అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని బ్యాన్ చేయాలన్నారు - మోహన్‌బాబు | At the time, the Assembly should be banned - mohan babu | Sakshi
Sakshi News home page

అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని బ్యాన్ చేయాలన్నారు - మోహన్‌బాబు

Published Fri, Jun 3 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని  బ్యాన్ చేయాలన్నారు   - మోహన్‌బాబు

అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని బ్యాన్ చేయాలన్నారు - మోహన్‌బాబు

‘‘అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా..’’ అంటూ పాతికేళ్ల క్రితం కలక్షన్ కింగ్ మోహన్‌బాబు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ డైలాగ్ మాత్రమే కాదు.. ‘అసెంబ్లీ రౌడీ’లో ఆయన చెప్పిన మిగతా డైలాగ్స్ కూడా చాలా పాపులర్. పాతికేళ్లయినా ఇంకా గుర్తుండిపోయిన చిత్రం అది. నేటితో ఈ చిత్రం విడుదలై పాతికేళ్లయ్యింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రం తాలూకు అనుభూతులను పంచుకోవడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లుడుగారు’ సినిమా చేస్తున్న సమయంలో డెరైక్టర్ పి. వాసు ‘వేలై కిడైచాచ్చు’ అనే తమిళ సినిమా కథ వినిపించారు. తమిళంలో మంచి విజయం సాధించింది. కథ నచ్చి, రచయిత ఎమ్.డి.సుందర్‌ను సినిమా చూడమన్నా. ఆయనకు కూడా నచ్చేసింది. వెంటనే ఆ సినిమా హక్కులను తీసుకుని బి.గోపాల్ దర్శకునిగా ‘అసెంబ్లీ రౌడీ’ స్టార్ట్ చేశాం. మొత్తం 41 రోజుల్లో పూర్తి చేశాం. ఈ  సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ సంఘటన జరిగింది. రోడ్డు మీద చిత్రీకరించడానికి అనుమతి తీసుకుని సీరియస్‌గా షూటింగ్ చేస్తున్నాం.


ఇంతలో సడన్‌గా గుంపు నుంచి ఓ వ్యక్తి వచ్చి ‘‘ఎవర్రా ఇక్కడ ‘అసెంబ్లీ రౌడీ’ అనే షూటింగ్ చేస్తున్నా ర’ంటూ అక్కడ గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కొని అతన్నే కొట్టబోయాడు. దాంతో అతని వెంట నేను కత్తి తీసుకుని పరిగెత్తా.. అలా అతన్ని వెంటాడి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పా. అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కి సడన్‌గా ఈ సినిమా టైటిల్ మీద అసెంబ్లీలో గొడవ చెలరేగింది. చాలా మంది ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలన్నారు. దాంతో అప్పటి అసెంబ్లీ స్పీకర్ ధర్మారావు సినిమా చూసి ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలా అన్నీ తట్టుకుని వెళ్లిన ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతంగా ఆడింది. అన్ని చోట్లా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే, పరుచూరి గోపాలకృష్ణ రాసిన సంభాషణలు, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభే కారణం’’ అని చెప్పారు.

 
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తణుకులో ఉండగా మోహన్‌బాబు తమిళ సినిమా వీడియో క్యాసెట్ చూడమని  చెప్పారు. చూస్తూ, మధ్యలోనే ఆపేసి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని చెప్పేశా. ఆ కథ సత్తా ఏంటో తెలిసిపోయింది. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు  చే యమని మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుకి చెప్పారు. ఆయన అంతా క్లాస్ టచ్ ఇస్తూ రాసేసరికి మోహన్‌బాబు, గోపాల్‌లు షాక్ అయ్యారు. నేను తర్వాతి రోజు ఉదయం ఏడింటికి మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు  ముగించేశాను. మోహన్‌బాబుకి ఫోన్ చేస్తే ‘ఏం స్క్రిప్ట్ టకటకా చుట్టేశావా’ అని అడిగారు. వెంటనే నేను ‘అరిస్తే...’ డైలాగ్ చెప్పాను. ఆయనకు నచ్చేసి స్క్రిప్ట్ చెప్పడానికి వెంటనే రమ్మన్నారు. అలా ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఏదైతే ఉందో  అదే తెరకెక్కింది. ‘అసెంబ్లీ రౌడీ’ ప్రివ్యూ చూసి చాలా మంది పెదవి విరిచారు. సినిమా మాత్రం సూపర్‌హిట్ అయింది.  ఈ సినిమా విజయం తర్వాత మోహన్‌బాబు నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. అగ్రజా.. అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా మా ఇద్దరికీ ఉన్న అనుబంధం ఈ సినిమాతో మరింత రెట్టింపయింది’’ అని అన్నారు.

 దర్శకుడు బి.గోపాల్  మాట్లాడుతూ - ‘‘ ‘దేవత’ సినిమాకు కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న టైమ్ నుంచి నాకు మోహన్‌బాబుగారు తెలుసు.  నాకు ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నామనగానే వెంటనే ఓకే చెప్పాను. గోపాలకృష్ణగారు ఎంతో గొప్ప సంభాషణలు రాయడంతో పాటు తెలుగుకు తగ్గట్టు కొన్ని సీన్లు జత చేశారు. సంగీత దర్శకుడు కె.వి మహదేవన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. నేను ఈ సినిమాను డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా మోహన్‌బాబుగారి నటనను ఎంజాయ్ చేశాను. ఏడింటికే షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. అలా చాలా క్రమశిక్షణతో ఓ టీమ్‌గా కష్టపడి విజయం సాధించాం. నా కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ఇది’’ అని చెప్పారు.
 
అసెంబ్లీ రౌడీ రీమేక్‌లో విష్ణు హీరో!
‘‘ఈ సినిమా రీమేక్ గురించి ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మళ్లీ బి.గోపాల్ మాత్రమే ఈ సినిమా చేయాలి. విష్ణు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో ఈ రీమేక్  గురించి మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని మోహన్‌బాబు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement