మదర్ మధు | Mother madhu | Sakshi
Sakshi News home page

మదర్ మధు

Published Mon, Dec 29 2014 10:52 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

మదర్ మధు - Sakshi

మదర్ మధు

తల్లిదండ్రులే వద్దనుకున్నవారు కొందరైతే... విధి ఆడిన నాటకంలో అనాథలైన వారు మరికొందరు. వారికి ఇపుడొక అమ్మ ఆసరా దొరికింది. అమ్మ కాని ఆ అమ్మ మధు టుగ్నైడ్! బుద్ధిమాంద్యం, శారీరకవైకల్యం ఉన్న పదకొండు మంది చిన్నారులను దత్తత తీసుకొని కంటిపాపలా చూసుకుంటున్నారామె. వారికోసం నగర రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవకు ఆనుకొని ‘ఇచ్ఛ’ ఆశ్రమం నిర్మించారు. ఈ ప్రస్థానంలో ఆమె ప్రారంభపుటడుగులు, ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే...
 
‘‘మా స్వస్థలం ఢిల్లీ. నాన్న మిలట్రీ ఉద్యోగి. నేను పెరిగిందంతా ముంబైలోనే. నా భర్త టుగ్నైడ్ నేవీలో కమాండర్. ఆయనకు 1987లో ముంబై నుంచి కోచికి, అక్కడి నుంచి 1989లో వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. బీచ్‌రోడ్డులోనే మా ఫ్లాట్. మా అబ్బాయి రోహిత్ ఎంటీవీలో ఉద్యోగి. పెళ్లి చేసుకొని ఢిల్లీలోనే ఉంటున్నాడు. టుగ్నైడ్ కూడా రిటైర్ అయ్యాక డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో కన్సెల్టెంట్‌గా హాల్దియాలో పనిచేస్తున్నారు.
 
ఆ నవ్వే నడిపించింది...
ఓ ఇద్దరు అనాథలనైనా దత్తత తీసుకోవాలని ఇరవై ఏళ్ల క్రితమే అనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా అపుడు వెనక్కుత గ్గవలసి వచ్చింది. తర్వాత కొంతకాలం ఫ్యాషన్ డిజైనర్‌గా వైజాగ్ సిరిపురం జంక్షన్‌లో బొటిక్ నడిపాను. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత 2012లో పిల్లలను దత్తత తీసుకోవడానికి ‘శిశుగృహ’ అనాథ శరణాలయానికి వెళ్లాను. అయితే వైకల్యంతో ఉన్న అక్కడి పిల్లలను తీసుకోవడానికి మొదట కొద్దిగా సంశయించాను. కానీ అక్కడున్న రెండేళ్ల మహేశ్ నా వేలు పట్టుకున్నాడు.

ఊయలలో ఉన్న సాయి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. వారిద్దర్నీ చూశాక నా సంశయం పటాపంచలైపోయింది. వారిద్దరితో పాటు అల్కాను దత్తత తీసుకున్నాను. ఇంట్లోనే ఏడాది పాటు వారి సంరక్షణను, బాగోగులను చూసుకున్నాను. కానీ ఏదో వెలితి. ఇంకా ఇలాంటి వారి కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.  బ్యాంకు లాకర్‌లోని నగలు అమ్మేస్తే వచ్చిన రూ. 11 లక్షలతో స్థలం కొన్నాను. ఆశ్రమం నిర్మించడానికి పుణెలో మాకు ఉన్న ఫ్లాట్ అమ్మేశాను.

గతంలో కొండకర్ల ఆవకు మా కుటుంబం అంతా చాలాసార్లు పిక్నిక్‌కు వచ్చాం. ఇక్కడి వాతావరణం నాకెంతో నచ్చింది. అందుకే ఇక్కడ స్థలం కొని 2013లో ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఈ ఆశ్రమానికి, స్వచ్ఛంద సంస్థకూ ‘ఇచ్ఛ-’ అని పేరు పెట్టుకున్నాను. ఇచ్చ అంటే కోరిక. పిల్లలకు అమ్మానాన్న, ఇల్లు కావాలనే కోరిక సహజం కదా! ఇపుడు ఆశ్రమంలో పిల్లల సంఖ్య పదకొండుకు చేరింది. మిగతా పిల్లలతోపోల్చితే వీరి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పూ నేర్పూ ఉండాలి. నాతో పాటు ఒక ఫిజియోథెరఫిస్ట్, ముగ్గురు కేర్‌టేకర్స్ వారినీ నిరంతరం కనిపెట్టుకొని ఉంటాం.
 
నెలవారీ డొనేషన్ ఉండాలి...
ఆశ్రమం దినసరి నిర్వహణతో పాటు వైద్యచికిత్సలకూ ఖర్చు పెరుగుతోంది. అయినప్పటికీ ఇక్కడే ఒక పూర్తిస్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్, ఫిజియోథెరఫీ సెక్షన్, వాటర్ థెరఫీ కోసం హైడ్రోప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. దాతలు ఒకేసారి డొనేషన్ మొత్తం ఇచ్చే కంటే నెలనెలా కొంత కచ్చితంగా వచ్చేలా ఏర్పాటు చేస్తే మా ప్లానింగ్ సులువవుతుంది’’.

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
మహేశ్ (4ఏళ్లు): చెవుడు లేదు. మూగ మాత్రమే ఉంది. వారానికి రెండ్రోజుల పాటు స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు.
అల్కా (3): రెండ్రోజుల శిశువుగా ఉన్నపుడు విశాఖ రైల్వేస్టేషన్‌లో వదిలేశారు. ఆమె మెదడు
ద్రవస్థితిలో ఉండటంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి.
సాయి (3): అవాంఛిత గర్భం వల్ల ఓ అవివాహిత ఈ బిడ్డను ఓ న్యాయవాది ఇంటి వద్ద వదిలివెళ్లిపోయింది. అతను రెండు నెలల తర్వాత శిశుకేంద్రానికి అప్పగించారు. దత్తత తీసుకున్నపుడు ఆర్నెల్ల వయసు. నరాల సమస్య వల్ల నడవలేడు, కూర్చోలేడు, ఏమీ తినలేడు. ఫిజియోథెరఫీ చేయడం వల్ల ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది.
రాణి (2): పెద్ద తల, చిన్న శరీరం, తక్కువ బరువుతో అనకాపల్లి ఆసుపత్రిలో పుట్టిన ఈ పాపను తల్లిదండ్రులు అక్కడే వదిలేశారు. రాణికి ఒక చేయి లేదు. మరో చేతి వేళ్లు అంటుకుపోయాయి. పెదవి కూడా గ్రహణం మొర్రు ఉండటంతో ఇటీవలే శస్త్రచికిత్సతో సరిచేశారు.
తేజ (7): బుద్ధిమాంద్యం, హెపటైటిస్-బితో బాధపడుతోన్న ఈమెను తల్లిదండ్రులు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై వదిలేశారు.
తేజశ్రీ (4): కొండకర్ల గ్రామానికి చెందిన తేజశ్రీ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు బుద్ధిమాంద్యంతో పాటు ప్రమాదకరమైన మయోపిట్స్ సమస్య ఉంది.
బషీరా (8): మెదడులో సమస్య ఉండటంతో ఏదీ రిజిస్టర్ కాదు. క్షణ క్షణానికి ఆమె ప్రవర్తన మారిపోతుంటుంది. తండ్రి ఎటో వెళ్లిపోవడంతో వైజాగ్‌లో ఉంటోన్న తల్లి ఆమెను తనవద్ద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు.
తనూశ్రీ (7 నెలలు): గత జూలై 18న రెండు నెలల పాపగా ఆశ్రమానికి వచ్చింది. ఈమెకు జననేంద్రియాలు రెండూ కలిసిపోయి ఉన్నాయి. వైద్యులతో పరీక్ష చేయిస్తే బాలిక లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని తేలింది.
శ్యామ్ (5): అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో తల్లిదండ్రులు చాపలో చుట్టి వదిలేశారు. నరాల సమస్య వల్ల కూర్చోలేదు, నడవలేదు, గొంతులో సమస్యతో ద్రవ పదార్థమే ఆహారం.
గిరిజ (8) : ఆశ్రమంలో చేరేటపుడు చాలా సన్నంగా, పెద్ద పొట్టతో ఉండేది. లివర్ సమస్య ఉంది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
తార (3): కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవరో వదిలివెళ్లిపోయిన ఆమెను చైల్డ్‌లైన్ అధికారులు గత నెలలోనే ఆశ్రమంలో చేర్పించారు. మెదడు బాగానే ఉన్నా కాళ్లూచేతుల్లో సత్తువ లేదు. నరాల సమస్యతో బాధపడుతోంది.
- అల్లు సూరిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement