శ్రియ
‘‘డైరెక్టర్ మదన్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాలతో పోలిస్తే ‘గాయత్రి’ సినిమాలో నా పాత్ర కూడా సహజంగా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని కథానాయిక శ్రియ అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రియ విలేకరులతో మాట్లాడారు.
► ‘గాయత్రి’ సినిమాలో నేను ఓ చిన్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ చాలా అమాయకంగా, నిజాయితీగా, తెలివిగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మోహన్‌బాబుగారు గొప్ప నటుడు. విష్ణుతో యాక్ట్ చేయడం మంచి అనుభూతినిచ్చింది.
► మదన్ ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా ఉంటారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ చిత్రం తీశారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంది. షూటింగ్ చేసినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశా. నాపై ఓ బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుంది.
► దర్శకులు, రచయితలు మంచి కథలు, పాత్రలు రాస్తున్నారు కాబట్టి ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నా. నేను ఎంపిక చేసుకునే సినిమాలు కూడా నాకు బాగా కలిసొచ్చాయి. ఒక మూసలో పడిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేసే అవకాశం వస్తోంది. అందుకే నేను లక్కీ.
► ప్రస్తుతం తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’, తమిళంలో కార్తీక్ నరేన్‌తో ‘నరగసూరన్’ సినిమాలు చేస్తున్నా. ఆ తర్వాత ఓ లేడీ డైరెక్టర్ సినిమా చేయనున్నా. యువ దర్శకులతో వరుస సినిమాలు చేయడానికి కారణం వారి కథలే. చక్కగా, వైవిధ్యంగా రాసుకుంటున్నారు. అందుకే నేను వారి సినిమాల్లో చేయడానికి ఒప్పుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment