కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చెయ్యాలని ప్రయత్నించిన ఒక తల్లిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిజమే, ఆమె ఆ ప్రయత్నం చేసింది’ అని నిర్ధారణ అయ్యాక కోర్టు ఆమెకు నాలుగున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. ‘బలవంతంగా పెళ్లి చేయడం నేరం’ అని బ్రిటన్ తొలిసారిగా 2014లో ఒక చట్టం చేసింది. ఆ చట్టం కింద కేసు నమోదై, శిక్ష పడిన తొలి కేసు ఈ మాతృమూర్తిదే.
అయితే ఆమె ఒకసారి ఈ నేరాన్ని చేయలేదు. రెండుసార్లు చేసింది. తల్లీకూతుళ్లు బర్మింగ్‌హామ్‌లో ఉండేవారు. ఐదేళ్ల క్రితం తన పదమూడేళ్ల కూతుర్ని పాకిస్తాన్ తీసుకెళ్లింది ఆ తల్లి. అక్కడ, పదహారేళ్లు పెద్దవాడైన వరుడితో కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి జరిపించింది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో భర్త వదిలేశాడు. తిరిగి కూతుర్ని బ్రిటన్ తీసుకొచ్చి గర్భస్రావం చేయించింది.
ఇటీవల కూతురి 18వ పుట్టిన రోజుకు కొన్నాళ్ల ముందు ‘ఫ్యామిలీ హాలిడే’ అని చెప్పి కూతుర్ని పాకిస్తాన్ తీసుకెళ్లింది. అక్కడ మళ్లీ ఇంకొకరికిచ్చి కట్టబెట్టడానికి సిద్ధపడినప్పుడు చుట్టుపక్కలవాళ్లు ఆ అమ్మాయిని కాపాడి, తల్లిని పోలీసులకు అప్పగించారు. ఇండియాలోనూ ఇలాంటి తల్లులు ఉన్నారు కానీ, ఇంత బలంగా చట్టాలు అమలు కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment