సాక్షి, హైదరాబాద్: సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీ రద్దు లేఖ ఇచ్చిన వెంటనే గవర్నర్ నరసింహన్ సంతకం పెట్టడమేంటని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డి.కె.సమరసింహారెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్ 356 ప్రకారం విచారణ చేయకుండా అసెంబ్లీ రద్దును ఎలా ఆమోదిస్తారని ఆయన అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం, గవర్నర్‌ల వ్యవహారం చూస్తుంటే ఇద్దరూ అనుకునే ముందస్తుగా రద్దు చేశారని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
అసలు అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో చెప్పలేకపోతున్నారని, అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉండి, రాష్ట్ర ఆదాయం 21.9 శాతం పెరిగితే రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రం ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్–టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయంటే కేసీఆర్‌లో భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీతో తాము పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారని, మరి టీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు ఏమైందని వ్యాఖ్యానించారు. తాము చేస్తే శృంగారం.. వేరొకరు చేస్తే వ్యభిచారమనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని డి.కె. విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment