విష్ణు హీరోగా అసెంబ్లీరౌడీ రీమేక్
స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలకు.., తమ ముందు తరం వారు చేసిన సక్సెస్ ఫుల్ సినిమాలను రీమేక్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. అయితే అలా రీమేక్ చేసి సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా భారీ అంచనాలు ఏర్పడటంతో పాటు ప్రతి విషయంలోనూ పాత సినిమాతో పోల్చిచూస్తారన్న భయంతో చాలామంది రీమేక్ చేయాలని ఉన్నా ఊరుకుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
మోహన్ బాబు కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన పోయిన చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా హీరోగా మోహన్ బాబు రేంజ్ను తారస్థాయికి తీసుకెళ్లింది. బి. గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ అందించిన పదునైన మాటలు సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాయి. అందుకే ఇప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు అసెంబ్లీ రౌడీ స్పెషల్ సినిమానే. ఆ సినిమాను ఇప్పుడు మంచు వారబ్బాయి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విష్ణు, కామెడీ, యాక్షన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే బాటలో ఇప్పుడు తన తండ్రి కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేసి తానెంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ జనరేషన్కు తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. మరి పాతికేళ్ల క్రితం మురిపించిన అసెంబ్లీ రౌడీ ఈ జనరేషన్ను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.