assembly rowdy
-
థియేటర్లలో 200 రోజులు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై అభిమానులను అలరించారు. ఆయన తన కెరీర్లో నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల తన బ్లాక్ బస్టర్‌ను చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో డైలాగ్స్, సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరో మూవీకి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.1991లో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబుకు అందించింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. పి.వాసు, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు. కేవీ మహదేవన్ సంగీమందించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన కెరీర్లో గొప్ప మెలురాయిగా నిలిచిపోయిందన్నారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' అసెంబ్లీ రౌడీ (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను. ఆకట్టుకునే కథాంశంతో పి.వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలోని కేవీ మహదేవన్ మ్యూజికల్ హిట్లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి' అంటూ పోస్ట్ చేశారు. 🌟 Assembly Rowdy (1991) – A cherished milestone in my journey! 🌟Playing such a powerful role in this action, comedy-drama, directed by Sri. B. Gopal, was truly memorable. With an engaging storyline by Sri. P. Vasu and impactful dialogues from the Paruchuri Brothers, the film… pic.twitter.com/SX9vHm580D— Mohan Babu M (@themohanbabu) December 25, 2024 -
బాత్రూమ్ సీన్.. ఆ హీరోయిన్ చేయనని ఏడ్చేసింది: డైరెక్టర్
చాలామంది దర్శకులు ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టినవాళ్లే! ఆ జాబితాలో టాప్ డైరెక్టర్ బి.గోపాల్ ఒకరు. ఈయన పి.సి.రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. తర్వాత కె. రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన దాదాపు 12 సినిమాలకు బి.గోపాల్ పని చేశారు. ఈ సమయంలో దగ్గుబాటి రామానాయుడు ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి తన బ్యానర్లో దర్శకుడిగా ఓ సినిమా తీసే ఛాన్స్ ఇచ్చారు. గ్లామర్ హీరోయిన్ను తీసుకున్నాం అలా ప్రతిధ్వని సినిమాతో ఈయన దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, అల్లరి రాముడు, ఇంద్ర వంటి అనేక సూపర్ హిట్ సినిమాలను తెలుగు తెరకు అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బొబ్బిలి రాజా సినిమాతో గ్లామర్ హీరోయిన్గా దివ్య భారతికి బాగా పేరొచ్చింది. అలా ఆమెను అసెంబ్లీ రౌడీలోకి తీసుకున్నాం. ఏడ్చేసిన హీరోయిన్ కానీ ఈ మూవీలో ఒకే ఒక గ్లామర్ సీన్ ఉంటుంది. తీరా ఆ గ్లామర్ సన్నివేశం షూటింగ్ తీసే రోజు దివ్యభారతి ఇంకా రాలేదు. మోహన్‌బాబు గారు ఏమైంది? ఇంకా ఎంతసేపు ఆలస్యం చేస్తారు? అని కోప్పడుతున్నారు. తను రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే దివ్య భారతి ఏడుస్తోంది.. షూటింగ్‌కే రానంటోంది.. ఆ డ్రెస్ వేసుకోనంటోంది అని చెప్పారు. అమ్మాయేమో రానంటోంది.. షూట్ క్యాన్సిల్ అంటే మోహన్‌బాబు అరిచేస్తారు. ఆమె తల్లి నచ్చజెప్పి ఒప్పించింది ఏం చేయాలా? అని నేనే దివ్య భారతి దగ్గరకు వెళ్లాను. వెళ్లేసరికి నిజంగానే ఏడుస్తోంది. నేను ఈ డ్రెస్ వేసుకోను అని చెప్పింది. దీంతో.. ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాను. అది విని దివ్య భారతి తల్లి.. తన కూతురిని ఒప్పించింది. వెంటనే ఆమె ఐదు నిమిషాల్లో రెడీ అయింది, సీన్ కూడా షూట్ చేసేశాం. సినిమాలో ఈ సీన్ బాగా క్లిక్ అయింది' అని దర్శకుడు బి.గోపాల్ చెప్పుకొచ్చారు. చదవండి: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్ రియాక్షన్ ఇదీ! -
అప్పుడు అందరినీ నవ్వించి.. ఇప్పుడు తిండి కోసం తిప్పలు
తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ మీకు గుర్తుందా? అంతే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం కామెడీ మామూలుగా పాపులర్ కాలేదు. ఈ చిత్రంలో అందరినీ కడుప్పబ్బా నవ్వించిన పాత్ర మరొకటుంది. బ్రహ్మనందంతో కామెడీ సీన్స్‌లో కనిపించిన పాకీజా రోల్. ఆ చిత్రం ద్వారానే ఆమె తెలుగులో పాపులర్ అయింది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు, స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో నటించింది. కానీ.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోంది. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి రిక్త హస్తాలతో మిగిలిపోయి దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాల్లోనూ నటించింది పాకీజా. అందరి స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులోనే దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందరినీ నవ్వించినా ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల ఆమె ఛానెల్‌తో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆమె పరిస్థితికి గల కారణాలను వివరించారు. పాకీజా రోల్లో మంచి కమెడియన్ అందరినీ నవ్వించినా పేరు తెచ్చుకున్నా.. ఆస్తులు ఏ మాత్రం లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అందరి సినిమాల్లో చేశా. తెలుగులో దాదాపు 50 సినిమాలు చేశా. ఆ తర్వాత నా స్వస్థలం తమిళనాడులోని కరైకుడికి వెళ్లా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ జయలలిత. 150 చిత్రాల్లో నటించినా చెన్నైలో సొంత ఇల్లు లేదు. సాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు హీరోలను సంప్రదించాను. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నా పరిస్థితిని వివరించా. ఎవరూ సాయం చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ ఉంటున్నా. ఎవరైనా ఆదుకుంటారేమో అని వేచి చూస్తున్నా.' అని ఎమోషనలయ్యారామె. -
డై..లాగి కొడితే....
సినిమా : అసెంబ్లీ రౌడీ రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: బి. గోపాల్ ఇండిపెండెంట్‌గా నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తాడు శివాజీ (మోహన్‌బాబు). ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉంటాడు మంత్రి (సత్యనారాయణ). శివాజీ, అతని వెనక ఉన్న పాతికమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాననీ, అందుకు శివాజీకి పదిలక్షలు, మిగిలిన వారికి ఐదు లక్షల చొప్పున ఇస్తాననీ తన పీఏ ద్వారా శివాజీకి డబ్బు పంపిస్తాడు సత్యనారాయణ. ఆ డబ్బు తీసుకున్న శివాజీ, మంత్రి వద్దకు వెళ్లి విలేకరుల ముందు ఆయన్ను కడిగి పారేసి, డబ్బు తిరిగిచ్చేస్తాడు. రేయ్ అని మంత్రి మాట్లాడబోతుండగా .. ‘అరిస్తే చరుస్తా.. చరుస్తే కరుస్తా.. కరిస్తే ఉరి తీయిస్తా’ అని వార్నింగ్ ఇస్తాడు శివాజీ. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులర్. -
విష్ణు హీరోగా అసెంబ్లీరౌడీ రీమేక్
స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలకు.., తమ ముందు తరం వారు చేసిన సక్సెస్ ఫుల్ సినిమాలను రీమేక్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. అయితే అలా రీమేక్ చేసి సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా భారీ అంచనాలు ఏర్పడటంతో పాటు ప్రతి విషయంలోనూ పాత సినిమాతో పోల్చిచూస్తారన్న భయంతో చాలామంది రీమేక్ చేయాలని ఉన్నా ఊరుకుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మోహన్ బాబు కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలిచిన పోయిన చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా హీరోగా మోహన్ బాబు రేంజ్‌ను తారస్థాయికి తీసుకెళ్లింది. బి. గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ అందించిన పదునైన మాటలు సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. అందుకే ఇప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు అసెంబ్లీ రౌడీ స్పెషల్ సినిమానే. ఆ సినిమాను ఇప్పుడు మంచు వారబ్బాయి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విష్ణు, కామెడీ, యాక్షన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే బాటలో ఇప్పుడు తన తండ్రి కెరీర్లో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేసి తానెంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. మరి పాతికేళ్ల క్రితం మురిపించిన అసెంబ్లీ రౌడీ ఈ జనరేషన్‌ను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని బ్యాన్ చేయాలన్నారు - మోహన్‌బాబు
‘‘అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా..’’ అంటూ పాతికేళ్ల క్రితం కలక్షన్ కింగ్ మోహన్‌బాబు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ డైలాగ్ మాత్రమే కాదు.. ‘అసెంబ్లీ రౌడీ’లో ఆయన చెప్పిన మిగతా డైలాగ్స్ కూడా చాలా పాపులర్. పాతికేళ్లయినా ఇంకా గుర్తుండిపోయిన చిత్రం అది. నేటితో ఈ చిత్రం విడుదలై పాతికేళ్లయ్యింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆయన కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రం తాలూకు అనుభూతులను పంచుకోవడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లుడుగారు’ సినిమా చేస్తున్న సమయంలో డెరైక్టర్ పి. వాసు ‘వేలై కిడైచాచ్చు’ అనే తమిళ సినిమా కథ వినిపించారు. తమిళంలో మంచి విజయం సాధించింది. కథ నచ్చి, రచయిత ఎమ్.డి.సుందర్‌ను సినిమా చూడమన్నా. ఆయనకు కూడా నచ్చేసింది. వెంటనే ఆ సినిమా హక్కులను తీసుకుని బి.గోపాల్ దర్శకునిగా ‘అసెంబ్లీ రౌడీ’ స్టార్ట్ చేశాం. మొత్తం 41 రోజుల్లో పూర్తి చేశాం. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ సంఘటన జరిగింది. రోడ్డు మీద చిత్రీకరించడానికి అనుమతి తీసుకుని సీరియస్‌గా షూటింగ్ చేస్తున్నాం. ఇంతలో సడన్‌గా గుంపు నుంచి ఓ వ్యక్తి వచ్చి ‘‘ఎవర్రా ఇక్కడ ‘అసెంబ్లీ రౌడీ’ అనే షూటింగ్ చేస్తున్నా ర’ంటూ అక్కడ గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కొని అతన్నే కొట్టబోయాడు. దాంతో అతని వెంట నేను కత్తి తీసుకుని పరిగెత్తా.. అలా అతన్ని వెంటాడి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పా. అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కి సడన్‌గా ఈ సినిమా టైటిల్ మీద అసెంబ్లీలో గొడవ చెలరేగింది. చాలా మంది ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలన్నారు. దాంతో అప్పటి అసెంబ్లీ స్పీకర్ ధర్మారావు సినిమా చూసి ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలా అన్నీ తట్టుకుని వెళ్లిన ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతంగా ఆడింది. అన్ని చోట్లా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే, పరుచూరి గోపాలకృష్ణ రాసిన సంభాషణలు, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభే కారణం’’ అని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తణుకులో ఉండగా మోహన్‌బాబు తమిళ సినిమా వీడియో క్యాసెట్ చూడమని చెప్పారు. చూస్తూ, మధ్యలోనే ఆపేసి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని చెప్పేశా. ఆ కథ సత్తా ఏంటో తెలిసిపోయింది. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చే యమని మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుకి చెప్పారు. ఆయన అంతా క్లాస్ టచ్ ఇస్తూ రాసేసరికి మోహన్‌బాబు, గోపాల్‌లు షాక్ అయ్యారు. నేను తర్వాతి రోజు ఉదయం ఏడింటికి మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగించేశాను. మోహన్‌బాబుకి ఫోన్ చేస్తే ‘ఏం స్క్రిప్ట్ టకటకా చుట్టేశావా’ అని అడిగారు. వెంటనే నేను ‘అరిస్తే...’ డైలాగ్ చెప్పాను. ఆయనకు నచ్చేసి స్క్రిప్ట్ చెప్పడానికి వెంటనే రమ్మన్నారు. అలా ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఏదైతే ఉందో అదే తెరకెక్కింది. ‘అసెంబ్లీ రౌడీ’ ప్రివ్యూ చూసి చాలా మంది పెదవి విరిచారు. సినిమా మాత్రం సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా విజయం తర్వాత మోహన్‌బాబు నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. అగ్రజా.. అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా మా ఇద్దరికీ ఉన్న అనుబంధం ఈ సినిమాతో మరింత రెట్టింపయింది’’ అని అన్నారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ - ‘‘ ‘దేవత’ సినిమాకు కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న టైమ్ నుంచి నాకు మోహన్‌బాబుగారు తెలుసు. నాకు ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నామనగానే వెంటనే ఓకే చెప్పాను. గోపాలకృష్ణగారు ఎంతో గొప్ప సంభాషణలు రాయడంతో పాటు తెలుగుకు తగ్గట్టు కొన్ని సీన్లు జత చేశారు. సంగీత దర్శకుడు కె.వి మహదేవన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. నేను ఈ సినిమాను డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా మోహన్‌బాబుగారి నటనను ఎంజాయ్ చేశాను. ఏడింటికే షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. అలా చాలా క్రమశిక్షణతో ఓ టీమ్‌గా కష్టపడి విజయం సాధించాం. నా కెరీర్లో మర్చిపోలేని సినిమా ఇది’’ అని చెప్పారు. అసెంబ్లీ రౌడీ రీమేక్‌లో విష్ణు హీరో! ‘‘ఈ సినిమా రీమేక్ గురించి ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మళ్లీ బి.గోపాల్ మాత్రమే ఈ సినిమా చేయాలి. విష్ణు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో ఈ రీమేక్ గురించి మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని మోహన్‌బాబు చెప్పారు. -
ఫేమస్ డైలాగ్స్ తో బుక్!
డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబుది ఓ ప్రత్యేకమైన శైలి. ‘అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా.. కరిస్తే నిన్ను కూడా బొక్కలో ఏస్తా..’ అంటూ ‘అసెంబ్లీ రౌడీ’లో ఆయన చెప్పిన డైలాగ్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకా మోహన్‌బాబు చెప్పినవాటిలో బోల్డన్ని ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి. గతేడాది నవంబర్ 22తో మోహన్‌బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీప్రసన్న పలు కార్యక్రమాలను ప్రకటించారు. అందులో భాగంగా మోహన్‌బాబు తన సినిమాల్లో చెప్పిన పలు ఫేమస్ డైలాగ్స్‌ని పుస్తక రూపంలోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 11న సాయంత్రం ఆరున్నర గంటలకు బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్‌లో విడుదల చేయనున్నారు. నటుడిగా, విద్యావేత్తగా మోహన్‌బాబు చేస్తున్న కృషిని గుర్తించి, ఈ వేడుకలో ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా ఆయన్ను సత్కరించనున్నారు. -
ప్రతి వేడుక... ఒకరికొకరి కానుక
అమ్మాయి లాయరట! అబ్బాయి భయపడిపోయాడు. అబ్బాయిది సినిమాఫీల్డట! అమ్మాయి భయపడిపోయింది. కుదిరే పెళ్లేనా? ఇద్దర్లోనూ సందేహం! పెళ్లిచూపులు మొదలయ్యాయి, పూర్తయ్యాయి. భయం పోయింది! ఒకరికొకరు నచ్చేశారు. పెళ్లై ముప్పై ఏళ్లు. బి.గోపాల్, ఉమ ఇప్పటికీ.... అప్పుడప్పుడు భయపడుతుంటారు ఎప్పుడోగాని వీలవని కబుర్ల వేళ ఏ పనులో వచ్చిపడవు కదాని! అంతగా... ఒకటైపోయారు. అంతగా అంటే.. ‘మనసే జతగా..’! మూడు దశాబ్దాల డెరైక్షన్ కెరీర్లో మూడు పదులకు పైగా సినిమాలను తెరకెక్కించారు బి. గోపాల్. బొబ్బిలిరాజా, అసెంబ్లీరౌడీ, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర... వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ని బద్దలుకొట్టిన డెరైక్టర్ బి.గోపాల్ స్వస్థలం ఒంగోలు దగ్గర నిడమానూరు. ఆయన అర్ధాంగి ఉమ గుంటూరువాసి. 30 సినిమాలు - 30 ఏళ్ల దాంపత్యం... వీరి జీవితనౌక ఇంత అన్యోన్యంగా ఎలా ప్రయాణిస్తోందో తెలుసుకోవడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహానికి వెళ్లాం. భయాలు తొలగినవేళ... పెళ్లినాటికే ఉమ లాయర్ పట్టా పుచ్చుకున్నారు. కోర్టులో తన సత్తా నిరూపించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలోనే తెలిసినవారి ద్వారా గోపాల్ పెళ్లిచూపుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాల్ డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి అనుకోకుండా సినీ పరిశ్రమలో చేరారు. తన ప్రతిభతో త్వరలోనే కో డెరైక్టర్‌గా... ఆ తర్వాత డెరైక్టర్‌గా ఎదిగారు. ‘‘లాయర్ని పెళ్లి చేసుకోవడమా?! అని ముందు భయపడ్డాను. కాని ఈమెను చూశాక ఆ భయం పోయింది. అమాయకురాలు అనిపించింది’’ అని ఆనాటి రోజులను గుర్తుచేసుకొని గుంభనంగా నవ్వారు బి.గోపాల్. ‘‘సినిమా పరిశ్రమ కదా! అని మా అమ్మ కొంచెం భయపడ్డారు. కాని ఈయన్ని చూసి, మాట్లాడాక, మంచితనం తెలిసాక ఆ భయం పోయింది’’ అంటూ 30 ఏళ్ల క్రితం (1983) జరిగిన తమ పెళ్లినాటి రోజులను గుర్తుచేసుకున్నారు ఉమ. కొత్తకాపురం... కొత్త భాష... పెళ్లికి ముందే మద్రాస్‌లో ఉన్నారు గోపాల్. పెళ్లవడంతోనే భర్తతో కలిసి మద్రాస్‌కు కాపురానికి వెళ్లారు ఉమ. తన మెట్టినింటి విశేషాలు, కాపురం తొలినాళ్ల సర్దుబాట్ల గురించి ఉమ వివరిస్తూ - ‘అత్తింటిలో అందరూ నన్ను చాలా అభిమానించేవారు. అందుకే పరాయి ఇల్లులా అనిపించలేదు. నేను సర్దుబాట్లు చేసుకునే అవకాశం లేకుండానే వెంటనే కాపురానికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లినరోజు రాత్రే షూటింగ్ నెల రోజులు ఉంటుందని ఫోన్. వెళ్లక తప్పదు. నేను ధైర్యంగా ఉంటానని మాట ఇచ్చాక షూటింగ్‌కి ఈయన రాజమండ్రి వెళ్లిపోయారు. తెలియనిచోటు, తెలియని భాష, చేతకాని వంట.. ఇవీ అప్పుడు నా ముందున్న సమస్యలు. కాని కొన్నిరోజుల్లోనే వాటిని అధిగమించాను. ఈయన తిరిగొచ్చాక మద్రాస్‌లో ‘లా’ ప్రాక్టీస్ కోర్స్‌లో జాయినయ్యాను. అయితే ప్రెగ్నెన్నీ రావడం, అబార్షన్ చేయడం, ఆ తర్వాత డాక్టర్ చేసిన పొరపాటు ఫలితంగా ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయాల్సి రావడం... దీంతో 20 ఏళ్లు చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ సమయంలో ఈయన నా పట్ల చూపిన ఓర్పు, సహనం, ప్రేమ... బహుశ ఏ భర్తా తన భార్య పట్ల చూపరేమో! త్రిగుణ (ఉమ-గోపాల్‌ల ఏకైక కుమార్తె) మా జీవితంలోకి వచ్చాక మరింత నిండుతనం వచ్చింది’ అంటూ తమ తొమ్మిదేళ్ల పాపను దగ్గరకు తీసుకుంటూ మురిపెంగా చెప్పారు ఉమ. కోపం వస్తే మౌనమే మందు... ఇద్దరి మధ్య వాదనలకు చోటు లేదని తేల్చి చెప్పిన ఈ దంపతులు అనుకోకుండా ఎంట్రీ ఇచ్చే కోపతాపాలను ఎలా మ్యానేజ్ చేసుకుంటారో వివరించారు. ఉమ మాట్లాడుతూ - ‘మా మొదటి పెళ్లిరోజు ఆగష్టు 12. ఆగష్టు 11న ఈయన షూటింగ్‌కి వెళ్లిపోయారు. నేను మద్రాస్లోను, ఈయన ఊటీలో... ‘ఇలా అయితే ఎలా!’ అని అప్పుడు కాస్త అప్సెట్ అయ్యాను. కాని ఈయన వర్క్ ఎలాంటిదో అర్ధం చేసుకున్నాను. పని విషయంలో మరింత సపోర్ట్‌గా నిలవా లని అప్పుడే అనుకున్నాను. ఈయనకు కోపమే రాదు. ఎప్పుడూ చిరునవ్వే ముందుంటుంది. పొరపాటున ఎప్పుడైనా ఏమైనా అన్నా ఆ సమయంలో మౌనంగా ఉంటాను. నాకెప్పుడైనా కోపం వచ్చినా వెంటనే నిలదీయను. నా కోపాన్నంతా గోడలకు చెప్పుకుంటాను. ఇప్పటికీ అదే మంత్రం’ అంటూ నవ్వేస్తారామె! ‘ఎప్పుడూ లేనిది అప్పుడప్పుడు పాప పెంపకంలో చిన్నచిన్న పట్టింపులు వస్తుంటాయి. ‘కఠినంగా ఉండాలంటుంది ఈవిడ, అవసరం లేదు’ అంటాను నేను. పిల్లల పెంపకంలో అవన్నీ తప్పవు కదా!’ నవ్వుతూనే తెలిపారు గోపాల్. టెన్షన్లు తీరేలా ఇల్లు... ‘మొదటి నుంచీ జీవితం ప్రశాంతంగా వెళ్లిపోవాలి, సినీ పరిశ్రమలో ఉన్న నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి అర్ధాంగి అయితే చాలు అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ అన్నివిధాలా అర్థం చేసుకునే ఉమ నాకు అర్ధాంగిగా వచ్చింది. అప్పటివరకు తనకు షూటింగ్‌లంటే తెలియదు. నాతో పాటు షూటింగ్‌లకు వచ్చింది. నా పనితీరును అర్థం చేసుకుంది. అందుకే ఎప్పుడూ నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవలేదు. నాకంటే చదువులో మిన్నగా ఉన్నా ఆ దర్పం ఎప్పుడూ ఏ కోశానా చూపలేదు. పైగా ‘లా’ కన్నా ఇంటికే నా ప్రాధాన్యత’ అంది. ఇంటిని ఎప్పుడూ అందంగా తీర్చిదిద్దుతుంది. అందుకే సినిమా పనులతో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాను. మాకు ఆలస్యంగా పిల్లలు కలగడంతో మా తమ్ముని పిల్లలను తన బిడ్డలుగా పెంచింది. బంధువులతో, స్నేహితులతో కలుపుగోలుగా ఉంటూ వచ్చింది. సినిమా చూసి మాత్రం మొహమాటం లేకుండా విమర్శించేస్తుంది. మరో విషయం ఏమిటంటే తను ఎంత మంచి ప్రేక్షకురాలంటే.. సినిమాలో కామెడీ సీన్ వస్తే నవ్వు ఆపుకోదు, ఏడుపు సీన్ వచ్చినా అంతే! పక్కనుంచి కంట్రోల్ చేయాల్సిందే!’ అంటూ అర్ధాంగి మనస్తత్వాన్ని అందంగా వివరించారు ఈ మాస్ ఫేవరేట్ డెరైక్టర్. శోధించి... సాధించి... ‘నా పుట్టినరోజు కరెక్ట్ తేదీ తెలియడం కోసం మా ఊరు ఆసుపత్రికి వెళ్లి, పాత రికార్డులను శోధించి మరీ కనిపెట్టింది ఉమ. నా ప్రతి పుట్టినరోజునూ పద్ధతిగా చేస్తుంది. ఊహించని కానుకలు ఇచ్చి ఆనందపెట్టడం తనకు ఇష్టం. ఇక పండగలు వచ్చాయంటే మా ఊరికి వెళ్లాల్సిందే! ఉమకు ఉన్న ఆ ఆసక్తి వల్లే నగర వాతావరణం నుంచి పల్లెకు చేరువవుతుంటాం. ఇక్కడే ఉన్నా భోగిమంటలు, పిండివంటల హడావిడి ఉండాల్సిందే’ అన్నారు గోపాల్! భార్యాభర్తలు అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకుపోవడం, స్నేహంగా కలిసిపోవడం... దాంపత్యంలో తప్పనిసరి సూత్రాలు అని చెప్పకనే చెప్పారు ఈ దంపతులు. - నిర్మలారెడ్డి 20 ఏళ్లు చికిత్స కోసం నేను ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ సమయంలో ఈయన నా పట్ల చూపిన ఓర్పు, సహనం, ప్రేమ... బహుశ ఏ భర్తా తన భార్య పట్ల చూపరేమో! - ఉమ ‘‘లా’ కన్నా ఇంటికే నా ప్రాధాన్యత’’ అంది. ఇంటిని ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుతుంది. అందుకే సినిమా పనులతో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాను. - బి.గోపాల్