మెట్రో కథలు | Metro stories | Sakshi
Sakshi News home page

మెట్రో కథలు

Published Sun, Oct 11 2015 12:58 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

మెట్రో  కథలు - Sakshi

మెట్రో కథలు

సండే మార్నింగ్...
 
అలిగి పడుకుని ఉంది.ఏడుస్తూ ఉన్నాడు. మధ్యలో నాకొచ్చింది చావు అనుకున్నాడు. పదయ్యింది. మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చాడు. చేపలు అంటే చేపలు కాదు. ఒక్కటే వచ్చింది. కిలోంపావు. నూట నలభై ఇచ్చి మళ్లీ శుభ్రం చేసిచ్చినందుకు పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాస్త కరివేపాకు వేసి వీలుంటే మామిడికాయ తగిలించి కూర చేస్తే అందాక పేపర్ చదువుకుంటూ సండే మేగజీన్స్ తిరగేస్తూ టివీలో ఏదైనా ఉంటే చూస్తూ తిని పడుకుని సాయంత్రం సినిమాకు తీసుకెళదామనుకుంటే ఈ రచ్చ మొదలు. ఎందుకనో ఈ మధ్య ఆదివారం వస్తే చాలు భయమేస్తూ ఉంది. ఇద్దరికీ కుదిరేది ఆ ఒక్కరోజే. తక్కిన అన్ని రోజులూ ఆఫీసుకు వెళ్లిపోగా వాడు స్కూల్‌కు వెళ్లిపోగా ముగ్గురూ కలిసి ఉండేది ఆ ఒక్కరోజే. ఆ రోజైనా సరదాగా ఉందామంటే ఏదో ఒకటి నస.
 
పోయిన ఆదివారం బీరువా తెరిచి చీరలన్నీ చూపించింది. చూడండి... ఇందులో ఒక్కటైనా ఫంక్షన్స్‌కు కట్టుకెళ్లేదిగా ఉందేమో చూడండి అంది. చీరలకు తీసుకెళితే జాకెట్లు ఇవ్వడానికి దర్జీ దగ్గరకు తీసుకెళ్లలేదని అదో అలక. అదంతా అయితే దాపున ఉండే అంగళ్లలో కూరగాయలు మండిపోతున్నాయనీ రైతుబజార్‌కు వెళ్లి వారానికి సరిపడా ఒకేసారి తెస్తే బాగుంటుందనీ...

 ఇవాళ బాల్‌ది వచ్చింది. దానికి గాలి తగ్గిపోయి మూలన పడేసి ఉన్నాడు. సాధారణంగా ఆడడు. ఇవాళ ఉదయం నుంచి గాలి కొట్టించమని అడుగుతున్నాడు. కింద ఆడుకుంటాడట. నువ్వూ రా నాన్నా అనంటే సరే అని బాల్‌కి గాలి కొట్టించి ఆడుకుందామని బయలుదేరబోయాడు. ధడేలున వచ్చి అడ్డం నిలబడి మెయిన్ డోర్ గ్రిల్ వేసి వీల్లేదు అని హూంకరించింది.
 
అదేంటి?
అదంతే. ఇవాళ మీరుంటారు. రేపటి నుంచి ఎవరుంటారు? వాడు కిందకెళితే ఎవరు కాపలా? అక్కర్లేదు కూచోండి. కోపం నషాళానికి అంటింది. అరె... పిల్లవాడు సండేపూట ఏదో ఆడుకుందామంటే వద్దంటుందేంటి. వెళితే ఏమవుతుంది? రెట్టించాడు.
 నాకు తెలుసు. నేను ఏమన్నా దానికి వ్యతిరేకం చేస్తారు. వాడి ముందు నన్ను పలుచన చేస్తారు... ఏడుస్తూ కూచుంది. ఆదివారం అంతా సర్వనాశనం. అమ్మ వద్దన్నందుకు... ఎందుకు వద్దంటుందో అర్థం కాక  ఏడుపు ముఖం పెట్టాడు. దేవుడా.

 ఎందుకు రాద్ధాంతం చేస్తావు?
రాద్ధాంతమా? మీకు తెలియదా... వీడేం ఆడతాడో మీకు తెలియదా? ఎంత ఆడే వీలుందో మీకు తెలియదా?
 సోఫాలో కూలబడ్డాడు. ఇక కిందకు వెళ్లడం జరగని పని. ఏడుస్తూ  బెడ్‌రూమ్‌లోకి వెళ్లబోతుంటే లేచి సెల్ ఇచ్చింది.దీన్తో ఆడుకోరా... ఇదే నీకు గతి... దీన్తోనే చావు... ఏం చేస్తాం ఖర్మ... వెళ్లి పడుకుంది. ఇక్కడ చేరినప్పటి నుంచి చెప్తూనే ఉంది. ఇల్లు మారదామని. మారే కదా ఇక్కడకు వచ్చింది. ఇంతకు ముందు ఉన్న ఇల్లు చీకటిగా ఉండేది. పైగా చేరినప్పటి నుంచి ఉద్యోగంలో ఏవో ఒక గొడవలు. ఆరోగ్య సమస్యలు. ఇక్కడకు మారాకే అన్నీ సర్దుకున్నాయి. ఎవరో తెలిసినాయన వచ్చి వాస్తుపరంగా పర్‌ఫెక్ట్.... ఓనర్ గెంటితే తప్ప ఖాళీ చేయొద్దు అని చెప్పేసి వెళ్లాడు. మంచిదే. కాని ఈ సమస్య ఒకటి వచ్చిందే. ఆ రోజు ఆఫీసు నుంచి వచ్చే సరికి కణత దగ్గర పసుపూ పౌడర్ రాసుకుని ఉన్నాడు. సోఫా మీద గెంతాడట. మొన తగిలిందట. కొంచెం నెత్తురు కూడా వచ్చిందట. వంట చేయకుండా ఒళ్లో కూచోపెట్టుకుని ఉంది. ఆడే వీలు లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు అంది కళ్లు తుడుచుకుంటూ. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది. ఆ తర్వాత వంట పని ఎలాగూ ఉంటుంది. ఒక్కడే కిందకు పోతానంటే పంపదు. అలాగని ఇంట్లో అల్లరి చేస్తే సహించలేదు. ఒక్కోసారి దెబ్బలు తగిలించుకుంటాడు. ఇంకోసారి తనే నాలుగు బాదుతుంది.పోనీ పక్క ఫ్లాట్ వాళ్ల దగ్గరికైనా పంపవచ్చు కదా... ఆడుకొని వస్తాడు కదా? వాళ్లెందుకు పెట్టుకుంటారు? వాళ్ల పిల్లలను ఎక్కడకు తరుముదామా అని చూస్తుంటారు... అది నిజమే. ఆలోచిస్తే తామెలా పెరిగామా అని ఇద్దరికీ ఆశ్చర్యమే. ఇద్దరూ నలుగురు పిల్లల జనరేషన్ నుంచి వచ్చినవాళ్లే. నలుగురు పిల్లలకు అమ్మ అన్నం అయితే పెట్టుంటుంది కాని సాకింది మాత్రం తలా ఒకరు. పక్కింటి వాళ్లు... మేనత్తలు... బాబాయ్‌లు... అమ్మమ్మ... పొద్దున లేచి బయటికెళితే మళ్లీ అన్నం టైమ్‌కి తప్ప ఎవరూ గుర్తొచ్చేవారు కాదు. ఇప్పుడు అలా ఎక్కడా?
 
నయం మగపిల్లాడయ్యాడు. ఆడపిల్ల అయితే అయిదు నిమిషాలు కూడా వదిలే వీలుండదు. ఉద్యోగానికి వెళ్లే ధైర్యం కూడా చేసుండేదాన్ని కాదు అంటుంది. మళ్లీ- మగపిల్లాణ్ణి కూడా పంపే వీల్లేదంట లేండి... ఇవాళ రేపు మగపిల్లల్ని కూడా నాశనం పట్టిస్తున్నారట. ఎవర్ని నమ్మగలం అంటుంది. ఏమిటి విరుగుడు? పాత ఫ్లాట్ కృష్ణకాంత్ పార్క్ దగ్గరగా ఉండేది. ఆదివారం ఆదివారం తప్పనిసరిగా తీసుకెళ్లేవారు. శక్తి కొద్దీ పరిగెత్తేవాడు. శక్తి కొద్దీ కింద దొర్లేవాడు. శక్తి కొద్దీ అన్నీ ఆడి మరో వారం దాకా అక్కర్లేనట్టుగా అలసిపోయేవాడు. ఇప్పుడు కుకట్‌పల్లి వైపు వచ్చారు. ఒక్క పార్కు లేదు. అసలు పార్కు ఒక అవసరమని భావిస్తున్నట్టుగా కూడా లేదు. పార్కు ఒక హక్కు అనే మాట చాలా పెద్దది. ఈ అపార్ట్‌మెంట్ రోడ్డు మీదే ఉంది. బయటకు రావడానికి లేదు. ట్రాఫిక్. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆడదామంటే బిల్డర్ కక్కుర్తి పడి వాచ్‌మెన్ రూమ్ కాకుండా ఇంకో రెండు గదులు కట్టి అమ్మేశాడు. కార్లు స్కూటర్ల పార్కింగ్‌కే స్థలం లేదు. వాటి మధ్య ఆడాలంటే ఏ కారు ఎక్కేస్తుందో అని భయం.

కిందకెళతానమ్మా అని ఎంత ఏడ్చినా పంపదు. సరే కారిడార్‌లో ఆడతాను అంటాడు. కారిడారా అది? స్లమ్‌లో కూడా అంత ఇరుకు దారులు ఉండవు. ఇంటి ముందు రెండు కుండీలు పెట్టుకుంటే చెప్పుల స్టాండ్ పెట్టుకుంటే ఒక మనిషి నడిచే వీలే ఉంటుంది. ఇంకో మనిషి ఎదురు వస్తే ఆగి పక్కకు వాలి... పిల్లలందరికీ సైకిళ్లు ఉన్నాయి. అన్నీ ఫ్లాట్ల బయట పడి ఉంటాయి. ఎవరూ తొక్కరు. తొక్కే వీలు కూడా లేదు. ఒకవేళ తొక్కినా తగాదాలు. బాల్ డోర్‌కు తగిలిందని చాలా స్నేహంగా ఉండే మనిషే- ఫోర్ నాట్ టూ ఆమె- భయంకరంగా తగాదాకి వచ్చింది. ఇంకొక ఆమె బాల్ దాచేసింది. దాని బదులు సెల్ దోసిట్లో పడేస్తే మేలు కదా అని అదొకటి నేర్చుకుంది. సర్లే. వదిలెయ్. వంట చేయరాదా?... జవాబు చెప్పలేదు. నిన్నే.

 నాకు విసుగ్గా ఉందండీ...
 సెకండ్ చైల్డ్ కావాలనుకుంటే తనే వద్దన్నాడు. అదొక అసంతృప్తి ఉంది. ఒక్కణ్ణి సక్రమంగా పెంచగలిగితే చాలు... మన సంపాదనకు అదే గొప్ప అన్నాడు. ఈ మధ్య అది గుర్తు చేస్తోంది. ఇంకొకరిని కనుంటే తోడుగా ఆడుకునేవాడు కదా. ఒంటరిగా మిగిలేవాడు కాదు కదా.
 చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదట. పెళ్లైన కొత్తల్లో చెప్తుండేది. జామకాయలు కోసేదట. నేరేడు పండ్లు రాల్చేదట. పక్కనే చిట్టడవి ఉంటే స్నేహితురాళ్లతో రేగుపండ్ల కోసం వెళ్లేదట. తేగలు తవ్వేదట. చేలల్లో ఆటలు... తోటల్లో పరుగులు... నా కడుపున పుట్టినవాడు ఇలా మిగిలాడు అని ఏడుస్తుంది. ఏం చెప్పగలడు.

 ఖాళీ స్థలాలు లేవు. ఉన్నా గోడలు కట్టి కాపలా పెడతారు. స్కూళ్లల్లో ఆడిస్తారా అంటే అవి జైళ్ల కంటే ఘోరం. ఫ్లాట్ల పరిస్థితి ఇదీ. పిల్లలతో సంతోషం అంటారు. పిల్లలు సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండటానికి. చేపలు ఫ్రిజ్‌లో పెట్టాడు. గదిలోకి చూస్తే ముఖం డిజప్పాయింటెడ్‌గా పెట్టి సెల్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకో గదిలో మాట పలుకూ లేని అలక. మధ్యాహ్నానికి దరిద్రమైన పార్శిల్ భోజనం తప్పేలా లేదు. మళ్లీ సోఫాలో కూలబడ్డాడు.ఎదురుగా టీపాయ్ మీద న్యూస్‌పేపర్ కనిపిస్తూ ఉంది.

ఆకాశ హర్మ్యాలు కడతారట. ఏవేవో స్థలాలు ఎవరెవరికో ధారపోస్తారట. పిల్లలకు గుప్పెడు స్థలం ఇస్తామని ఎవరూ అనడం లేదే.
 దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడన్న నమ్మకం లేదు. కాని పిల్లలు ఆడుకునే వీలున్న నగరం కోసం ప్రశాంతమైన ఆదివారపు ఉదయాల కోసం ముడుపు కట్టాలని మాత్రం అనిపించింది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement