ప్రతి వేడుక... ఒకరికొకరి కానుక | chit chat with b gopal | Sakshi
Sakshi News home page

ప్రతి వేడుక... ఒకరికొకరి కానుక

Published Wed, Jan 8 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

ప్రతి వేడుక... ఒకరికొకరి కానుక

ప్రతి వేడుక... ఒకరికొకరి కానుక

 అమ్మాయి లాయరట! అబ్బాయి భయపడిపోయాడు.
 అబ్బాయిది సినిమాఫీల్డట! అమ్మాయి భయపడిపోయింది.
 కుదిరే పెళ్లేనా? ఇద్దర్లోనూ సందేహం!
 పెళ్లిచూపులు మొదలయ్యాయి, పూర్తయ్యాయి.
 భయం పోయింది! ఒకరికొకరు నచ్చేశారు.
 పెళ్లై ముప్పై ఏళ్లు. బి.గోపాల్, ఉమ ఇప్పటికీ....
 అప్పుడప్పుడు భయపడుతుంటారు
 ఎప్పుడోగాని వీలవని కబుర్ల వేళ ఏ పనులో వచ్చిపడవు కదాని!
 అంతగా... ఒకటైపోయారు. అంతగా అంటే.. ‘మనసే జతగా..’!

 
మూడు దశాబ్దాల డెరైక్షన్ కెరీర్‌లో మూడు పదులకు పైగా సినిమాలను తెరకెక్కించారు బి. గోపాల్. బొబ్బిలిరాజా, అసెంబ్లీరౌడీ, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర... వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ని బద్దలుకొట్టిన డెరైక్టర్ బి.గోపాల్ స్వస్థలం ఒంగోలు దగ్గర నిడమానూరు. ఆయన అర్ధాంగి ఉమ గుంటూరువాసి. 30 సినిమాలు - 30 ఏళ్ల దాంపత్యం... వీరి జీవితనౌక ఇంత అన్యోన్యంగా ఎలా ప్రయాణిస్తోందో తెలుసుకోవడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహానికి వెళ్లాం.
 
 భయాలు తొలగినవేళ...


 పెళ్లినాటికే ఉమ లాయర్ పట్టా పుచ్చుకున్నారు. కోర్టులో తన సత్తా నిరూపించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలోనే తెలిసినవారి ద్వారా గోపాల్ పెళ్లిచూపుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాల్ డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి అనుకోకుండా సినీ పరిశ్రమలో చేరారు. తన ప్రతిభతో త్వరలోనే కో డెరైక్టర్‌గా... ఆ తర్వాత డెరైక్టర్‌గా ఎదిగారు. ‘‘లాయర్‌ని పెళ్లి చేసుకోవడమా?! అని ముందు భయపడ్డాను. కాని ఈమెను చూశాక ఆ భయం పోయింది. అమాయకురాలు అనిపించింది’’ అని ఆనాటి రోజులను గుర్తుచేసుకొని గుంభనంగా నవ్వారు బి.గోపాల్. ‘‘సినిమా పరిశ్రమ కదా! అని మా అమ్మ కొంచెం భయపడ్డారు. కాని ఈయన్ని చూసి, మాట్లాడాక, మంచితనం తెలిసాక ఆ భయం పోయింది’’ అంటూ 30 ఏళ్ల క్రితం (1983) జరిగిన తమ పెళ్లినాటి రోజులను గుర్తుచేసుకున్నారు ఉమ.
 
 కొత్తకాపురం... కొత్త భాష...


 పెళ్లికి ముందే మద్రాస్‌లో ఉన్నారు గోపాల్. పెళ్లవడంతోనే భర్తతో కలిసి మద్రాస్‌కు కాపురానికి వెళ్లారు ఉమ. తన మెట్టినింటి విశేషాలు, కాపురం తొలినాళ్ల సర్దుబాట్ల గురించి ఉమ వివరిస్తూ - ‘అత్తింటిలో అందరూ నన్ను చాలా అభిమానించేవారు. అందుకే పరాయి ఇల్లులా అనిపించలేదు. నేను సర్దుబాట్లు చేసుకునే అవకాశం లేకుండానే వెంటనే కాపురానికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లినరోజు రాత్రే షూటింగ్ నెల రోజులు ఉంటుందని ఫోన్. వెళ్లక తప్పదు. నేను ధైర్యంగా ఉంటానని మాట ఇచ్చాక షూటింగ్‌కి ఈయన రాజమండ్రి వెళ్లిపోయారు. తెలియనిచోటు, తెలియని భాష, చేతకాని వంట.. ఇవీ అప్పుడు నా ముందున్న సమస్యలు. కాని కొన్నిరోజుల్లోనే వాటిని అధిగమించాను. ఈయన తిరిగొచ్చాక మద్రాస్‌లో ‘లా’ ప్రాక్టీస్ కోర్స్‌లో జాయినయ్యాను. అయితే ప్రెగ్నెన్నీ రావడం, అబార్షన్ చేయడం, ఆ తర్వాత డాక్టర్ చేసిన పొరపాటు ఫలితంగా ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయాల్సి రావడం... దీంతో 20 ఏళ్లు చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ సమయంలో ఈయన నా పట్ల చూపిన ఓర్పు, సహనం, ప్రేమ... బహుశ ఏ భర్తా తన భార్య పట్ల చూపరేమో! త్రిగుణ (ఉమ-గోపాల్‌ల ఏకైక కుమార్తె) మా జీవితంలోకి వచ్చాక మరింత నిండుతనం వచ్చింది’ అంటూ తమ తొమ్మిదేళ్ల పాపను దగ్గరకు తీసుకుంటూ మురిపెంగా చెప్పారు ఉమ.
 
 కోపం వస్తే మౌనమే మందు...


 ఇద్దరి మధ్య వాదనలకు చోటు లేదని తేల్చి చెప్పిన ఈ దంపతులు అనుకోకుండా ఎంట్రీ ఇచ్చే కోపతాపాలను ఎలా మ్యానేజ్ చేసుకుంటారో వివరించారు. ఉమ మాట్లాడుతూ - ‘మా మొదటి పెళ్లిరోజు ఆగష్టు 12. ఆగష్టు 11న ఈయన షూటింగ్‌కి వెళ్లిపోయారు. నేను మద్రాస్‌లోను, ఈయన ఊటీలో...  ‘ఇలా అయితే ఎలా!’ అని అప్పుడు కాస్త అప్‌సెట్ అయ్యాను. కాని ఈయన వర్క్ ఎలాంటిదో అర్ధం చేసుకున్నాను. పని విషయంలో మరింత సపోర్ట్‌గా నిలవా లని అప్పుడే అనుకున్నాను. ఈయనకు కోపమే రాదు. ఎప్పుడూ చిరునవ్వే ముందుంటుంది. పొరపాటున ఎప్పుడైనా ఏమైనా అన్నా ఆ సమయంలో మౌనంగా ఉంటాను. నాకెప్పుడైనా కోపం వచ్చినా వెంటనే నిలదీయను. నా కోపాన్నంతా గోడలకు చెప్పుకుంటాను. ఇప్పటికీ అదే మంత్రం’ అంటూ నవ్వేస్తారామె! ‘ఎప్పుడూ లేనిది అప్పుడప్పుడు పాప పెంపకంలో చిన్నచిన్న పట్టింపులు వస్తుంటాయి. ‘కఠినంగా ఉండాలంటుంది ఈవిడ, అవసరం లేదు’ అంటాను నేను. పిల్లల పెంపకంలో అవన్నీ తప్పవు కదా!’ నవ్వుతూనే తెలిపారు గోపాల్.
 
 టెన్షన్లు తీరేలా ఇల్లు...


 ‘మొదటి నుంచీ జీవితం ప్రశాంతంగా వెళ్లిపోవాలి, సినీ పరిశ్రమలో ఉన్న నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి అర్ధాంగి అయితే చాలు అనుకున్నాను.  నా అదృష్టం కొద్దీ అన్నివిధాలా అర్థం చేసుకునే ఉమ నాకు అర్ధాంగిగా వచ్చింది. అప్పటివరకు తనకు షూటింగ్‌లంటే తెలియదు. నాతో పాటు షూటింగ్‌లకు వచ్చింది. నా పనితీరును అర్థం చేసుకుంది. అందుకే ఎప్పుడూ నా వర్క్‌లో ఇన్‌వాల్వ్ అవలేదు. నాకంటే చదువులో మిన్నగా ఉన్నా ఆ దర్పం ఎప్పుడూ ఏ కోశానా చూపలేదు. పైగా ‘లా’ కన్నా ఇంటికే నా ప్రాధాన్యత’ అంది. ఇంటిని ఎప్పుడూ అందంగా తీర్చిదిద్దుతుంది. అందుకే సినిమా పనులతో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాను. మాకు ఆలస్యంగా పిల్లలు కలగడంతో మా తమ్ముని పిల్లలను తన బిడ్డలుగా పెంచింది. బంధువులతో, స్నేహితులతో కలుపుగోలుగా ఉంటూ వచ్చింది. సినిమా చూసి మాత్రం మొహమాటం లేకుండా విమర్శించేస్తుంది. మరో విషయం ఏమిటంటే తను ఎంత మంచి ప్రేక్షకురాలంటే.. సినిమాలో కామెడీ సీన్ వస్తే నవ్వు ఆపుకోదు, ఏడుపు సీన్ వచ్చినా అంతే! పక్కనుంచి కంట్రోల్ చేయాల్సిందే!’ అంటూ అర్ధాంగి మనస్తత్వాన్ని అందంగా వివరించారు ఈ మాస్ ఫేవరేట్ డెరైక్టర్.
 
 శోధించి... సాధించి...


 ‘నా పుట్టినరోజు కరెక్ట్ తేదీ తెలియడం కోసం మా ఊరు ఆసుపత్రికి వెళ్లి, పాత రికార్డులను శోధించి మరీ కనిపెట్టింది ఉమ. నా ప్రతి పుట్టినరోజునూ పద్ధతిగా చేస్తుంది. ఊహించని కానుకలు ఇచ్చి ఆనందపెట్టడం తనకు ఇష్టం. ఇక పండగలు వచ్చాయంటే మా ఊరికి వెళ్లాల్సిందే! ఉమకు ఉన్న ఆ ఆసక్తి వల్లే నగర వాతావరణం నుంచి పల్లెకు చేరువవుతుంటాం. ఇక్కడే ఉన్నా భోగిమంటలు, పిండివంటల హడావిడి ఉండాల్సిందే’ అన్నారు గోపాల్!
 
 భార్యాభర్తలు అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకుపోవడం, స్నేహంగా కలిసిపోవడం... దాంపత్యంలో తప్పనిసరి సూత్రాలు అని చెప్పకనే చెప్పారు ఈ దంపతులు.
  - నిర్మలారెడ్డి
 
 20 ఏళ్లు చికిత్స కోసం నేను ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ సమయంలో ఈయన నా పట్ల చూపిన ఓర్పు, సహనం, ప్రేమ... బహుశ ఏ భర్తా తన భార్య పట్ల చూపరేమో!
 - ఉమ
 
  ‘‘లా’ కన్నా ఇంటికే
 నా ప్రాధాన్యత’’ అంది. ఇంటిని ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుతుంది. అందుకే సినిమా పనులతో ఎన్ని టెన్షన్లు ఉన్నా
 ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాను.
 - బి.గోపాల్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement