టేస్ట్... | Metro stories | Sakshi
Sakshi News home page

టేస్ట్...

Published Sat, Aug 29 2015 10:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

టేస్ట్... - Sakshi

టేస్ట్...

 మెట్రో  కథలు
 
ఇంతకుముందు ఇది తెలియదు. రెండు టికెట్లు బుక్ చేసి తెచ్చేవాడు. థియేటర్‌లో ముందు నడుస్తూ తీసుకెళ్లేవాడు. సీట్లను వెతికాక నంబర్లు ఏవైనా సరే మొదట కూచుని కుడివైపు కూచోపెట్టుకునేవాడు. కుడిచేతిని హ్యాండ్‌రెస్ట్ మీద పెట్టుకుని మీసాలు గిల్లుకుంటూ సినిమా చూట్టం ఇష్టమట. ఎడమ చేతి మీద బరువు పెట్టి సినిమా చూడటం తనకూ ఇష్టమేనే. అడగడానికి లేదు. అందుకే పుర్రచేతి వాటం వాళ్లను చేసుకోవద్దంటారు అని పెద్దగా నవ్వుతాడు. ఇదేమైనా జోకా?

అలవాటు లేని ప్యాంట్‌ను పైకి సర్దుకుంది. అలవాటు లేని చొక్కాను కిందకు లాక్కుంది. మచ్చల చొక్కా. బాగుంది. కాని కొంచెం పొట్టిది. ఉన్న డబ్బులకు అదే వచ్చింది. వెనుక వైపు ఎవరైనా మిర్రిమిర్రి చూస్తున్నారా? చూస్తే చూడనీ. టైమ్ చూసుకుంది. ఒకటిన్నర. గురువారం దిగుల్లేదు. రెండున్నరా మూడు వరకూ కూడా మంచి భోజనం దొరుకుతుంది. అమీర్‌పేట్ నుంచి కూకట్‌పల్లి ఎంత దూరమని? బస్సెక్కింది. ఫుల్లుగానే ఉంది. అయినా ఇబ్బంది లేనట్టే. ఈ మధ్య ఆడవాళ్ల సీట్లకూ మగవాళ్ల సీట్లకూ మధ్య గేట్లు పెట్టారు. లేకుంటే తమ దేహంలో ఈ ప్రాంతం ఒకటుంది అని తెలియని చోట కూడా చేతులు వేసేస్తారు. కూచుంటే మరీ ఘోరం. ముఖానికి ఎదురుగా  నిలుచోవడమే. లేదా భుజాన రెస్ట్ చేస్తారు. ఇక చావండి.

బాబా గుడి వచ్చింది. అర్చకుడు గత వారమే పరిచయం అయ్యాడు. ప్రతివారం వస్తాను స్వామీ అంటే అయ్యో అదేం భాగ్యం తల్లీ... తప్పకుండా రా అన్నాడు. కూటికి గతి లేనట్టుగా సాగే అన్నదానం కాదు అది. అందరూ కలిసి భక్తిగా చేసే భోజనం. ఇవాళ వంకాయ చేశారు. పప్పు ఉంది. సాంబారు సరే. అదనంగా గులాబ్ జామూన్ కూడా ఉంది. కప్పులో రెండు మూడు జామూన్‌లు వేసుకొని పాకం ఒంపుకుని గుచ్చి గుచ్చి తినడం టైమ్ వేస్టు అనుకుని ఒకటి అమాంతం బుగ్గలో పెట్టుకుంటూ ఉంటే మొబైల్ మోగింది. ఇంకెవరు? మొగుడే.

ఎక్కడా?
గు...గ...వ...మ...
ఏదో మెక్కుతున్నట్టున్నావ్.
అ...గు...బ...గు...
పెట్టేశాడు.
 
పెళ్లయిన కొత్తలో మూడు నెలలపాటు ఢిల్లీకి తీసుకెళ్లలేదు. ఇక్కడ కష్టం గుంటూర్లో అమ్మావాళ్ల దగ్గరే ఉండు వచ్చిపోతుంటాను అన్నాడు. వచ్చి పోయేటట్టయితే మీ అమ్మవాళ్ల దగ్గర ఎందుకు మా అమ్మవాళ్ల దగ్గరే ఉంటాను అంది. దెబ్బకు దారికొచ్చాడు. కాపురానికి తీసుకెళ్లాక కూడా మొదటి వారంరోజులు చేతిముద్ద తింటేనా?  అమ్మ ఇచ్చిన పొడులు, అమ్మ ఇచ్చిన పచ్చళ్లు, అమ్మ నేర్పించిన చారు... ముక్కల పులుసు..
.
 అదేంటి?
 కొన్నాళ్లు ఆగు. అలవాటు పడాలి గదా. పైగా నీది పుర్రచేతి వాటం. నాకు కక్కొస్తుంది.
 ఒరే గాడిదా. మొదటిరోజు రాత్రి పుర్రచేతివాటం అని దూరం పెట్టావట్రా... మనసులో అనుకుంది.
 ఆ తర్వాత మొదలు. ఏది చేసినా పేర్లు. అది నచ్చలేదు. ఇది నచ్చలేదు. ఈ కూర నీ నెత్తిన గుమ్మరించుకో. మా అమ్మై ఇలా చేసేదా.

అసలు మా ఇంట్లో అయితే...
 వినీ వినీ తిండి మీదే వికారం వచ్చేసింది. కాని దేనికదే దారి. వేవిళ్లతో వచ్చే వికారం కూడా వచ్చింది. పాప పుట్టింది. అది చండీరాణి. మూడేళ్లకే ఆటలు మాటలు పాటలతో అల్లరి అల్లరి చేసేస్తుంటే దానికి ఇంకా ఏవేవో నేర్పించుకుందామనుకుంటే నేర్పించనిస్తేనా? మీ అమ్మకేం తెలుసే... చిమిడి పోకుండా అన్నం వండటం కూడా రాదు. నేను నేర్పిస్తా రా... అని ప్రతి దానికీ తీసిపడేయడమే. దానికేం గౌరవం ఉంటుంది? ఐదేళ్లు వచ్చేసరికి హైదరాబాద్‌కు కాపురం మారాక అసలు ఇక్కడ కూడా కాదు... గుంటూరు పంపించేద్దాం... మా అమ్మ అన్నీ నేర్పించుకుంటుంది... మా నాన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్... పులిలా దారిలో పెడతాడు... వాళ్లకు మాత్రం ఎవరున్నారు... ఇదే కదా కాలక్షేపం అన్నాడు. హ్యాండ్‌రెస్ట్‌నే అడగలేదు.

 కూతుర్ని మాత్రం ఏం అడుగుతుంది?
 మూడేళ్లు గడిచిపోయాయి. ఏం చేయడానికి లేదు. ఇంకొకరు వద్దట. సాకలేడట. పోనీ ఏదైనా సరదా ఉందా? ఊళ్లో ఉన్నా కదలనివ్వడు. క్యాంపులకెళ్లినా కదలనివ్వడు. ఇంట్లో ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. ఆ కాసింత హాల్లో...  ఆ కాసింత బెడ్‌రూమ్‌లో... మరీ ముఖ్యంగా ఆ కాసింత వంటగదిలో. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేస్తాడు.
 ఒకటే ఒక ప్రశ్న - ఏం వండుతున్నావ్?చెప్తుంది. అది తప్ప ఇంకా ఏవో నాలుగు చెప్తాడు. ఆ రోజు గుర్తుంది. పిరియడ్స్ మొదలయ్యేలా ఉన్నాయి. కడుపులో నొప్పిగా ఉంటే పడుకుని ఉంది. చేశాడు. అదే ప్రశ్న-ఏం వండుతున్నావ్? నీ పిండాకూడు. ఆ సాయంత్రమే ఇంట్లో నుంచి బయటికొచ్చేసింది. ఎలా బతుకుతావే? ఎలాగోలా.ఎక్కడ ఉంటావ్? ఎక్కడో ఒకచోట. గ్యాస్ కూడా నా పేరుమీదే ఉంది. మర్చిపోకు. ఏం వండుకుని తింటావ్? అసలు నేను వంటే చేయను.
సంస్కృతం తెలియడం అచ్చొచ్చింది. ఏదో ఒక టైమ్‌లో రెండు క్లాసులు చెప్పు. నెలకు ఎనిమిది దాకా ఇస్తాను అంది తెలిసినావిడ జూనియర్ కాలేజీలో.ఎనిమిది అంటే పర్లేదు. హాస్టల్‌లో చేరకపోతే మేనేజ్ చేయొచ్చు. పిల్లలు ఎదిగొచ్చి అమెరికా వెళ్లి సంపాదన పంపితే సుఖంగా స్థిరపడి మనిషి కోసం ముఖం వాచిపోయిన కొంపలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒకదానిలో రెండు మూడు వేలకే మంచి గది దొరికింది. ఇంకా ఐదుంటాయి. ఏం ఖర్చు ఉంటుంది? దేవుడే కదా దారి చూపింది. ఒకరోజు మనసు బాగోక దగ్గరలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్‌కు వెళితే శనగలు, వడ, పెసర హల్వా పెట్టారు. కడుపు నిండిపోయింది. పూజారిని అడిగితే ఓ... ఇలాంటివి చాలా ఉన్నాయ్ అన్నాడు. కొంచెం ఆచూకీ తీస్తే అవును చాలానే ఉన్నాయి. బాబోయ్. ఇన్నా. ఇక అక్కణ్నించి గుళ్లు, గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు... సరుకులు తెచ్చుకునే టైము, కూరగాయలు తెచ్చుకునే టైము, సర్దుకునే టైము, పొయ్యి దగ్గర నిలబడి వండుకునే టైము, అంట్లు తోముకునే టైము... అన్నీ లెక్క వేసి ఆ టైమ్‌లో ఒక మెట్రో పాస్ కొనుక్కుని బస్‌లో కూలబడితే సరిపోతుంది కదా అనిపించింది. ఒక గుడిలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్... ఒక ఆలయంలో భోజనం... రాత్రికి మరో సన్నిధిలో అల్పాహారం.సిటీ మనిషిని వదిలేసి దేవుణ్ని పట్టుకుంది. తను వంటను వదిలేసి ప్రసాదాన్ని పట్టుకుంది. మూడు గులాబ్‌జాములు చాల్లేదు. నాలుగోది వేసుకొని మళ్లీ అమాంతం బుగ్గన పెట్టుకుంటుంటే ఫోన్. ఇంటికి ఎప్పుడొస్తావ్?
 గు...గ...క...ఖ...
 ఇంకేమీ అనను.
 ఖొ..వో...గ..గో...
 రావా?
 వూ.. వే.. ఓ... ఓ..
 పెట్టేశాడు.
 చేతులు కడుక్కుంది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement