మెటల్ డిటెక్టర్
షాపింగ్ మాళ్లు మొదలుకొని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, సినిమాహాళ్లు ఇలా ఎక్కడికెళ్లినా కనిపించేవి మెటల్ డిటెక్టర్లు. జేబుల్లో ఎలాంటి లోహమున్నా సరే... డిటెక్టర్ దగ్గరగా వెళ్లే చాలు... అది కుయ్‌కుయ్ మని అరిచేస్తుంది? ఒంటిపై ఉండే లోహపు ఆనవాలును ఆ పరికరం ఎలా గుర్తిస్తుంది? అని మనలో చాలామంది అనుకునే ఉంటాం. ఇదిగో సమాధానం. ఏ మెటల్ డిటెక్టర్‌లోనైనా ట్రాన్స్‌మిటర్, రిసీవర్ కాయిల్స్ అని రెండు తీగచుట్టలు ఉంటాయి. ట్రాన్స్‌మిటర్ కాయిల్ గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు తీగచుట్ట పరిసరాల్లో ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
మన శరీరంపై లేదా బ్యాగుల్లో ఉండే లోహం ఈ అయస్కాంత క్షేత్రానికి స్పందిస్తుంది. ఎడ్డీ కరెంట్స్ ప్రవాహం వల్ల ఆ లోహపు వస్తువు చుట్టూ మరో బలహీనమైన క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్షేత్రాన్ని రిసీవర్ కాయిల్ గుర్తిస్తుంది. ప్రసారమైన అయస్కాంత క్షేత్రం తీవ్రతకు, అందుకున్న దానికి మధ్య ఉండే తేడా అధారంగా మెటల్ డిటెక్టర్ కూతపెడుతుందన్నమాట. 1881లో అమెరికా అధ్యక్షుడు జేమ్స్ గార్‌ఫీల్డ్ హత్యకు గురైనప్పుడు అతడి శరీరంలో ఉన్న బుల్లెట్‌ను గుర్తించేందుకు అలెగ్జాండర్ గ్రాహం బెల్ (టెలిఫోన్ ఆవిష్కర్త) తొలిసారి మెటల్ డిటెక్టర్‌ను వాడినట్లు చరిత్ర చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే... 1930 ప్రాంతంలో ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ మెటల్ డిటెక్టర్ టెక్నాలజీని ప్రయాణ మార్గాన్ని, దిశను తెలిపే సాధనంగా ఉపయోగించారు. అయితే రాళ్లు ఇతర అడ్డంకులు ఉన్నచోట ఈ పరికరం సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించిన ఫిషర్ ఆ పరికరంతో లోహపు ఆనవాళ్లను గుర్తించవచ్చునని తెలుసుకున్నారు. అప్పటి నుంచి మెటల్ డిటెక్టర్‌గా వాడటం మొదలుపెట్టారు.
హౌ ఇట్ వర్క్స్