర్స్ టీవీ ప్రసారం చేసింది.
విమర్శనాస్త్రాలు
నవలా రచయిత దేవకీ నందన్ ఖత్రీ మనవడు కమలపతి ఖత్రీ ‘చంద్రకాంత’ సీరియల్‌కి దర్శకుడు నీర్జాగులేరి న్యాయం చేయలేదని విమర్శించాడు. నవలలోని చిట్టడవి, గూఢచర్యం, మంత్రవిద్యలు వంటి ప్రధానాంశాల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. చునాగఢ్ కోటలోని పాత్రలు, వరసలను విమర్శిస్తూ అతిశయోక్తిగా ఉందని, అసలు చంద్రకాంతకు ఎంతోదూరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఒక ప్రేమ కథకు రూపాలు ఎన్నో
‘చంద్రకాంత’ స్టోరీలైన్ ఒకటే అయినా ఆ తర్వాత రకరకాల రూపాలను నింపుకున్న నవలలు ఎన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి చంద్రకాంత – వీరేంద్రసింగ్ పిల్లల సాహసకృత్యాలతో కూడిన సిరీస్.
సినిమా విరమణ
ప్రముఖ సినీ నిర్మాత విధు వినోద చోప్రా ‘చంద్రకాంత’ని సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లను ప్రధాన పాత్రలుగా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు రామ్‌మద్‌వని ఓకే అనుకున్నారు. కానీ, చివరకు చంద్రకాంత సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది.
– ఎన్.ఆర్
వీరేంద్ర–చంద్రకాంత
వీరేంద్రసింగ్‌గా మెప్పించిన నటుడు షహబజ్‌ఖాన్. చంద్రకాంతతో పాటు బేతాల్ పచ్చీసి, యుగ్, ది స్వరోద్ టిప్పు సుల్తాన్.. వంటి వాటిలో నటించి ప్రఖ్యాతి చెందాడు. 2018లో చైనీస్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘డైయింగ్ టు సర్వైవ్’లో నటించాడు. చంద్రకాంత హీరోయిన్ షిఖా స్వరూప్. 1988 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ విజేత షిఖా. మోడల్, బాడ్మింటన్ ప్లేయర్ కూడా. టీవీ సీరియల్స్‌లోనే కాకుండా దాదాపు 11 సినిమాలో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు షిఖా.
Comments
Please login to add a commentAdd a comment