ప్రశ్నించడమే ‘ముందస్తు’కు కారణమైతే ఎలా? | Dasoju Sravan Article On KCR Over Early Poll Move In Telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 16 2018 2:09 AM | Last Updated on Sun, Sep 16 2018 2:09 AM

Dasoju Sravan Article On KCR Over Early Poll Move In Telangana - Sakshi

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ప్రశ్నించడం. అలా ప్రశ్నించడమే తప్పని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అంటున్నారు. అసెంబ్లీ రద్దును ప్రశ్నించినందుకే ప్రజలను, ప్రజాసంఘాలను ఆయన నిందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమంటున్నారు. అసలు కారణం చెప్పడం లేదు. కేంద్రం, గవర్నర్, కేసీఆర్‌ కలిసి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్‌ పాత్ర అనుమానాస్పదంగానే ఉంది. రద్దుకు ముందు కేసీఆర్‌ బదిలీల ద్వారా నియమించుకున్న అధికారులు కూడా వారితో చేతులు కలిపితే తెలంగాణకు అపార నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

అభిప్రాయాలు మార్చుకో వడం తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నైజం. పెద్ద నోట్ల రద్దు సమ యంలో, జీఎస్టీ విష యంలో ఆయన మాట మార్చారు. ప్రజలకు మేలు చేస్తాయని చెబుతున్న జమిలి ఎన్నికలపై కూడా ఆయన మాటపై నిలబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ రాసిన లేఖకు కేసీఆర్‌ జులై ఆరున జవాబిస్తూ జమిలి ఎన్నికలకు తాను అనుకూ లమని చెప్పారు. శాసనసభ, లోక్‌సభకు విడివిడిగా ఎన్నికల నిర్వహణ వల్ల నాలుగు నుంచి ఆరు నెలల కాలం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని, జిల్లాల యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో మునిగి పోతుందని ముఖ్యమంత్రి తన లేఖలో చక్కగా వివ రించారు.

జమిలి ఎన్నికలపై నిర్వహించిన సమావేశా నికి టీఆర్‌ఎస్‌ తరఫున హాజరైన ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కూడా తర్వాత జమిలి ఎన్నికలతో లాభాలుంటాయని, విడివిడిగా నిర్వహిస్తే నష్టాలుం టాయని మాట్లాడారు. అయితే,  జమిలి ఎన్నికలపై తాను వెలిబుచ్చిన అభిప్రాయానికి వ్యతిరేకంగా సరిగ్గా రెండు నెలలకు సెప్టెంబర్‌ ఆరున కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేయించారు. విడివిడిగా ఎన్నికలు జరిపితే రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీలకు, అభ్యర్థులకు నష్టమని తన లేఖలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు.

ముందస్తు ఎన్నికల కారణంగా రాబోయే మూడు నెలల కాలం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సరిపోతుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం పడుతుంది. తర్వాత వచ్చే ఆరు నెలల కాలంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల హడా వుడి ఉంటుంది. ఈ లెక్కన సుమారు ఏడాది కాలం జాతీయ, రాష్ట్ర ఎన్నికలకే సరిపోతుంది. ఈ సంవ  త్సర కాలంలో ప్రభుత్వాధికారులు ఇతర పనులన్నీ వదిలేసి, యుద్ధప్రాతిపదికన జరిగే ఎన్నికల విధు ల్లోనే నిమగ్నమైపోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి స్తంభించిపోతుంది. ప్రజా సంక్షే మంపై నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ప్రజా ధనం భారీగా ఖర్చవుతుంది. ఈ విషయాలన్నీ ఆప ద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌కు తెలుసని ఆయన లా కమిషన్‌కు రాసిన లేఖ చదివితే అర్థమవుతుంది.

జమిలి ఎన్నికలు జనానికి మేలు చేస్తాయన్న తన అభిప్రాయం రెండు నెలలకే మార్చుకోవడానికి కారణాలేంటో కేసీఆరే చెప్పాలి. దాదాపు నాలుగైదు నెలలు ముందే వస్తున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా జరిగే నష్టాలకు తాను ఎందుకు ఆహ్వానం పలికా నన్న అంశంపై కేసీఆర్‌ వివరణ ఇచ్చి తీరాలి. జమిలి ఎన్నికలపై తన అభిప్రాయం ఎందుకు మారిందీ వివరించకుండా ముందస్తుకు తాను వెళ్లడానికి కారణం కాంగ్రెసేని కేసీఆర్‌ చెప్పడం ఆయన వక్ర రాజకీయ విధానానికి నిదర్శనం. తాను అసెంబ్లీని రద్దు చేయించబోతున్నాననే విషయంపై మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇచ్చారు. రద్దు ఎప్పుడు, ఎలా జరుగుతుందనే విషయంపై గంటలు, నిమిషాలవా రీగా మీడియాకు లోపాయికారిగా తెలిపి మరీ అసెం బ్లీని రద్దు చేశారు. ఈ పనికి ముందు ప్రగతి నివేదన పేరుతో తన బలప్రదర్శనకు ప్రయత్నించారు. ఇది విజయవంతం కాకున్నా తన కార్యక్రమంలో మాత్రం మార్పు లేకుండా శాసనసభను రద్దుచేయించారు.

తన ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం కారణం తాను కాదని, కాంగ్రెసేనని చెప్పడం కేసీఆర్‌కే చెల్లింది. కాంగ్రెస్‌ తాను ఏం చేసినా నిలదీస్తోందని, తన నిర్ణయాల వెనుక ఉండే నిజాల నీడల జాడలను వెతుకుతోందని, ఒక్క మాటలో చెప్పాలంటే అడుగ  డుగునా తనను ప్రశ్నిస్తోందని కేసీఆర్‌ ఆక్రోశించారు. ఆయన మాటలే నిజమనుకున్నా, బాధ్యతగల ప్రతి పక్షంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పే ముంది? నేడు ప్రతిపక్షంలో కాంగ్రెస్‌ ఉన్నా, రేపటి ఎన్నికల తర్వాత ఆ స్థానంలోకి టీఆర్‌ఎస్‌ రావచ్చు. కాని, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా దాని ప్రధానమైన పని ప్రశ్నించడమే. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చు కోవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌పై నింద లేస్తున్నారు. కేసీఆర్‌ స్వయంగా చెప్పిన విషయాలను బట్టి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో తొలి ఆరు నెలల కాలం ఏమీ అర్థం కాని అయోమయస్థితిలో వృథాగా పోయింది.

ముందస్తు రద్దు కారణంగా మరో పది నెలలు గడచిపోయాయి. ఈ లెక్కన ఐదు సంవత్సరాల్లో ఏడాదిన్నర కాలాన్ని ముఖ్యమంత్రి తన అసమర్ధత కారణంగా వృథా చేశారు. ఇప్పుడు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకే సారి జరగని పరిస్థితిని సృష్టించడంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా విడివిడిగా నిర్వహించక తప్పదు. జమిలి ఎన్నికలను పక్కన పెట్టి తాను విడిగా ఎన్నికలకు వెళ్లాలనుకునే పథకం వెనుక కుట్ర కోణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వి నియోగం చేసి, సానుకూల  ఫలితాలు సాధించడం ఆయన ప్రధాన ఉద్దేశం. ఇందుకు అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసిన రెండు పడకగదుల ఇళ్లు, మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు అనే ప్రధాన హామీలను నెరవేర్చక పోయినా, మళ్లీ ఎలాగైనా అధికారం దక్కించుకోవా లని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అధికారుల పనితీరును బట్టి కాకుండా తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగాయి.

శాసనసభ రద్దుకు మంత్రివర్గ తీర్మాన లేఖను గవర్నర్‌కు ఇచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు విషయంలో ఏం చేయాలనే అంశంపై గవర్నర్‌ కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆప ద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు బాధ్య తలు వెంటనే అప్పగించడం, సంబంధించిన ఉత్త ర్వులు మీడియాకు అందడం క్షణాల్లో జరిగిపో యాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవా ల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.
వ్యాసకర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

-దాసోజు శ్రావణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement