కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా! | movie punch | Sakshi
Sakshi News home page

కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా!

Published Tue, Jun 16 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా!

కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా!

ఆ దేవాలయ పరిసరాలు పవిత్ర ప్రశాంతతను ధ్వనిస్తున్నాయి.
నరసింహ నాయుడు తన కుటుంబం ఇతర పరివారంతో దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అతడి కాళ్లకు మొక్కుతున్నారు.
‘‘తప్పమ్మా... అలా చేయవద్దు’’ అని వారిస్తూ ముందుకు నడుస్తున్నాడు నరసింహ నాయుడు.
కొత్త పెళ్లికూతురు శ్రావణికి ఇదంతా వింతగా  అనిపించింది.
మనసులో మాటను ఆపుకోలేక ‘‘ఈ ఊరి వాళ్లకు ఏమైనా పిచ్చా? గుళ్లో దేవుణ్ని వదిలేసి మా ఆయన కాళ్లకు మొక్కుతున్నారు!’’ అని పూజారిని అడిగింది.
పూజారి కూల్‌గా అన్నాడు- ‘‘రాక్షస సంహారం చేసిన వీరుడు కదమ్మా!’’ అని.
అవును కదా మరి... దేహమే  దేవాలయం అయినప్పుడు... పదిమందికి మంచి చేసేవాడెప్పుడూ దేవుడవుతాడు. ప్రత్యక్ష దైవం అవుతాడు. నరసింహ నాయుడు అచ్చంగా అలాంటి వాడే! పొరుగూరు రాక్షసుల నుంచి తన గ్రామాన్ని రక్షించుకోవడానికి తానే ఒక బలమైన సైన్యం అయినవాడు.
అందుకే మంచివాళ్లు అతన్ని పసిబిడ్డలా పేమిస్తారు.
దైవంగా మార్చి గుండెలో పెట్టుకొని ఆరాధిస్తారు.
చెడ్డవాళ్లకు మాత్రం అతను సింహస్వప్నంలా దర్శనమిస్తాడు. నిద్ర పోతే ఎక్కడ పీడకలై వస్తాడోనని నిద్రలేని రాత్రులతో సతమతమై పోతుంటారు.
యాదృచ్ఛికంగా ఆ రోజు  రెండు వర్గాలూ దేవాలయానికి వచ్చాయి.
     
‘మావా... అదిగో నరసింహ నాయుడు’... కుప్పుస్వామి కొడుకులు భయంగా కళ్లు తేలేస్తున్నారు.
‘తమ్ముడూ... వాడేరా నీ బావను చంపింది’ ఆవేశంగా నరసింహ నాయుడిని చూపుతూ కన్నెర్ర చేస్తోంది అప్పలస్వామినాయుడి భార్య.
‘‘మీరు గుళ్లోకి వెళ్లండి... వాడి సంగతి నేను చూస్తా’’ ఆవేశంగా ముందుకు కదిలాడు ఆమె తమ్ముడు కుప్పుస్వామి నాయుడు.
ఆరున్నర అడుగుల ఎత్తుతో ఉంటాడు కుప్పుస్వామి నాయుడు. అయితే నరసింహ నాయుడు సంగతి చూడాలంటే అది మాత్రమే సరిపోదు... కనిపించే ధైర్యం కాదు కనిపించని ధైర్యం కావాలి. కనిపించే తెగింపు కాదు, కనిపించని తెగింపు కావాలి. అది పెద్దగా అతని దగ్గరగా లేనట్లు ఉంది. కళ్లు మూసుకొని దేవుణ్ని మొక్కుకుంటున్న నరసింహ నాయుడును చేత్తో నెట్టేసి కవ్వించాడు కుప్పుస్వామి. ఆ సమయంలో కుప్పుస్వామి పైపంచ కిందపడుతుంది. నరసింహనాయుడు కిందికి వంగి ఆ పంచెను తీసి కుప్పుస్వామిచేతిలో పెట్టి అంటాడు..
‘స్త్రీకి పైట చెంగు సిగ్గును కాపాడుతుంది.
మగాడికి పై పంచ పెద్దరికాన్ని నిలబెడుతుంది.
కాస్త చూస్కోని నడవండి’’.
ఈ మాటను ఖాతరు చేయకుండా నరసింహ నాయుడి భుజం మీద గట్టిగా చేయివేసి-
‘నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలస్వామి నాయుడి బావమరిదిని. బావ మరుదులు బావ బతుకును కోరుతారు. కానీ నా బావ బతికిలేడు. కనుక నేను నా బావను చంపినవాడి చావు చూసే వరకు నిద్రపోను... అరేయ్’’ అని అరుస్తూ చేయి పైకి లేపాడు కుప్పుస్వామి.
‘ఇలా చేయి కలిపే... నీ బావ గొయ్యిలో పడుకున్నాడు’ అని  ఆ చెయ్యిని అడ్డుకున్నాడు నరసింహ నాయుడు.
లేని ధైర్యాన్ని, గాంభీర్యాన్ని కళ్లలోకి తెచ్చుకొని...
‘గుడై పోయిందిరా లేకపోతే...’ అంటూ క్షమించినట్లు ముఖం పెట్టాడు కుప్పుస్వామి నాయుడు.
శత్రువు సవాలు విసిరాడు.
పోరాడకుండానే, ఓటమి రుచి చూడకుండానే ‘క్షమించాను పో’ అన్నట్లుగా డంబాలు పలుకుతున్నాడు.
ఇప్పుడు హీరో చేయాల్సింది... విలన్ ముఖం మీద పంచ్ ఇవ్వడం కాదు. అలా చేస్తే అది ఊహించని విషయమూ కాదు.
పంచ్ పడాలి...కానీ... అది ఫిజికల్ పంచ్ కాదు... డైలాగ్ పంచ్.
పదిహేను సంవత్సరాల నుంచి డైలాగు ప్రేమికుల గుండెల్లో మారు మోగుతున్న  ఆ పంచ్ పవర్ మరోసారి వినండి....
‘గుడై పోయింది అంటున్నావు.
పోనీ నీ ఊరి నడిబొడ్డున చూసుకుందాం.
ప్లేస్ నువ్వు చెప్పినా సరే... నన్ను చెప్పమన్నా సరే.
టైమ్ నువ్వు చెప్పినా సరే... నన్ను చెప్పమన్నా సరే.
ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే...
కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపుతా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement